నాలాంటి వాళ్లకోసం ‘డయాబెస్టీస్‌’

సంపన్న కుటుంబంలో పుట్టింది... చదువుల్లో ఆటల్లో ఫస్టే ఉండేది. కానీ చిన్నవయసులోనే టైప్‌-1 చక్కెర వ్యాధి వచ్చింది. అది మొదలు... ఇన్సులిన్‌ పంపూ ఒంట్లో భాగంగా మారింది. దాన్ని వెంటేసుకుని తిరగడం ఎంతో కష్టమయ్యేది. కానీ తప్పలేదు. అన్నీ ఉన్న తనే ఈ వ్యాధితో ఇంత ఇబ్బంది పడుతోంటే పేద పిల్లల స్థితి ఏమిటీ అని ఆలోచించింది... ఫలితమే ‘డయా బెస్టీస్‌ ఫౌండేషన్‌’.

Updated : 15 Jun 2024 04:40 IST

సంపన్న కుటుంబంలో పుట్టింది... చదువుల్లో ఆటల్లో ఫస్టే ఉండేది. కానీ చిన్నవయసులోనే టైప్‌-1 చక్కెర వ్యాధి వచ్చింది. అది మొదలు... ఇన్సులిన్‌ పంపూ ఒంట్లో భాగంగా మారింది. దాన్ని వెంటేసుకుని తిరగడం ఎంతో కష్టమయ్యేది. కానీ తప్పలేదు. అన్నీ ఉన్న తనే ఈ వ్యాధితో ఇంత ఇబ్బంది పడుతోంటే పేద పిల్లల స్థితి ఏమిటీ అని ఆలోచించింది... ఫలితమే ‘డయా బెస్టీస్‌ ఫౌండేషన్‌’. పెరిగి పెద్దయ్యి కొరియోగ్రాఫర్‌గా రచయితగా రాణిస్తోన్న ఆ అమ్మాయి... ప్రముఖ బిలియర్డ్స్‌ ఆటగాడు గీత్‌సేథీ కూతురు... జాజ్‌సేథీ!

మాది అహ్మదాబాద్‌. నాన్న బిలియర్డ్స్‌ క్రీడాకారుడైతే, అమ్మ కిరణ్‌ బీర్‌ విద్యావేత్త. వాళ్ల స్ఫూర్తితో నేను అన్నింటా ముందుండేదాన్ని. అప్పుడు నా వయసు పదమూడు. ఓసారి స్కూల్లో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కి సిద్ధమవుతుంటే... ఒక వారంలోనే ఏడు కిలోలు తగ్గా. అమ్మానాన్నా భయపడి వైద్య పరీక్షలు చేయిస్తే... టైప్‌1డి అని తెలిసింది. అది వినగానే వాళ్లు కుప్పకూలిపోయారు. నేనూ ఆందోళన చెందా. రోగనిరోధక వ్యవస్థలో తలెత్తే లోపాలూ... జన్యులోపం... కారణమేదయినా ఒకసారి ఈ వ్యాధి వస్తే అనుక్షణం గ్లూకోజ్‌ మానిటరింగ్‌ ఉండాల్సిందే. అది చూసుకుంటూ ఇన్సులిన్‌ను అందించాలి. నా శరీరంలో మారే గ్లూకోజు స్థాయులను గుర్తించడానికీ, ఇన్సులిన్‌ డెలివరీని క్రమబద్ధీకరించడానికీ నాకు అనుసంధానంగా ఇన్సులిన్‌ పంప్, సీజీఎం (కంటిన్యూస్‌ గ్లూకోజ్‌ మానిటర్‌) ఏర్పాటుచేశారు. హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు ఈ వ్యాధితో బాధపడే పేద పిల్లలూ వచ్చేవారు. వీటి ఖరీదు ఎక్కువ కావడంతో వాళ్లకి ఇవి అందుబాటులో ఉండేవి కాదు. అప్పుడే అనిపించింది... పెద్దయ్యాక వాళ్లకోసం ఏమైనా చేయాలని.

అలా మొదలైంది!

 ముందు ‘పెప్పీ’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి ఈ సమస్య ఉన్న వారందరినీ ఒక కమ్యూనిటీగా ఏర్పాటుచేశా. ప్రస్తుతం ఇందులో ఏడు లక్షలమందికి పైగా ఉన్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతోన్న వాళ్లలో లక్షలాది మంది చిన్నవయసులోనే చనిపోయారు. ఎందుకంటే ఇన్సులిన్‌ చికిత్స ఖరీదుతో కూడుకున్నది. పైగా గ్రామాల్లో వైద్యులు సకాలంలో గుర్తించపోవడం కూడా ఈ మరణాలకు కారణమే. అందుకే 2018లో ‘డయాబెస్టీస్‌’ ఫౌండేషన్‌ స్థాపించి బాధితులందరినీ ఒకచోట సమావేశపరిచి తమ అనుభవాలను ఎదుటివారితో పంచుకునేలా చేశా. తమలాగే మరెందరో ఉన్నారనే అవగాహన కలిగించడంతోపాటు అందరిలానే తామూ జీవించొచ్చు అని తెలుసుకునేలా చేయగలిగా. దాంతో వాళ్లలో ఆత్మస్థైర్యం పెరిగింది. మా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ‘బ్యాక్‌ టు బేసిక్స్‌(బీ2బీ)’ కార్యక్రమం ద్వారా రోగుల్లో అపోహల్ని పోగొడతాం. నిపుణుల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిస్తాం. ‘డి-టూర్‌’ పేరుతో పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్‌ కార్యాలయాల్లోనూ అవగాహన కలిగిస్తున్నాం. ఫార్మా ఇండస్ట్రీతో కలిసి ఈ సమస్య ఉన్న నిరుపేద పిల్లలకు వెయ్యిమందికి పైగా ఉచితంగా ఇన్సులిన్, టెస్ట్‌ స్ట్రిప్స్‌ అందించాం. డయాబెటిస్‌ ఉన్న పేద పిల్లల తల్లుల కోసం ‘మిష్టి’ ప్రాజెక్టు ప్రారంభించి ఎన్జీవోల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. తద్వారా వారి పిల్లలకు స్వయంగా చికిత్స చేయించుకునే ఆర్థికస్థోమతనీ కల్పిస్తున్నాం’ అని చెబుతోన్న జాజ్‌సేథీ... దేశంలోనే ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ ఆర్టిఫిషియల్‌ పాంక్రియాస్‌(డీఐవైఏపీ)’ను తొలిగా అమర్చుకున్న ధీశాలి కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్