మోదీ మెచ్చిన బిజియ చేనేత...

పూలు ఎంత కోమలంగా ఉంటాయో కదా... వాటితో నేసే దుస్తులూ అంతే మృదువుగా ఉంటాయి. అంటూ పర్యావరణహితంగా కలువకాడల నారను ఉపయోగించి దారపుపోగులు తీసి, వస్త్రాలను తయారుచేస్తోంది బిజియశాంతి టోంగ్‌బ్రామ్‌.

Published : 07 Jul 2024 03:55 IST

పూలు ఎంత కోమలంగా ఉంటాయో కదా... వాటితో నేసే దుస్తులూ అంతే మృదువుగా ఉంటాయి. అంటూ పర్యావరణహితంగా కలువకాడల నారను ఉపయోగించి దారపుపోగులు తీసి, వస్త్రాలను తయారుచేస్తోంది బిజియశాంతి టోంగ్‌బ్రామ్‌. నాణ్యమైన దుస్తులు అందించడమే కాదు కొంతమంది ఆడవారికి ఉపాధిని కల్పించి యువ  పారిశ్రామికురాలిగా నిలిచిన ఈమె కథ ఏంటో తెలుసుకుందాం...

బాల్యంలో తను పెరిగిన వాతావరణమే ఇప్పుడు పర్యావరణం గురించి ఆలోచించేలా చేసింది అంటోంది బిజియశాంతి. ఈమెది మణిపుర్‌లోని కుగ్రామం. తండ్రి జై  కుమార్‌ మత్య్స శాఖలో స్థిరపడ్డారు. తల్లి చనాహల్‌ గృహిణి. చిన్నతనం నుంచి మొక్కలు, పర్యావరణంపై ఇష్టంతోనే పెద్దయ్యాక వృక్షశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. తరవాత సొంతూరులో అగ్రిటూరిజం చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అయితే అక్కడ సమీపంలో ఉండే సరస్సులో కలువకాడలను తెచ్చి వాటిని మధ్యకు విరిచి, దానినుంచి వచ్చే ఫైబర్‌తో వస్త్రాలను తయారుచేసే కొందరు రైతులను చూసి నేనెందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టకూడదంటూ... దానిపై శిక్షణ తీసుకుంది. కుటుంబ ప్రోత్సాహం ఉండటంతో సనాజింగ్‌ సనా తంబల్ఠ్‌ పేరుతో చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించింది. దానికోసం స్టార్టప్‌ మణిపుర్‌ అనే పథకం ద్వారా రూ. 1.5 లక్షల రుణం తీసుకున్నా... ఉదయాన్నే సరస్సుకు వెళ్లి పూలు తెచ్చేదాన్ని. మామూలు రోజులు కన్నా మే నుంచి డిసెంబర్‌లో ఇవి ఎక్కువగా పూస్తాయి. అలా వాటి కాడల నడుమ ఉండే నారను చేతితో తీసి ఎండలో ఉంచితే దాని నుంచి దారం వస్తుంది. ఆ తరవాత స్పిన్నింగ్‌ వీల్‌ లేదా మగ్గంపై దుస్తులు నేస్తాం అని చెబుతోంది బిజియ. అలా వాటితో శాలువాలు, మఫ్లర్స్, స్కార్ఫ్‌లు, ఫేస్‌ మాస్కులు తయారు చేస్తూ ముంబయి, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్‌ నగరాలకు పంపిస్తోంది. దాదాపు 40మంది మహిళలకు ఉపాధినీ కల్పించింది బిజియ. నీటి మొక్కల వల్ల ఉపయోగాలను అందరికీ చెబుతూ వ్యర్థాల వాడకం తగ్గించి పర్యావరణహితంగా చేయాలన్నదే బిజియ కల. అలా మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌ ప్రశంసల్నీ అందుకున్న బిజియ వినూత్న ప్రయత్నం మీకూ నచ్చిందా?  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్