మహిళల ఆరోగ్యం కోసం.. డిజిటల్ వేదిక నెలకొల్పి..!
స్త్రీలకు ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త అవసరమంటోంది బెంగళూరుకు చెందిన అచితా జాకబ్. ఈ అవగాహన పెంచడానికే ఓ డిజిటల్ వేదికను ప్రారంభించిందామె.
(Photos: Instagram)
ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆతృత పడే మనకు మన అనారోగ్యాల గురించి ఆలోచించే తీరికే దొరకదు..
మనదాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యం మరికొందరికి..
నెలసరి, లైంగిక సమస్యలు, సంతానలేమి.. వీటి గురించి నలుగురిలో మాట్లాడాలంటే భయం, సిగ్గు..
సామాజిక ఒత్తిళ్లు, తమనెక్కడ జడ్జ్ చేస్తారోనన్న భయం, ఆర్థిక సమస్యలు.. ఇలా కారణమేదైనా చాలామంది మహిళలు తమ ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేనట్లు.. అనారోగ్యం తీవ్రమైతే చికిత్స తీసుకున్నా ఫలితం ఉండకపోవచ్చు. అందుకే స్త్రీలకు ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త అవసరమంటోంది బెంగళూరుకు చెందిన అచితా జాకబ్. ఈ అవగాహన పెంచడానికే ఓ డిజిటల్ వేదికను ప్రారంభించిందామె. మహిళల ఆరోగ్య సమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా నిలుస్తోన్న తన ఆరోగ్య వేదిక గురించి అచిత ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..
ఐఐటీ బెంగళూరులో చదువుకున్న అచిత.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరింది. ఎప్పటికైనా వ్యాపార రంగంలోనే స్థిరపడాలన్నది ఆమె కల. అయితే హార్వర్డ్‌లో ఉండగానే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై ఓ అధ్యయనం చేసిందామె. ఇందులో మహిళలు తమ ఆరోగ్యానికి ఆఖరి ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించింది అచిత. ఎలాగైనా వారి ఆలోచనను మార్చాలని నిర్ణయించుకున్న ఆమె.. దీనికి పరిష్కార మార్గంగా ఓ ఆరోగ్య వేదికను ప్రారంభించాలనుకుంది.
వాళ్ల నిర్లక్ష్యమే ఆలోచింపజేసింది!
‘నా అధ్యయనంలో భాగంగా వందలాది మంది మహిళలతో మాట్లాడాను. అందరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లల బాగోగులు-అవసరాల గురించే చెప్పారు తప్ప.. తమ ఆరోగ్యం/హెల్త్ చెకప్స్ గురించి ఒక్కరూ స్పందించలేదు. ‘సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే.. ఇప్పుడెందుకు చెకప్స్.. డబ్బు వృథా!’ అన్న వారూ లేకపోలేదు. ఇక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు పురుషుల్లోనే ఎక్కువన్న భావనతో మరికొందరున్నారు. నెలసరి, ప్రత్యుత్పత్తి సమస్యలు, లైంగిక అంశాల గురించి బయటికి చెప్పుకుంటే సమాజం నిందిస్తుందేమోనన్న భయంతో ఆ విషయాల్ని మనసులోనే అణచుకుంటున్నట్లు ఇంకొందరు చెప్పారు.. నిజానికి ఈ నిర్లక్ష్యం వారి అనారోగ్యాల్ని దూరం చేయకపోగా.. కొత్త సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఎక్కువ! అందుకే మహిళల్లో ఉన్న ఈ నిర్లక్ష్యాన్ని పూర్తిగా తొలగించాలన్న నిర్ణయానికొచ్చా. ఈ క్రమంలోనే మహిళలకు తమ ఆరోగ్య సమస్యలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు 2020లో ‘ప్రొయాక్టివ్ ఫర్ హర్’ అనే డిజిటల్ ఆరోగ్య వేదికను ప్రారంభించా..’ అంటోంది అచిత.
అవగాహనతో మొదలు..!
మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి.. తమ సమస్యల్ని నిపుణులతో పంచుకోవాలంటే.. తొలుత వాళ్లు యాక్టివ్‌గా ముందుకు రావాలి. అది సాధ్యం కావాలంటే.. ఆయా అనారోగ్యాల గురించి, వాటి మూలంగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు/పరిణామాల గురించి వారికి తెలియాలి. అందుకే ఈ అంశాల గురించి ముందు వారిలో అవగాహన పెంచాలనుకుంది అచిత. ఈ క్రమంలోనే సోషల్ మీడియా క్యాంపెయిన్లు, నిపుణులతో వెబినార్లు, వర్క్‌షాప్స్, ఉచితంగా డాక్టర్‌ని సంప్రదించే వెసులుబాటు కల్పించడం.. వంటి కార్యక్రమాలెన్నో నిర్వహించిందామె. దీంతో మహిళలు ఒక్కొక్కరుగా తమ ఆరోగ్య సమస్యల గురించి పంచుకోవడానికి ముందుకు రావడం గమనించింది అచిత. అప్పుడు తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవల్ని మహిళలకు అందించడం మొదలుపెట్టానంటోందామె.
