పౌరోహిత్యమూ చేయగలం...!

ఒకప్పుడు మహిళలు వేదాలు విన్నా, చదివినా అపశకునంగా భావించే వారు. అంతెందుకు.. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం నిషిద్ధం! మరి, మహిళల్నే దేవతలుగా, ఆ అమ్మవారి అంశగా భావించే మన దేశంలో ఆడవాళ్లంటే ఎందుకీ వివక్ష? పురుషాధిపత్యం ఉన్న అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పుడు.. పౌరోహిత్యం స్వీకరించడానికి వారికి ఎందుకిన్ని అడ్డంకులు? అని ప్రశ్నిస్తున్నారు కొందరు మహిళలు.

Updated : 24 Aug 2021 17:18 IST

ఒకప్పుడు మహిళలు వేదాలు విన్నా, చదివినా అపశకునంగా భావించే వారు. అంతెందుకు.. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం నిషిద్ధం! మరి, మహిళల్నే దేవతలుగా, ఆ అమ్మవారి అంశగా భావించే మన దేశంలో ఆడవాళ్లంటే ఎందుకీ వివక్ష? పురుషాధిపత్యం ఉన్న అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పుడు.. పౌరోహిత్యం స్వీకరించడానికి వారికి ఎందుకిన్ని అడ్డంకులు? అని ప్రశ్నిస్తున్నారు కొందరు మహిళలు. కేవలం మాటల్లో చెప్పడమే కాదు.. వేదాలు, శాస్త్రాలు చదువుతూ పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్‌. తమిళనాడు వాసి అయిన ఆమె.. చెన్నై మాడంబాక్కమ్‌ ధేనుపురీశ్వరర్‌ దేవాలయ అర్చకురాలిగా తాజాగా బాధ్యతలందుకుంది. స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆమెను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆమె పాపులరైంది. దీంతో తమిళనాడులో పౌరోహిత్యం చేపట్టిన రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు మహిళా పురోహితులు.. తాము మగ పూజారులకేమాత్రం తీసిపోమని నిరూపించారు.

మహిళలకు అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన తమిళనాడులో ఎప్పట్నుంచో ఉంది. అయితే ఇందుకు అక్కడి ప్రజలు వ్యతిరేకించినా.. ఈ నిర్ణయం సరైందే అని గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పిన్నియక్కాళ్‌ అనే మహిళను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడ మహిళల పౌరోహిత్యానికి తెరతీసినట్లయింది. ఆమె తన తండ్రి నుంచి వారసత్వంగా ఈ బాధ్యతను అందుకున్నారు.

తపన నాది.. ప్రోత్సాహం వారిది!

సీఎం స్టాలిన్‌ ఆదేశాలతో చెన్నై మాడంబాక్కమ్‌లోని ధేనుపురేశ్వరర్‌ గుళ్లో మహిళా అర్చకురాలిగా బాధ్యతలందుకున్నారు సుహంజన గోపీనాథ్‌. దీంతో ఆ రాష్ట్ర రెండో మహిళా పురోహితురాలిగా నిలిచారు. తను ఈ వృత్తిని ఎంచుకుంటానన్నప్పుడు తన పుట్టింటి వారు, భర్త, అత్తింటి వారు తనను ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నారామె.

‘నాకు చిన్నప్పట్నుంచే భక్తి పాటలు పాడడమంటే చాలా ఇష్టముండేది. గుళ్లకు వెళ్లినప్పుడల్లా ఆ దేవుడి సన్నిధానంలో పాటలు పాడేదాన్ని. అయితే ఇప్పుడు ఓ అర్చకురాలిగా ఆ భగవంతుడికి సేవ చేసే అరుదైన అవకాశం నాకొచ్చింది. ఇలా దేవుడికి సేవ చేస్తూ పాటలు పాడడం, మంత్రాలు చదవడం ఓ కొత్త అనుభూతి. నా భక్తికి మెచ్చి ఆ దేవుడే నాకు ఈ వరం ప్రసాదించాడేమో అనిపిస్తోంది. నేను ఈ వృత్తి చేపట్టడం వెనుక నా భర్త, పుట్టింటి వారు-అత్తింటి వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వాళ్లంతా నా నిర్ణయాన్ని గౌరవించారు.. చాలా సంతోషంగా ఉంది..’ అంటూ పట్టరాని ఆనందంతో ఉన్నారు సుహంజన.

అయితే ఈమె కంటే ముందు పిన్నియక్కాళ్‌ తొలి మహిళా పూజారిగా బాధ్యతలందుకున్నా.. ఎనిమిదేళ్ల క్రితం రాజీనామా చేయడంతో ప్రస్తుతం తమిళనాడులో ఏకైక మహిళా పూజారిగా ఉన్నారు సుహంజన.

మైల పడ్డా మహిళలు గుడికి రావచ్చు!

సాధారణంగా నెలసరి సమయంలో మహిళలు గుడికి వెళ్లడానికి ఇష్టపడరు. అయితే ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని, మైల పడ్డా మహిళలు గుళ్లోకి రావచ్చని చెబుతున్నారు మరో మహిళా పూజారి కలైరసి నటరాజన్‌. చెన్నైలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ గుడిని ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారామె. నిజానికి ఇప్పటిదాకా ఈ గుడి గురించి తెలిసింది చాలా తక్కువ మందికే!

