అదృష్టవంతుడు... ఏడుగురు అమ్మాయిలు!

‘ఎంత దురదృష్టవంతుడో...’, ‘వీళ్లందరికీ తిండెలా పెడతావ్‌?’ ‘త్వరగా పెళ్లిళ్లు చేసి భారం దించుకో’... ఒకరి తరవాత ఒకరు ఎనిమిది మంది అమ్మాయిలు పుట్టాక కమల్‌ సింగ్‌కి ఇలాంటి మాటలే ఎదురయ్యాయి. కానీ ఆయన వాళ్లు బరువు కాదు అని నమ్మి, ప్రోత్సహించాడు.

Published : 16 Jun 2024 12:43 IST

‘ఎంత దురదృష్టవంతుడో...’, ‘వీళ్లందరికీ తిండెలా పెడతావ్‌?’ ‘త్వరగా పెళ్లిళ్లు చేసి భారం దించుకో’... ఒకరి తరవాత ఒకరు ఎనిమిది మంది అమ్మాయిలు పుట్టాక కమల్‌ సింగ్‌కి ఇలాంటి మాటలే ఎదురయ్యాయి. కానీ ఆయన వాళ్లు బరువు కాదు అని నమ్మి, ప్రోత్సహించాడు. కమల్‌ సింగ్‌ నమ్మకాన్ని నిలబెట్టిన ఆ అమ్మాయిలు దేశానికే ఆ తండ్రిని పరిచయం చేశారు.

నిమిది మంది అమ్మాయిలు, ఒకబ్బాయి... ఇరుగూపొరుగూ, బంధువులూ కమల్‌సింగ్‌ని ‘నీకేదో శాపం ఉందయ్యా’ అనేవారట. ఈ ప్రభావం పిల్లలపై పడుతోంటే తట్టుకోలేక వేరే ఊరికి వలస వెళ్లారు. వీళ్లది పట్నాకు 70కి.మీ. దూరంలోని ఎక్మా. ఓవైపు వ్యవసాయం చేస్తూనే పిండిగిర్నీనీ నడిపేవారు కమల్‌. ఆ ఆదాయంతోనే ఇల్లు నడిపేవారు. ఒకమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. మిగతా కూతుళ్లను చదివిస్తోంటే అందరూ ‘త్వరగా పెళ్లి చెయ్యి, వాళ్లకి చదువులెందుకు? కొడుక్కి ఏం మిగల్చవా’ అనేవారట. ఆయన మాత్రం కూతుళ్లకు ‘మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోండి. మిమ్మల్ని చిన్నచూపు చూసినవారే పొగిడేలా ఎదగండి’ అని చెప్పేవారట.

అక్క చూపిన బాటలో... పెద్దమ్మాయి రాణి దేవి అప్పుడు పదో తరగతి. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను చూసి, తనూ పోలీస్‌ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఏ చదివి, కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని సాధించింది. ఆమెను చూసి రెండో అమ్మాయి రేణు కుమారి బోర్డర్‌ పోలీసు అయ్యింది. అలా ఒక్కొక్కరూ వాళ్లు వేసిన బాటలో నడిచారు. నలుగురు బిహార్‌ పోలీసుశాఖలో, ముగ్గురు ఎక్సైజ్‌ శాఖ, సీఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమదళ్‌ విభాగాలకు ఎంపికయ్యారు. పెద్దమ్మాయి సాధించాక తరవాతి ఆమెకు ఆవిడే శిక్షణ ఇచ్చింది. అలా ఒకరికొకరు అండగా ఉండి, అంతా విజయం సాధించడానికి కారణమయ్యారు. వీళ్లంతా చదివింది ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే! పొలంలోనే పరుగు, వ్యాయామం సాధన చేసేవారు. తమ సంపాదనతో నాన్నకోసం నాలుగు అంతస్థుల భవనాన్నీ నిర్మించి ఇచ్చారు. ‘ఒకప్పుడు దురదృష్టవంతుడు అన్నవాళ్లే ఇప్పుడు అదృష్టవంతుడని పొగుడుతున్నారు. అప్పుడూ ఇప్పుడూ నాది ఒకటే మాట... అమ్మాయిలు భారం కాదు... ఇంటికి లక్ష్ములు. దాన్ని నా పిల్లలు నిరూపించి చూపించారు కూడా. ‘సింగ్‌ సిస్టర్స్‌’ నాన్న అంటూ ఇంటర్వ్యూలూ తీసుకుంటున్నారు’ అని సంబరంగా చెబుతున్నారాయన.

(ఈటీవీ భారత్‌ సౌజన్యంతో)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్