బాక్సింగ్‌ నా ప్రాణం.. అందుకే దేశం వీడా!

ఆమెకు బాక్సింగ్‌ అంటే ప్రాణం.. ఈ క్రీడ కోసం దేనైన్నా వదులుకుంటా.. కానీ క్రీడను మాత్రం వదులుకోనంటోంది. అంతలోనే తన దేశంలో తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో.. ఎన్నటికైనా వాళ్లు తనకు ప్రాణప్రదమైన ఆటను తన నుంచి దూరం చేస్తారని గ్రహించింది.

Published : 14 Sep 2021 16:16 IST

(Photos: Facebook)

ఆమెకు బాక్సింగ్‌ అంటే ప్రాణం.. ఈ క్రీడ కోసం దేనైన్నా వదులుకుంటా.. కానీ క్రీడను మాత్రం వదులుకోనంటోంది. అంతలోనే తన దేశంలో తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో.. ఎన్నటికైనా వాళ్లు తనకు ప్రాణప్రదమైన ఆటను తన నుంచి దూరం చేస్తారని గ్రహించింది. అందుకే ముందస్తుగానే దేశం వీడి.. ఖతర్‌కు శరణార్థిగా వెళ్లింది. అయినా ‘అఫ్గానిస్తాన్‌ నేషనల్‌ బాక్సింగ్‌ టీమ్‌’లో సభ్యురాలిగా తన దేశం తరఫున క్రీడల్లో పాల్గొంటానంటోంది. ఆమే ఆఫ్గానిస్తాన్‌ యువ బాక్సర్‌ సీమా రెజాయ్‌. తానెక్కడున్నా తన గుండె బాక్సింగ్‌ కోసం, తన దేశం కోసమే కొట్టుకుంటుందంటోన్న ఈ యంగ్‌ బాక్సర్‌.. అఫ్గాన్‌ మహిళల వెతల్ని ప్రపంచానికి చాటడానికి తానెప్పుడూ ముందే ఉంటానంటోంది.

సీమా రెజాయ్‌.. తాలిబన్ల అరాచక పాలన అంటే ఎలా ఉంటుందో తన తల్లిదండ్రులు చెప్తే వినడమే కానీ.. ఎప్పుడూ చూసింది లేదు. ఎందుకంటే ఆమె పుట్టే నాటికే తాలిబన్ల పాలన అంతమై రెండేళ్లు గడిచింది. ఆ ఊబిలోంచి అప్పుడప్పుడే మహిళలు బయటపడుతూ తమకు నచ్చినట్లుగా ఉండడం నేర్చుకుంటున్నారు. ఇదే వాతావరణంలో పెరిగిన సీమ.. పెద్దయ్యే క్రమంలో క్రీడలంటే మక్కువ పెంచుకుంది.

అమ్మానాన్న ఒప్పుకోలేదు.. అయినా!

అందులోనూ బాక్సింగ్‌పై మమకారం పెంచుకుంది సీమ. అదెంతలా అంటే.. బాక్సింగ్‌పై ప్రేమతో రెండు చేతులపై ‘బాక్సర్‌’ అని ట్యాటూ వేయించుకున్న ఈ అఫ్గాన్‌ బాక్సర్‌.. ఒలింపిక్స్‌ రింగ్స్‌ని కూడా పచ్చబొట్టు పొడిపించుకుంది. అయితే తానీ క్రీడను ఎంచుకోవడం మొదట్లో తన పేరెంట్స్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదని చెబుతోందీ యంగ్‌ బాక్సర్‌.

‘అమెరికన్‌ రెజ్లర్‌ రోండా రౌజీని చూశాకే బాక్సింగ్‌ క్రీడలో రాణించాలని ఫిక్సయ్యా! బాక్సింగ్‌ అంటే నాకు పంచ ప్రాణాలు. ఏదైనా లేకుండా ఉండగలుగుతానేమో గానీ బాక్సింగ్‌ లేకుండా ఉండలేను. నా వృత్తి, ప్రవృత్తి, లక్ష్యం.. అన్నీ బాక్సింగే! అయితే నేను ఈ క్రీడను ఎంచుకుంటానంటే మొదట్లో అమ్మానాన్న అస్సలు ఒప్పుకోలేదు. నాకు కోచింగ్‌ ఇవ్వడానికి కూడా కోచ్‌లెవరూ ముందుకు రాలేదు.. ఈ రెండింటికీ కారణం ఒక్కటే! అదేంటంటే.. మా దేశంలో ఈ క్రీడలోకి మహిళలు ప్రవేశించడం అనేది చాలా అరుదైన విషయం! ‘అమ్మాయివి.. నీకెందుకు బాక్సింగ్‌!’ అంటూ నన్ను నిరాశపరిచే ప్రయత్నం చేశారంతా. సాధన చేసే చోట కూడా అందరూ అబ్బాయిలే ఉండేవారు.. అయినా ఎలాగైనా ఇందులో రాణించాలని పట్టుబట్టా. అమ్మానాన్నల్ని ఒప్పించా.. కఠోర శ్రమ చేసి ఆరు నెలల్లోనే జాతీయ బాక్సింగ్‌ జట్టులో చోటు దక్కించుకున్నా..’ అంటోంది సీమ.

