శృంగారం గురించి మాట్లాడితే ‘డర్టీ గర్ల్’ అన్నారు!

‘వయసుతో సంబంధం లేదు.. పెళ్లైందా, సింగిలా అన్నది మాకు అక్కర్లేదు.. అమ్మాయైతే చాలు..’ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. మనుషుల మధ్యే తిరుగుతూ రాక్షసుల్లా మారి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

Updated : 30 Sep 2021 13:19 IST

(Photo: Facebook)

‘వయసుతో సంబంధం లేదు.. పెళ్లైందా, సింగిలా అన్నది మాకు అక్కర్లేదు.. అమ్మాయైతే చాలు..’ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. మనుషుల మధ్యే తిరుగుతూ రాక్షసుల్లా మారి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరి, ఇలాంటి ఘటనల్లో బాధితురాలినే తప్పు పడుతోంది నేటి సమాజం. నచ్చిన డ్రస్‌ వేసుకొని, అందంగా ముస్తాబవడం కూడా తప్పంటోంది. అయితే ఇవన్నీ కాదు.. ఈ ఘటనలన్నింటికీ మూలకారణం సెక్స్‌ గురించి సరైన రీతిలో అవగాహన లేకపోవడం, సమాజం దీన్నో కళంకంగా భావించడమే అంటోంది దిల్లీకి చెందిన పల్లవి బర్న్‌వాల్‌. గుసగుసలాడడం, ‘ఛీ’ అంటూ అసహ్యించుకోవడాన్ని పక్కన పెట్టి పిల్లలకు చిన్నతనం నుంచే శృంగారం గురించి ఏది మంచో, ఏది చెడో చెప్పమంటోంది. ఆడవాళ్లు కూడా సిగ్గు పడకుండా తమ లైంగిక కోరికల (Sexual Fantasies) గురించి పంచుకోవడంలో తప్పు లేదంటోంది. ఈ నేపథ్యంలోనే మహిళలు లైంగిక అంశాలకు సంబంధించి తమ అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి, దాంపత్య సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఓ వేదికను సైతం ప్రారంభించిందామె. ఎవరేమనుకున్నా, ఈ సమాజం తనను చెడుగా చూసినా.. తాను చేసే పని నలుగురికీ ఉపయోగపడితే చాలంటోన్న పల్లవి.. తన ప్రస్థానం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

సెక్స్‌ గురించి బయటికి మాట్లాడడాన్నే ఓ కళంకంగా భావిస్తుంది మన సమాజం. అలాంటిది లైంగిక విద్యను అందరికీ పంచుతానంటే ఊరుకుంటుందా? అసలు ఈ అమ్మాయే అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని నిందలేస్తుంది. నా కెరీర్‌ని ఎంచుకున్నప్పుడు నేనూ ఇలాంటి ఎన్నో అపనిందల్ని మోశా. జార్ఖండ్‌లోని బొరాకో స్టీల్‌ సిటీలో పుట్టి పెరిగిన నేను.. చిన్నతనం నుంచి అమ్మానాన్నల మధ్య జరిగే గొడవల్ని చూస్తూ పెరిగా. వీటివల్ల ఒకానొక దశలో మానసిక ఒత్తిడిలో కూరుకుపోయా. అయితే నా వైవాహిక జీవితంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయని అప్పుడు నేను ఊహించలేదు.

పెళ్లి కలిసి రాలేదు!

ఎంబీయే పూర్తయ్యాక దిల్లీలోని ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పెళ్లైపోయింది. కానీ ఈ వివాహ బంధం నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఈ క్రమంలో ఇంటి బాధ్యతల దగ్గర్నుంచి సంపాదన దాకా .. ఇలా ప్రతిదీ నామీదే భారం పడింది. దీనికి తోడు పురుషాధిపత్యం అంటే ఏంటో పెళ్లయ్యాకే నాకు అవగతమైంది. అయినా ఆడవాళ్లే అన్ని పనులు ఎందుకు చేయాలి? ఒకవేళ చేసినా అమ్మాయిల్నే ఈ సమాజం ఎందుకు తప్పు పడుతుంది? పైగా నెలసరి, లోదుస్తులు, శృంగారం.. ఈ విషయాల గురించి మాట్లాడితే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది? ఇలా నా మనసులో ఎన్నో ప్రశ్నలు వేధించాయి. ఇదే సమయంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితుల ప్రేమకథలు, వాళ్ల రిలేషన్‌షిప్స్‌ గురించిన జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. అయినా శృంగారం గురించి తెలుసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు.. కానీ దాని గురించి నలుగురిలో మాట్లాడాలంటే మాత్రం భయం, బిడియం.. ఎందుకిలా? ఈ ఆలోచనలు, అనుభవాలే.. లైంగిక విద్య గురించి అవగాహన కల్పించాలన్న ఆలోచనను నా మనసులో రేకెత్తించాయి.

దాని ముఖ్యోద్దేశమదే!

