లేడీ సింగం... అడవిని కాపాడుతోంది!

విధుల్లో చేరిన ఐదేళ్లలోనే ఏడు బదిలీలు... ‘నువ్వెక్కడ ఉంటావో మాకు తెలుసు... కుటుంబం గురించి ఆలోచించావా... నీ అంతు తేలుస్తాం...’ వంటి బెదిరింపులు... ఇవన్నీ ఆమెకు సర్వసాధారణం. ‘వాటికి భయపడుతూ కూర్చుంటే ఈ అడవిని ఎలా పరిరక్షించగలను’ అంటూ అటవీ మాఫియా గ్యాంగ్‌కి నిద్రపట్టకుండా చేశారీ ఫారెస్ట్‌ ఆఫీసర్‌... బాసు కనోజియా ఉరఫ్‌ లేడీ సింగం!

Updated : 24 Jun 2024 14:24 IST

(నేడు ప్రపంచ వర్షారణ్య పరిరక్షణ దినోత్సవం)

విధుల్లో చేరిన ఐదేళ్లలోనే ఏడు బదిలీలు... ‘నువ్వెక్కడ ఉంటావో మాకు తెలుసు... కుటుంబం గురించి ఆలోచించావా... నీ అంతు తేలుస్తాం...’ వంటి బెదిరింపులు... ఇవన్నీ ఆమెకు సర్వసాధారణం. ‘వాటికి భయపడుతూ కూర్చుంటే ఈ అడవిని ఎలా పరిరక్షించగలను’ అంటూ అటవీ మాఫియా గ్యాంగ్‌కి నిద్రపట్టకుండా చేశారీ ఫారెస్ట్‌ ఆఫీసర్‌... బాసు కనోజియా ఉరఫ్‌ లేడీ సింగం!

2018... మధ్యప్రదేశ్‌లోని ఉమరియా అటవీప్రాంతం... ఆకస్మిక తనిఖీకి బయలుదేరారు బాసు కనోజియా. ఈ విషయం వెంట ఉన్న సిబ్బందికి తెలియదు. ఏదో రోజువారీ పెట్రోలింగ్‌ అనుకునే బయల్దేరారు. కానీ అడవి లోపలకి వేగంగా దూసుకెళ్లిన వాహనం నిర్మాణంలో ఉన్న భారీ భవంతి ముందు ఆగింది. అది సాదాసీదా వ్యక్తులది కాదు, దాని వెనక రాజకీయ నాయకులూ ప్రభుత్వాధికారులూ ఉన్నారని తెలుసు. అయినా ఏమాత్రం భయపడకుండా అందరికీ లీగల్‌ నోటీసులు పంపించారు.

ఆ తరవాత... అశోక్‌నగర్‌ పరిధిలో 1936 హెక్టార్ల అటవీభూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించారు. ఆ సమయంలో పోలీసుల రక్షణ తీసుకుని దాడుల్ని ఎదుర్కొన్నారు.
ఇలా ఉద్యోగంలో చేరింది మొదలు... నిత్యం ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్తున్నారు. నిజాయతీ నిర్భయత్వాలకు మారుపేరుగా నిలిచి ఫారెస్ట్‌ మాఫియా పాలిట సింహస్వప్నంలా మారారు బాసు కనోజియా. అందుకే సన్నిహితులూ సహచరులూ ఆమెని ‘ఎన్‌క్రోచ్‌మెంట్‌ ఎవిక్షన్‌ స్పెషలిస్ట్‌’ అని పిలుస్తారు. ఆమె తన గురించి ఏమంటున్నారంటే...

నాన్న స్ఫూర్తితో...

మాది మధ్యప్రదేశ్‌. హైస్కూల్‌ వరకు కాన్పూరులో చదువుకున్నా. ఆపై అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంలో మాస్టర్స్‌ చేశా. నాన్న యూపీలో అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌లో నిజాయతీగా పనిచేశారు. నాన్న ఆశయాలతోనే ప్రజాసేవ చేయాలనుకునేదాన్ని. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీ ర్యాంకు సాధించా. 2013లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌లో అడుగుపెట్టా. నాన్న వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ... నా విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చేసింది. మొదటి పోస్టింగ్‌ దక్షిణ మధ్యప్రదేశ్‌లోని హరదాలో.