‘13 ఏళ్లకు పుష్పవతి అయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే మానేశాను. ఎందుకంటే రజస్వల అయిన అమ్మాయిలు గడప దాటకూడదన్న నియమం మా ఊళ్లో ఉండేది. ఇంట్లోనే తోబుట్టువులతో ఆడుకుంటూ, పుస్తకాలు చదువుతూ గడిపేదాన్ని. 16 ఏళ్లు నిండకముందే పెళ్లైంది. దాంతో ఆ తర్వాత ఆటలకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టి ఇంటి పనులు, పుస్తకాలు చదవడంతోనే రోజులు గడిచిపోయేవి. కొన్నాళ్లకు మా వారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకీ వచ్చా. శైవ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టా. మహిళలు అర్చక వృత్తి చేపట్టడానికి అనర్హులు అంటుంటారు.. కానీ ఆ విషయం గురించి శైవ సిద్ధాంతంలో ఎక్కడా చెప్పలేదు. నేనైతే మా గుడికొచ్చే మహిళా భక్తులకు నెలసరి సమయంలోనూ స్నానం చేసి రావచ్చని సూచిస్తుంటా. అది కూడా వాళ్లకు ఇష్టమైతేనే!’ అంటారీ మహిళా పూజారి.

ఆ ఆంక్షలు ఎక్కడా లేవు!

పురుషులే పూజారులుగా ఉండాలని, మహిళలు పౌరోహిత్యానికి పనికి రారని తాను చదివిన వేద పురాణాల్లో ఎక్కడా లేదంటోంది కోల్‌కతాకు చెందిన యువ పూజారి సులతా మండల్‌. అర్చకురాలు కావాలన్న ఉద్దేశంతో పౌరోహిత్యం అభ్యసించిన ఆమె.. ఏటా అక్కడ నిర్వహించే దేవీ నవరాత్రుల్లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇదిలా ఉంటే.. కోల్‌కతాలోని మాల్డా జిల్లాలోని ఓ కళాశాల విద్యార్థులు ఏటా సరస్వతి పూజ నిర్వహిస్తుంటారు. అయితే 2019లో జరిపిన పూజ కోసం పురుష పూజారిని కాకుండా మహిళా అర్చకురాలిని పిలవాలనుకున్నారు. అలా వారి పిలుపు మేరకు సులత అక్కడ సరస్వతి పూజ చేసి వార్తల్లో నిలిచారు.

‘ప్రతి ఇంట్లో మహిళలే పూజ చేస్తుంటారు. కానీ బయటి కార్యక్రమాలు/పూజల దగ్గరికొచ్చే సరికి మాత్రం పురుష పూజారులే కనిపిస్తుంటారు. నేనూ పౌరోహిత్యంలో భాగంగా వేదాలు చదివా. మహిళలు పౌరోహిత్యం చేయరాదన్న ఆంక్షలు అందులో ఎక్కడా లేవు. యజుర్వేదం ప్రకారం నేను అన్ని రకాల పూజలు నిర్వహించగలను..’ అంటున్నారు సులత.

తెలుగు రాష్ట్రాల్లోనూ!

* ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది మహిళా పూజారులు ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పుచ్చకాయల విజయలక్ష్మి తోమవారపాడు గ్రామంలోని గుంటిగంగమ్మ ఆలయంలో మహిళా పూజారిగా కొనసాగుతున్నారు. పుచ్చకాయల కుటుంబంలోని మహిళలు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి అత్తయ్య దగ్గర్నుంచి పూజారిగా బాధ్యతలు స్వీకరించారామె.

* హైదరాబాద్‌లోని సైదాబాద్‌ నాగులమ్మ దేవాలయంలో అర్చకురాలిగా కొనసాగుతున్నారు గోవర్ధన శ్రీదేవి. చిన్నతనం నుంచి తండ్రి, తాతలను చూసి స్ఫూర్తి పొందిన ఆమె వేద విద్య అభ్యసించింది. యజ్ఞయాగాలు, సత్యనారాయణ వ్రతం.. వంటి పూజలన్నీ నిర్వహించడంలో ఆమె దిట్ట. పౌరోహిత్యంపై ఉన్న ప్రేమతో పెళ్లి కూడా చేసుకోలేదామె.

ఆలయాల్లో పూజారులుగానే కాదు.. పెళ్లిళ్లు చేసే పురోహితులుగానూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్‌ నటి దియా మీర్జా పెళ్లి చేసిన షీలా అత్తా, కోల్‌కతాకు చెందిన నందినీ భౌమిక్‌, మైసూరుకు చెందిన భ్రమరాంబ మహేశ్వరి అనే వేద పండితురాలు.. వీళ్లంతా ఇదే కోవలోకి వస్తారు.

ఏదేమైనా వీరంతా పౌరోహిత్యం/అర్చకత్వంలోనూ తాము పురుషులతో సమానంగా రాణించగలమని చాటుతూనే.. తర్వాతి తరం వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో మహిళలు పౌరోహిత్యం లోకి ప్రవేశించడం సమంజసమా, కాదా.. అనే అంశం పైన మీ అభిప్రాయాలు పంచుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్