పెళ్లి బంధం అచ్చి రాక మూడేళ్లకే నా భర్త నుంచి విడాకులు తీసుకున్నా. ఈ క్రమంలో నచ్చని బంధం నుంచి బయటికొచ్చిందని చులకనగా చూశారే తప్ప.. అసలు ఇలా జరగడానికి కారణమేంటని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. అయినా ఆ విమర్శలన్నీ తట్టుకొని ముందుకు సాగా. లైంగిక విద్యపై అవగాహన కల్పించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో 2018లో TARSHI (Talking About Reproductive and Sexual Health Issues) అనే దిల్లీకి చెందిన ఎన్జీవో నుంచి సెక్సువాలిటీ ఎడ్యుకేషన్‌ కోర్సు పూర్తి చేశా. ఆ తర్వాత RedWomb (getintimacy.com) పేరుతో ఓ ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించా. శృంగారం, దాని వల్ల పొందే ఆనందాన్ని, అనుభవాల్ని వివరంగా చర్చిస్తూ; ఈ అంశాలకు సంబంధించి శాస్త్రీయమైన అవగాహన కల్పించే వేదికే ఇది. అనుబంధాల్లో కలతల్ని తొలగించి ప్రేమను, ఆనందాన్ని పెంచే ముఖ్యోద్దేశంతోనే ముందుకు సాగుతున్నా. ఎందుకంటే శృంగారం అనేది శరీరానికి సంబంధించిందే కాదు.. మనసునూ ఉత్తేజపరుస్తుంది.. దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

అంతేకాదు.. లైంగిక విద్య గురించి అవగాహన పెంచే క్రమంలో పలు కార్యక్రమాలు, డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నా.. లైంగికంగా ఎదురయ్యే పలు సమస్యలు, అపోహలకు నిపుణుల ద్వారా పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ దిశగా అవగాహన కల్పిస్తోన్న పలు కంపెనీలతో కలిసి పనిచేస్తున్నా.. సందర్భం వచ్చినప్పుడల్లా దీని గురించి టెడెక్స్‌(TedEx) వేదికలపైనా గళాన్ని వినిపిస్తున్నా. ఆర్టికల్స్‌, బ్లాగ్స్‌ రాయడం నాకు ముందు నుంచీ అలవాటుంది.. ఈ నేపథ్యంలో లైంగిక పరమైన అంశాలకు సంబంధించిన వ్యాసాలు సైతం రాస్తున్నా. అలాగే పలు పుస్తకాలు కూడా రాశా.

‘డర్టీ గర్ల్‌’ అన్నారు!

అమ్మాయిలు నెలసరి గురించి బయటికి మాట్లాడితేనే సహించని ఈ సమాజం శృంగారం గురించి మాట్లాడితే ఊరుకుంటుందా..? చెప్పండి! అందుకే నేను ఎంచుకున్న ఈ మార్గాన్ని మా బంధువులతో పాటు చాలామంది తప్పుబట్టారు. నేను చేస్తోంది ఓ చెడ్డ పని అని, నన్ను ఓ చెడ్డ అమ్మాయి (డర్టీ గర్ల్‌) కింద లెక్కేశారు. ఇప్పటికీ వాళ్లలో ఆ ఫీలింగ్‌ ఉందనుకోండి. కానీ నేను ఇవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశా. అంతేకాదు.. లైంగిక పరమైన అంశాలకు సంబంధించిన వీడియోలు, సమాచారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే క్రమంలోనూ ఎంతోమంది మగవాళ్లు అసభ్యకరమైన సందేశాలు పంపేవారు. అయినా నేను ఎంచుకున్న ఈ మార్గం నలుగురికీ ఉపయోగపడితే చాలనుకున్నా.

అప్పుడే ఈ అఘాయిత్యాలు ఆగుతాయి!

నేను ఎంచుకున్న కెరీర్‌ గురించి తెలుసుకొని ఇప్పటికీ ప్రశంసించే వారి కంటే విమర్శించే వారే ఎక్కువ. అంతెందుకు.. నా కొడుకు కూడా భవిష్యత్తులో నన్ను, నా పనిని అసహ్యించుకుంటాడని చాలామంది అంటుంటారు. కానీ ఇదీ సమాజానికి ఉపయోగపడే పనే అని తను భవిష్యత్తులో తప్పకుండా తెలుసుకుంటాడు. అయినా అదంతా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పద్ధతిని బట్టే ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. లైంగిక విద్య గురించి వాళ్లకు తెలియకుండా గుసగుసలాడుకోవడం, అదేదో తప్పు అన్న భావన వారిలో కలిగించడం, వారిని నియంత్రించడం వల్లే ప్రస్తుతం లైంగిక దాడులు, పోర్న్‌ వీడియోలు చూసే చిన్నారుల సంఖ్య పెరుగుతోందన్నది వాస్తవం. అందుకే వారు ఈ దిశగా ప్రేరేపితం కాకూడదంటే పేరెంట్స్‌ చిన్నతనం నుంచే లైంగిక విద్యలో భాగంగా ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలు వారికి తెలియజేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్నీ పెంచాలి. అప్పుడే శృంగారం పేరుతో ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. ఓ తల్లిగా ఈ విషయాలు మీకు చెప్పడం కాదు.. నా కొడుకును కూడా ఇలా మంచి దారిలో నడిచేలా, సమాజానికి తన వంతుగా ఉపయోగపడేలా పెంచుతా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్