Updated : 19/07/2021 19:07 IST

ఈ నొప్పుల విషయంలో అశ్రద్ధ వద్దు!

సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా గృహచిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం. అయితే ఇలా చేసే ముందు నొప్పి వస్తున్న విధానాన్ని బట్టి అది మనలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచనో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పిని గుర్తించి, దాన్ని వైద్యులకు వివరించి సరైన చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.

1. ఇన్ఫెక్షన్ కావచ్చు...

మూత్రనాళంలో మొదలై పొత్తికడుపు వరకు నొప్పి చేరుకొంటే దాన్ని మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సూచనగా భావించాలి. కడుపు నొప్పితో పాటు యూరిన్‌కి వెళ్లేటప్పుడు మంట, నొప్పి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు. కొన్ని సందర్భాల్లో మూత్రంతో పాటు రక్తం కూడా పడే అవకాశాలుంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఇన్ఫెక్షన్ ప్రభావం కిడ్నీల వరకు వ్యాపిస్తుంది. అప్పుడప్పుడూ మూత్ర వ్యవస్థలో కణితులు ఏర్పడటం వల్ల కూడా ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మూత్రనాళం నుంచి పొత్తికడుపు వరకు నొప్పి వస్తున్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిది. మూత్రపరీక్ష చేయడం ద్వారా వైద్యులు మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత చికిత్స చేయడం ప్రారంభిస్తారు. అంతేకానీ.. చిన్న సమస్యే కదా అని వదిలేస్తే అది క్రమంగా ప్రాణాల మీదకు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

2. పొత్తికడుపు మధ్యభాగంలో..

కొంతమంది మహిళల్లో పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాల్లో ఏదో ఒకదానిలో నొప్పి వస్తున్నట్లు భావించాలి. ఇది మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఎండో మెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, అండాశయాల్లో సిస్టులు.. వంటి ఆరోగ్య సమస్యలకు సూచనగా భావించాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే.. గర్భస్రావం జరగడం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(ఫెలోపియన్ ట్యూబ్స్‌లో బిడ్డ పెరగడం) వంటి క్లిష్టమైన సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

3. బొడ్డు దగ్గర మొదలై...

కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి బొడ్డు దగ్గర మొదలై ఛాతీ వరకు పాకుతుంది. దాంతో పాటు కడుపులో మండుతున్నట్లుగానూ అనిపిస్తే అది పెప్టిక్ అల్సర్‌కి సూచనగా భావించవచ్చు. ముఖ్యంగా ఇది రాత్రివేళల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనితో పాటు ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులవడం, ఛాతీ నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

4. కడుపు ఉబ్బరంతో పాటు...

కడుపు ఉబ్బినట్లుగా అనిపించడంతో పాటు ఎక్కువ నొప్పి వస్తే.. అది ఉదర సంబంధిత క్యాన్సర్లకు సూచన కావచ్చు. కాబట్టి సత్వరమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

5. కటిభాగంలో...

కొంతమంది స్త్రీలలో కటిభాగంలో చాలా తక్కువ స్థాయిలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత తక్కువగా ఉంది కదా అనే ఉద్దేశంతో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆరు నెలలకు మించి ఈ నొప్పిని మీరు భరిస్తున్నట్లయితే.. దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్‌కి సూచనగా భావించాలి. అంటే అండాశయం నుంచి గుండెకు చేరాల్సిన మలినమైన రక్తం.. మళ్లీ అండాశయానికే చేరుకోవడం కారణంగా ఈ నొప్పి వస్తుంది. దీనికి సత్వరమే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి నొప్పి తీవ్రస్థాయికి చేరుకోకముందే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

6. సూదులు గుచ్చినట్లుగా...

ఉదరభాగంలో కుడివైపున సూదులు గుచ్చినట్లుగా నొప్పి వస్తూ, దాంతో పాటు వాంతులు, జ్వరం ఉన్నట్లయితే అది అపెండిసైటిస్ కావచ్చు. ఈ లక్షణం కనిపిస్తే ఆలోచించకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. అపెండిక్స్‌కి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఈ నొప్పి వస్తుంది. దీన్ని వెంటనే సర్జరీ చేసి తొలగించుకోవడం మంచిది. లేదంటే అపెండిక్స్ బద్దలై.. ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

7. ఈ లక్షణాలు కూడా ఉంటే...

కడుపుబ్బరంగా అనిపించడం, తిమ్మిరిగా ఉండటం, డయేరియా లేదా మలబద్ధకం - వీటన్నింటితో పాటు కడుపునొప్పి ఉంటే అది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌కి సూచన కావచ్చు. ఇది తరచుగా వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి.

8. మెలిపెడుతున్నట్లుగా...

నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం మామూలు విషయమే. అయితే పిరియడ్స్‌కి పిరియడ్స్‌కి మధ్య పొత్తికడుపులో మెలిపెడుతున్నట్లుగా నొప్పి వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే సాధారణంగా రుతుక్రమంలో భాగంగా అండాశయం కొన్ని రకాల ద్రవాలతో పాటు అండాన్ని విడుదల చేస్తుంది. ఆ సమయంలో కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది. ఇది ఒక్కోసారి ఒక్కోవైపున వస్తుంది. దీన్నే మిట్టెల్‌స్క్మెర్జ్ అని పిలుస్తారు. సాధారణంగా తీవ్రమైన నొప్పి నాలుగైదు గంటల్లోనే తగ్గిపోతుంది. నొప్పి తగ్గిపోయింది కదాని తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

9. సుఖవ్యాధులకు సూచన కావచ్చు...

కటివలయం లేదా పొత్తికడుపు భాగంలో వచ్చే నొప్పి కొన్ని సందర్భాల్లో సుఖవ్యాధులకు సూచన కావచ్చు. నొప్పితో పాటు యూరిన్‌కి వెళ్లే సమయంలో నొప్పి, నెలసరికి, నెలసరికి మధ్య రక్తస్రావం, వైట్‌డిశ్చార్జి అవుతుంటే మాత్రం తగిన చికిత్స తీసుకోవడం మంచిది. మీతో పాటు మీ భాగస్వామికి కూడా చికిత్స అవసరమవుతుంది.

10. కిందకి జారినట్లు ఉంటే...

వయసు పెరిగే కొద్దీ అవయవాల పటుత్వం తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత లేదంటే లేటు వయసులో గర్భాశయం, మూత్రాశయం.. వంటి అవయవాల విషయాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. దీంతో అవి శరీరంలో ఉండాల్సిన ప్రదేశం కంటే కిందికి జారినప్పుడు అసౌకర్యంగా అనిపించడంతో పాటు నొప్పి కూడా వస్తుంటుంది. అలాగే పొత్తికడుపులో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆపరేషన్, కొన్ని వ్యాయామాల ద్వారా వాటిని తిరిగి యథాస్థానానికి తీసుకురావచ్చు.
ఒక్కోసారి ఎలాంటి సీరియస్ కారణం లేకుండా కూడా శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పిగా అనిపించవచ్చు. అందుకే అన్ని సందర్భాలలోనూ ఆయా నొప్పుల గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగని 'ఏమీ కాదులే' అని వాటిని అశ్రద్ధ చేయడమూ మంచిది కాదు. ఏమాత్రం అసౌకర్యంగా, అసాధారణంగా అనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మాత్రం మరవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని