కృత్రిమ కాళ్లతోనే... యోగా పాఠాలు!

భవిష్యత్తుపై ఎన్నో కలలు...వాటిని సాకారం చేసుకోవాలనే ఆలోచనలతో ఆమె జీవితం అందంగా సాగిపోతోంది. అప్పుడే దురదృష్టవశాత్తూ ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లనూ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అయితే, నిరాశలో కూరుకుపోతారు. జీవితం ఇక ముగిసిపోయిందనుకుంటారు. కానీ, హైదరాబాద్‌కి చెందిన అర్పితా రాయ్‌ మాత్రం  కృత్రిమ కాళ్ల సాయంతో లేచి నిలబడటమే కాదు... యోగాసనాలూ వేస్తోంది.

Updated : 21 Jun 2024 07:36 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం...

భవిష్యత్తుపై ఎన్నో కలలు...వాటిని సాకారం చేసుకోవాలనే ఆలోచనలతో ఆమె జీవితం అందంగా సాగిపోతోంది. అప్పుడే దురదృష్టవశాత్తూ ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లనూ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అయితే, నిరాశలో కూరుకుపోతారు. జీవితం ఇక ముగిసిపోయిందనుకుంటారు. కానీ, హైదరాబాద్‌కి చెందిన అర్పితా రాయ్‌ మాత్రం  కృత్రిమ కాళ్ల సాయంతో లేచి నిలబడటమే కాదు... యోగాసనాలూ వేస్తోంది. శిక్షకురాలిగా మారి పదిమందికీ నేర్పిస్తోంది. ఆ స్ఫూర్తి ప్రయాణాన్ని ‘వసుంధర’తో ఇలా పంచుకుంటోంది.  

కాళ్లు తడవకుండా సముద్రాన్నీ, కన్నీళ్లు కార్చకుండా జీవితాన్నీ దాటలేం... మరి కష్టమొచ్చిందని జీవన ప్రయాణాన్ని ఆపేస్తే ఎలా? అందుకే, రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా నా బతుకే తలకిందులైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. రెండు కాళ్లూ లేకపోయినా నా అంతట నేను లేచి నిలబడగలుగుతున్నా. యోగా టీచర్‌గా మారి మరెంతో మంది జీవితాల్లో స్ఫూర్తి నింపాలనే లక్ష్యంతో సాగుతున్నా. మా స్వస్థలం  పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలోని బ్యారక్‌పూర్‌. కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు. 

2006 ఏప్రిల్‌ 21. ఆరోజు సాయంత్రం ఇంటికి అవసరమైన సరకులు తేవాలని స్నేహితుడి బండి మీద బయలుదేరా. ఇక కాసేపట్లో గమ్యం చేరుకుంటాం అనుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ బైక్‌ మమ్మల్ని గుద్దేసింది. ఆ వేగానికి రోడ్డు మీద పడిపోయాం. ఆ వెనకే వస్తోన్న లారీ నా రెండు కాళ్లమీదుగా వెళ్లడంతో నుజ్జయిపోయాయి. వెంటనే ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ప్రాథమిక చికిత్స చేసి, పెద్దాసుపత్రికి పంపించారు. అయితే, రెండు కాళ్లకూ ఆపరేషన్‌ చేయాలంటే లక్షల్లో డబ్బులు కావాలన్నారు. నాకంటే ఏడాది పెద్దయిన అన్నయ్యే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టపడితేనే కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు. ఇందుకు పన్నెండు రోజుల సమయం పట్టింది. ఈలోగా గాంగ్రిన్‌ ఇన్ఫెక్షన్‌ ఎనభైశాతం ఒంటికి పాకేసింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వెంటనే శస్త్రచికిత్స చేస్తే ఒక కాలైనా ఉండేదేమో! కానీ రెండు కాళ్లూ మోకాలి కింది వరకూ తీసేయాల్సి వచ్చింది. మత్తు దిగాక విషయం తెలిసి గుండెలవిసేలా ఏడ్చా. కానీ, ఫలితం ఉండదని అర్థమైంది. ఆపై నాలుగు నెలలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా. 

ఎవరి మీదా ఆధారపడొద్దని... 