దేశం వీడి శరణార్థిగా..!

గత రెండేళ్లుగా వివిధ పోటీల్లో తిరుగులేని విజయాలు సాధిస్తోన్న ఈ యువ బాక్సర్‌.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండించాలని, తద్వారా తన దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆశయంగా పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా తన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో తన ఆశలన్నీ అడియాశలవుతాయేమోనని భయపడిపోయానంటోంది.

‘తాలిబన్ల అరాచకాల గురించి అమ్మనాన్నలు చెప్తే వినడం తప్ప.. ఎప్పుడూ చూసింది లేదు. కానీ ఒక్కసారిగా వాళ్లు తిరిగి దేశాన్ని ఆక్రమించారనగానే షాక్‌కి గురయ్యా.. ఏదో తెలియని భయం ఆవహించింది. ఎందుకంటే మహిళలపై వాళ్లు విధించే ఆంక్షలు అంత దారుణంగా ఉంటాయి. ఆటల్లో.. అందులోనూ బాక్సింగ్‌ అస్సలు ఆడనివ్వరని నాకర్థమైంది. అలాగని వారి ఆంక్షలకు తలొగ్గి బాక్సింగ్‌ లేకుండా నేను బతకలేను. అందుకే ఏదైతే అదైంది.. ముందు ఇక్కడ్నుంచి బయటపడాలనుకున్నా. అమ్మానాన్నలు, ఇతర కుటుంబ సభ్యులతో కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకున్నా.. దేశం దాటడానికి రెండు రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే అక్కడున్న పరిస్థితుల రీత్యా నేనొక్కదాన్నే దేశం వీడాల్సి వచ్చింది..’ అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చిందీ బాక్సింగ్‌ లవర్‌.

అయినా ప్రాక్టీస్‌ మానను!

‘అఫ్గానిస్తాన్‌ నేషనల్‌ బాక్సింగ్‌ టీమ్‌’లో సభ్యురాలైన సీమ.. ప్రస్తుతం ఖతార్‌కు శరణార్థిగా వెళ్లింది. 2022 ఫిఫా ప్రపంచకప్‌ అతిథుల కోసం ఏర్పాటుచేసిన విల్లాలో తలదాచుకుంటోంది. అయితే తానెక్కడున్నా సాధన మాననని.. ఒలింపిక్స్‌లో తన దేశానికి పతకం తేవడమే తన అంతిమ లక్ష్యమని చెబుతోందీ అఫ్గాన్‌ బాక్సర్‌.

‘మా కుటుంబం నుంచి నేనొక్కదాన్నే దేశం వీడాను.. అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం ఖతార్‌లో ఉన్నానన్న మాటే గానీ.. నా మనసంతా నా దేశం, కుటుంబంపైనే ఉంది. ఇంటికి దూరంగా ఉన్నానన్న బాధ నన్ను వేధిస్తోంది. అయినా నేను నా సాధనను మాత్రం ఆపను. ఈ క్రమంలో రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచి ప్రాక్టీస్‌ మొదలుపెడుతున్నా.. నా దేశానికి ఒలింపిక్‌ పతకం తేవాలన్నదే నా అంతిమ లక్ష్యం’ అంటోంది సీమ.
అంతేకాదు.. మరోవైపు జర్నలిస్ట్‌గానూ రాణించిన ఈ యువ బాక్సర్‌.. తానెక్కడున్నా అఫ్గాన్‌ మహిళల హక్కుల గురించి ఆయా వేదికలపై గళమెత్తుతానని, తద్వారా మహిళలపై తాలిబన్ల అరాచకాల్ని ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టినట్లు చూపుతానని అంటోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ అఫ్గాన్‌ను ఆదుకోవడానికి కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుతోంది.

మరి, ఏదేమైనా.. తానెక్కడున్నా.. సీమ తన అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ సీమ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్