ఆ పుస్తకం ఎందరికో పాఠం!

ఆచార్య కొలకలూరి ఇనాక్‌.. కొందరు ఆయన్ని సాహితీవేత్తగా ప్రేమిస్తే, మరికొందరు పాఠాలు నేర్పిన గురువుగా అభిమానిస్తారు. మొత్తంగా మా నాన్న ‘మనుషుల మనిషి’ అంటారు ఆయన కుమార్తె, ద్రవిడ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మధుజ్యోతి...

Published : 16 Jun 2024 03:42 IST

ఆచార్య కొలకలూరి ఇనాక్‌.. కొందరు ఆయన్ని సాహితీవేత్తగా ప్రేమిస్తే, మరికొందరు పాఠాలు నేర్పిన గురువుగా అభిమానిస్తారు. మొత్తంగా మా నాన్న ‘మనుషుల మనిషి’ అంటారు ఆయన కుమార్తె, ద్రవిడ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మధుజ్యోతి...

‘దళిత కుటుంబం నుంచి వచ్చారు. పదేళ్ల వయసులో తండ్రి చనిపోతే... కుటుంబ భారం మోస్తూ, చదువుకున్నారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా, గొప్ప సాహితీవేత్తగా ఎదిగారు. పద్మశ్రీ అందుకున్నారు. మేం నలుగురు పిల్లలం. చాలా చిన్నప్పుడు... మా అక్కకు గురజాడ వారి పూర్ణమ్మకథ చెబుతోంటే కాస్త దూరంలో నిలబడి వింటున్న నాకు ఏడుపు ఆగలేదు. మా నాన్న అంతగొప్పగా కథలు చెప్పగలరని తెలిసిందప్పుడే. ఓసారి బావిలో చిన్న కుక్కపిల్ల పడిపోయి... భయంతో ఏడుస్తూ ఉంది. దాన్ని రక్షించడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. నాన్న మాత్రం బావిలోకి దిగి ఆ కుక్కపిల్లని పైకి తీసుకొచ్చారు. ఒళ్లంతా గీరుకుపోయింది. మా నాన్నలోని మానవతావాది గురించి తెలిసిందప్పుడు. ఒక బిక్షగాడు దొంగతనం చేశాడని అందరూ కొడుతుంటే... వాళ్లని వారించి అతనికి తిండి పెట్టారు. ఇవన్నీ నాన్నకే తెలియకుండా నాన్న ప్రభావం నాపై పడేట్టు చేశాయి. నేను జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పరీక్ష కోసం సిద్ధమవుతోంటే లైబ్రరీకి నా వెంటే వచ్చి, ఏ పుస్తకాలు చదవాలో చెప్పారు. నాన్నంతటి వ్యక్తి నావెంట లైబ్రరీకి వచ్చి పుస్తకాలు తీసి ఇస్తుంటే కెరియర్‌ పట్ల నేను ఇంకెంత సీరియస్‌గా ఉండాలో నాకర్థమయ్యింది. నేను రాసిన వ్యాసం మొదటిసారి ప్రచురితమై నూటయాభై రూపాయలు వస్తే... దాంతో ఆయన నాకు వెండిగ్లాసు కొనిచ్చారు. నా బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ వెండిగ్లాసు ఇప్పటికీ ఓ హెచ్చరికలా కనిపిస్తుంది. నేను వీసీగా ఎదిగానంటే అందుకు కారణం నాన్నే. ఆయనపై నేను రెండు పుస్తకాలు రాశాను. ఒకటి నాన్న పేరుతో ఆయన జీవిత చరిత్ర, రెండోది ఆయన సాహితీ చరిత్ర. నాన్న పుస్తకం ఎంతోమందికి వ్యక్తిత్వ వికాస పాఠంలా మారడం నా అదృష్టం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్