‘మనదేశంలో చాలామంది మహిళలు సామాజిక ఒత్తిళ్ల కారణంగా నెలసరి, లైంగిక విషయాల గురించి మరో వ్యక్తితో పంచుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ల సమస్యలు ఆలస్యంగా బయటపడడం, ఒక్కోసారి చికిత్స తీసుకున్నా సమస్య తగ్గకపోవడం.. వంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయి. మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తోన్న ఇలాంటి సామాజిక ఒత్తిళ్లు, నిర్ణయాత్మక ప్రశ్నలకు తావు లేకుండా.. నిర్మొహమాటంగా, నిస్సందేహంగా మహిళలు తమ అనారోగ్యాల్ని పంచుకునేలా, నిపుణుల సలహాలు పొందేలా ఈ వేదికను ప్రారంభించాను..’ అంటోంది అచిత.
నెలసరి నుంచి మెనోపాజ్ దాకా..!
ప్రస్తుతం తన ఆరోగ్య వేదిక ద్వారా మహిళల ప్రతి ఆరోగ్య సమస్యకు నిపుణుల సహకారంతో పరిష్కార మార్గం చూపుతోంది అచిత.
‘గైనకాలజీ, ఎండోక్రైనాలజీ, చర్మ వ్యాధి నిపుణులు, మానసిక నిపుణులు, ఫిట్‌నెస్-పోషకాహార నిపుణులు.. ఇలా మా వద్ద అనుభవజ్ఞులైన వైద్య నిపుణులున్నారు. నెలసరి దగ్గర్నుంచి పీసీఓఎస్, లైంగిక సమస్యలు, చర్మం-జుట్టు సమస్యలు, అధిక బరువు, మెనోపాజ్ దాకా.. ఇలా సమస్యేదైనా అత్యుత్తమమైన పరిష్కార మార్గాలు ఈ నిపుణుల ద్వారా మహిళలకు అందిస్తున్నాం. ఈ క్రమంలో ముందుగా మహిళలు తమ సమస్యను బట్టి ఫోన్ ద్వారా సంబంధిత డాక్టర్‌ను సంప్రదించే అవకాశం ఇస్తాం. ఆపై వ్యాధి నిర్ధారణ దశ పూర్తి చేసుకొని.. చికిత్స ప్రారంభిస్తాం. అంతేకాదు.. ఆయా ఆరోగ్య సమస్యల్ని బట్టి.. పలువురు డాక్టర్ల సలహాలూ ఇప్పిస్తాం. ఉదాహరణకు.. పీసీఓఎస్ సమస్యకు గైనకాలజిస్ట్ సలహాతో పాటు.. దీనికి అనుసంధానమై ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు చర్మ వ్యాధి నిపుణులు, మానసిక నిపుణులు, పోషకాహారం.. తదితర విషయాల్లోనూ నిపుణులతో పరిష్కార మార్గాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా వాళ్లు ఒక ఆరోగ్య సమస్యతో మా వద్దకొస్తే.. దాన్ని పూర్తి నయం చేసేందుకు అన్ని కోణాల్లో వారికి నిపుణుల సలహాలు అందిస్తున్నాం. అంతేకాదు.. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల ద్వారా ప్రత్యేక డయాగ్నోస్టిక్ ప్యానల్స్ సదుపాయాన్ని మహిళలకు అందిస్తున్నాం. ఈ క్రమంలో మా వైద్యులు సూచించిన ఏ పరీక్ష అయినా వారు చేయించుకోవచ్చు..’ అంటూ తన హెల్త్ స్టార్టప్ సేవలు ఈ మూడేళ్లలో ఐదు వేల మందికి పైగా చేరువైనట్లు చెబుతోంది అచిత.
ఉద్యోగులకూ తరగతులు!
ఇలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికగా మహిళలకు ఆయా ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపుతోన్న అచిత.. టెలిగ్రామ్ ద్వారా మహిళలకు ఎమోషనల్ సపోర్ట్‌ని అందిస్తోంది. ఈ క్రమంలో ఒకే రకమైన అనారోగ్యాల్ని ఎదుర్కొన్న మహిళలు ఈ వేదికగా కలుసుకొని చాట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
‘ఇలాంటి చర్చల వల్ల మహిళల్లో ఒంటరితనం అనే భావన దూరమవుతుంది. తామూ ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోనూ మహిళా ఉద్యోగుల కోసం వెబినార్లు నిర్వహిస్తున్నాం.. ఈ క్రమంలో పనిలో పడిపోయి వాళ్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. నిద్ర, పోషకాహారం, ఒత్తిడిని ఎదుర్కోవడం.. వంటి అంశాలపై నిపుణులచే అవగాహన కల్పిస్తున్నాం..’ అంటోన్న అచిత.. దేశవ్యాప్తంగా మహిళలందరిలో ఆరోగ్య స్పృహను పెంచడమే తన లక్ష్యమంటోంది. త్వరలోనే మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ల (UTI)ను స్వయంగా గుర్తించగలిగే కిట్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెబుతోందామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.