ఆలనా పాలనా... అంతా తానై..!

అమ్మ ఎంత ప్రేమించినా... అమ్మాయిలు తండ్రి చాటు బిడ్డలే కదా! తండ్రులకూ అంతే... కూతుళ్లంటే ప్రాణం. అందుకే ఈతరం నాన్నలు పిల్లల సంరక్షణ, ఆలనాపాలనా అమ్మదే అనే ఆలోచనా విధానాన్నీ మారుస్తున్నారు.

Updated : 16 Jun 2024 12:46 IST

అమ్మ ఎంత ప్రేమించినా... అమ్మాయిలు తండ్రి చాటు బిడ్డలే కదా! తండ్రులకూ అంతే... కూతుళ్లంటే ప్రాణం. అందుకే ఈతరం నాన్నలు పిల్లల సంరక్షణ, ఆలనాపాలనా అమ్మదే అనే ఆలోచనా విధానాన్నీ మారుస్తున్నారు. తమ ముద్దుల కూతుళ్ల పెంపకానికి సంబంధించిన అనేక విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.


ఇన్‌స్టా డాడ్స్‌

ఈ నాన్న బిజీ కాదు..

నాన్నంటే ఎప్పుడూ ఉద్యోగం, వ్యాపారాలతో బిజీగా ఉంటారు. మనతో సమయం గడపలేరు అనుకుంటారు. కానీ, ఆ భావనని చెరిపేస్తున్నారు దుర్జాయ్‌ దత్త. ఈయనది దిల్లీ. ప్రొఫెషనల్‌గా ఇంజినీర్‌ అయిన దుర్జాయ్‌ రచయిత కూడా. తనకు రేనా, వైర్యా అనే ఇద్దరమ్మాయిలు. తన కుటుంబం, పేరెంటింగ్‌కి సంబంధించిన అనేక విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంటారు. అటు వృత్తినీ, ఇటు తండ్రిగా తన బాధ్యతల్నీ సమన్వయం చేసుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫాదర్‌హుడ్, పిల్లల పెంపకంపై అనేక పుస్తకాలు రాశారు దుర్జాయ్‌.


సరదాగా నేర్పిస్తూ...

పిల్లలతో గంభీరంగా ఉండడం ఒకప్పటి స్టైల్‌. స్నేహపూర్వకంగా ఉంటూనే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం ఇప్పటి ట్రెండ్‌. దిల్లీకి చెందిన రామ్‌నీక్‌ సింగ్‌ ఓ ఫుల్‌ టైమ్‌ కంటెంట్‌ క్రియేటర్, డాడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి. పిల్లలతో కలిసి పేరెంటింగ్‌ టిప్స్, ట్రావెల్‌ స్టోరీస్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఈ వీడియోలన్నింటినీ సరదాగా, స్ఫూర్తిదాయకంగా చెప్పడమే ఈయన ప్రత్యేకత.


అమ్మగా మారి...

అమ్మ...కంటికి రెప్పలా బిడ్డల్ని కాచుకుంటుంది. అలాంటి అమ్మే లేకపోతే ఆ బిడ్డకు తీరని లోటు. అది ఉండకూడదనే నిఖిల్‌ జరానీ తన కూతురికి అమ్మ అయ్యాడు. ఒంటరి తండ్రిగా కూతురిని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. ‘2017లో నా భార్య జోయీకు జన్మనిచ్చింది. పాపకు రెండేళ్లు నిండేటప్పటికి ఆమె క్యాన్సర్‌ బారిన పడింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మమ్మల్ని విడిచి ఈలోకం నుంచి వెళ్లిపోయింది. తన అంత్యక్రియలు జరిగిన ఓ గంట తర్వాత జోయీను తీసుకుని నేను పార్కుకు వెళ్లా. తండ్రిగా నా పాత్ర అప్పటినుంచే మొదలైంది. తనకు జుట్టు దువ్వడం, తినిపించడం... అన్ని పనులూ నేనే చేస్తా. ఒక్కోసారి నువ్వు అమ్మను చూశావా? అని పాప నన్ను అడుగుతుంటుంది. తను పెద్దయ్యాక తన అమ్మ ఒక ఫైటర్‌ అనీ, మాటలకందని రీతిలో నిన్ను ప్రేమించిందనీ చెప్తా. జోయీ నవ్వినప్పుడు అచ్చం తన అమ్మలానే ఉంటుంద’నే నిఖిల్‌ తన పాపకు సంబంధించిన అనేక విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్