కాళ్లు లేకపోతేనేం.. పాఠ్య పుస్తకాల్లో నిలిచి!

ప్రస్తుత రోజుల్లో మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఈ అవకాశాలు చాలా అరుదు. సమాజానికి దోహదపడాలనే తపనతో అనారోగ్యంతోనే కాక, సామాజిక కళంకాలతో పోరాడారో ఓ మహిళ.

Updated : 15 Jun 2024 17:01 IST

ప్రస్తుత రోజుల్లో మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఈ అవకాశాలు చాలా అరుదు. సమాజానికి దోహదపడాలనే తపనతో అనారోగ్యంతోనే కాక, సామాజిక కళంకాలతో పోరాడారో ఓ మహిళ. పోలియోతో రెండు కాళ్లూ పనిచేయకపోయినా, పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ... పద్మశ్రీ అవార్డునీ అందుకున్నారు.

కేవీ రబియాది కేరళ, మలప్పురంలోని వెల్లిలక్కాడ్‌ కుగ్రామం . 1980ల్లో కేరళ అక్షరాస్యత మిషన్‌కు రబియా అందించిన సహకారం మలప్పురం అభివృద్ధిపై చెరగని ముద్ర వేసింది. నేటికీ ఆమె విజయాలు కాలికట్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా చోటు సంపాదించుకున్నాయి. రబియా పాతికేళ్లకుపైగానే బోధిస్తూ వెనకబడిన ప్రజలకు విద్యపై అవగాహన కల్పిస్తున్నారు.

ఉచిత విద్య...

పదోతరగతి పూర్తిచేసిన రబియా పైచదువులకి ఆరోగ్యం సహకరించలేదు. దాంతో ఇంటికే పరిమితమై, దూరవిద్యతో చదువు పూర్తి చేశారు. ఖాళీగా ఉండలేక విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవారు. తన దగ్గరకు వచ్చే వారంతా ఆర్థికంగా వెనకబడినవారే కావడంతో నామమాత్రపు ఫీజునే తీసుకునేవారామె. 1980లో రాష్ట్ర ప్రభుత్వం అక్షరాస్యత మిషన్‌ని ఏర్పాటు చేసింది. దానికి ఎంపికైన టీచర్‌ రాకపోవడంతో రబియా పాఠాలు చెప్పేవారు. ‘మొదట్లో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉండేవారు. మహిళలను ఈ తరగతులకి తీసుకురావడం కష్టమైంది’ అనే రబియా చదువు గొప్పదనాన్నీ, విలువనూ వారికి అర్థమయ్యేలా అబ్రహాం లింకన్, కస్తూర్బా గాంధీ జీవితాలను ఉదహరిస్తూ చదువుబాట పట్టేలా చేశారు.

పోరాట పటిమ...

వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ.. ‘అర్హత ఉన్న వారికి ఉద్యోగ రిజర్వేషన్లు, వైద్యం, విద్యను ప్రభుత్వం అందించాలి. దివ్యాంగులకు శిక్షణనిచ్చి జీవనోపాధి కల్పించాలి. ‘మనిషికి కష్టాలు ఎదురైనప్పుడే మరింత బలంగా మారతాడు. లోపాలనే సోపానాలుగా మార్చుకుంటే మనకేది అడ్డు? ఇందుకు నేనే నిదర్శనం... పోలియో బాధితురాలిని, 32 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్, 38 ఏళ్లకి పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితమైనా సామాజిక సేవాకార్యకర్తగా పనిచేయాలన్న నా లక్ష్యం ఆగిపోలేదు’.. అనే రబియా వెనకబడిన మహిళల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా మలబార్‌ మహిళల వారసత్వ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వికలాంగులకు పునరావాస కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, వారి పిల్లలకు స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నారు. లైబ్రరీలో మహిళలకు ప్రత్యేక పఠన గదిని ఏర్పాటు చేశారు. ఆమె సేవకుగానూ పద్మశ్రీ అవార్డునీ అందుకున్నారు. ‘నాకు పోలియో వచ్చినపుడు నా కాళ్లు వణుకుతుంటే ‘నథింగ్‌ టు వర్రీ’ అని నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా. అదే ఈరోజు ఇంత గుర్తింపు తెచ్చిందం’టారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్