అందరు ఆడపిల్లల్లానే నాకూ కొన్ని కలలు ఉండేవి. ఎయిర్‌ హోస్టెస్‌గానో, మోడల్‌గానో రాణించాలని అనుకునేదాన్ని. ఆ దిశగా దారులు వేసుకుంటోన్న సమయంలోనే ఈ యాక్సిడెంట్‌. అంతా తలకిందులైంది. కొందరు జాలి చూపించేవారు. ఇంకొందరేమో నేనెప్పటికీ కుటుంబానికి భారమే అంటూ నిట్టూర్పులు విడిచేవారు. ఇవన్నీ నా మనసుకి బాధ కలిగించేవి. అయినా, ఎన్నాళ్లిలా ఏడుస్తూ కూర్చుంటా... అందుకే నెమ్మదిగా  వాస్తవాన్ని అంగీకరించడం మొదలుపెట్టా. వైద్యులు నా శరీరాకృతి దెబ్బతినకుండా ఉండటానికి రోజూ ఓ గంట నిలబడమన్నారు.  పంటిబిగువున బాధను భరిస్తూ చాలా కష్టంగా అలవరుచుకున్నా. మామూలు మనిషిని కావడానికి చక్రాల కుర్చీలోనే వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశా. చివరికి ఓ కాల్‌ సెంటర్‌లో చేరా. నాకు ఇతరులపై ఆధారపడటం ఇష్టం ఉండేది కాదు... దీనికోసం నా శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని భావించా. ఇందుకు యోగా ఉపయోగపడుతుందని చెప్పడంతో కృత్రిమ కాళ్లతో సాధన చేయడం ప్రారంభించా. 

ఫొటోల్లో కాళ్లు కనిపించకుండా...

అంతా నీవల్ల కాదన్నారు. కానీ, ప్రయత్నలోపం ఉండకూడదని గట్టిగా అనుకున్నా. మొదట చిన్నగా ఆరంభించా. ఆపై క్లిష్టమైన ఆసనాలూ వేయగలిగా. కొన్ని భంగిమల్ని వేయడం సాధారణ వ్యక్తులకైనా కష్టమే. అలాంటి వాటిపైనా నేను పట్టు సాధించగలగడం చూసి అంతా ఆశ్చర్యపోయేవారు. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేదాన్ని. కొత్తల్లో నా కాళ్లు కనిపించకుండా స్కర్ట్‌లు, వదులు ప్యాంట్లు వేసుకుని ఉన్న ఫొటోలను మాత్రమే క్రాప్‌ చేసి అప్‌లోడ్‌ చేసేదాన్ని. కానీ, తరవాత నన్ను నేను అంగీకరించగలిగితేనే ఇతరులూ ఇష్టపడతారని అర్థం చేసుకున్నా. అంతా అభినందించడంతో నాలో మరింత ఉత్సాహం వచ్చింది. నేనూ ఇతరులకూ బోధించగలనన్న నమ్మకం వచ్చాక ఉపాధ్యాయ కోర్సులు చేశా. తరవాత యోగా టీచర్‌ ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డా. అలా 2019నుంచి ఔత్సాహికులకు యోగా పాఠాలు నేర్పించడం ఆరంభించా. ఒకరిద్దరితో మొదలైన ఈ తరగతుల్లో కొవిడ్‌ ముందు నాటికి ఇద్దరు దివ్యాంగులతో సహా పాతికమంది విద్యార్థులు ఉండేవారు. వారీ విషయాన్ని మరికొంతమందితో చెప్పడంతో క్రమంగా ఆ సంఖ్య పెరిగింది. అయితే, నేనిప్పుడు వినియోగిస్తున్న కృత్రిమ కాళ్లు మాన్యువల్‌ రకాలు. మైక్రోప్రాసెసర్, అడ్వాన్స్‌డ్‌ లింబ్స్‌ ఖరీదైనవి కావడంతో ఇప్పటివరకూ కొనుక్కోలేకపోయా. భవిష్యత్తులో వాటి సాయంతో మరిన్ని అద్భుత ప్రయోగాలు చేయగలుగుతానని నమ్ముతున్నా. మరో పక్క యోగా సైకాలజీ, గైడెడ్‌ మెడిటేషన్, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు పూర్తి చేశా. ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఫుల్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నా. మరో పక్క  సాధారణ వ్యక్తులతో పాటు ప్రత్యేక అవసరాలున్న చిన్నారులూ, దివ్యాంగులు, కృత్రిమ కాళ్లతో నడిచే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నా. సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) పోలీసులకూ వర్క్‌షాపులు నిర్వహించా. దేశవిదేశాల్లోని వారికీ ఆన్‌లైన్‌ తరగపాటు కాలేజీలు, యోగా సమావేశాల్లో మోటివేషన్‌ స్పీచ్‌లనూ ఇస్తున్నా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్