సాధారణంగా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అంటే అటవీ సంపదను కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణ మాత్రమే అనుకుంటారు. కానీ వాటితోపాటు పచ్చదనం పెంచడానికీ కృషి చేయాలి. అయితే చెట్లను పెంచాలంటే భూమి ఉండాలి. దాన్ని కబ్జాదారులు ఆక్రమిస్తే వాళ్ల నుంచి తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత మనదే. లేదంటే అడవుల విస్తీర్ణం తరిగిపోవడానికి ఎంతోకాలం పట్టదు. కాబట్టి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోక తప్పదు. అందుకే దానిమీద దృష్టిపెట్టా.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌లో సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు... 1200కు పైగా హెక్టార్ల అటవీ భూమిని కబ్జాదారుల నుంచి తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నౌరాదేహి అభయారణ్యంలో పది గ్రామాలను అక్కణ్ణుంచి తొలగించి గడ్డిమైదానాలు పెరిగేలా చేశా. దాంతో ఇప్పుడక్కడ రెండు పెద్ద పులులూ సంచరిస్తున్నాయి. ఇందుకోసం గ్రామీణులకు నచ్చజెప్పి వాళ్లకు మరోచోట ఆవాసం ఏర్పాటుచేశాను. పదేళ్ల సర్వీస్‌లో చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ముందడుగు వేస్తున్నా. అవసరమైనప్పుడు జిల్లా యంత్రాంగం, అటవీశాఖా విభాగం సహకారం ఉంటుంది. ఆక్రమణదారులకీ మాకూ మధ్య ఘర్షణ ఏర్పడితే, నియంత్రించడానికి తుపాకీ కాల్పులు జరిపిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటివరకూ సుమారు 7 వేల హెక్టార్ల అటవీ భూమిని కబ్జాదారుల నుంచి తిరిగి తీసుకున్నాం. 150కి పైగా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, 50కి పైగా వేటకు సంబంధించిన కేసులు నమోదు చేశాం. ఇక, పెట్రోలింగ్‌లో అక్రమ మైనింగ్స్‌ చాలానే బయటపడుతుంటాయి. వాటిని మూయించేవరకూ నాకు నిద్రపట్టదు.

బెదిరింపులు...

ఈ విధుల్లో వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులు సహజంగానే ఉంటుంటాయి. అక్రమాలను అడ్డుకుంటున్నానని వాళ్ల పరపతితో బదిలీ చేయిస్తారు. అలా విధుల్లో చేరిన మొదటి అయిదేళ్లలోనే ఏడు డివిజన్స్‌ మారా. బెదిరింపులు షరా మామూలే. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం నాకు ఉంది. అయితే నా కారణంగా కుటుంబానికి హాని కలగకూడదు. అందుకే అలాంటి కఠిన సమయాల్లో వాళ్లతో కమ్యూనికేషన్‌ నిలిపేస్తాను. శత్రువులకి వాళ్ల ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడతాను.

అటవీ సంరక్షణలో నా సేవలకు గతేడాది ‘ఎకో వారియర్‌’ పురస్కారాన్ని అందుకున్నా. సవాళ్లతో కూడిన ఈ విధి నిర్వహణలో నాతో కలిసి పనిచేసిన సిబ్బందికి దీన్ని అంకితమిస్తున్నా. ఈ రంగంలోకి అడుగుపెడుతున్న వారందరికీ ఈ అవార్డు స్ఫూర్తి కావాలి. నిబద్ధతతో నిర్వహించే వృత్తి మనసుకు తృప్తినిస్తుంద’ని చెబుతున్న బాసు కనోజియా ప్రస్తుతం మధ్యప్రదేశ్, నార్త్‌ సియోనీలో విధులు నిర్వహిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్