ఆమె... మాయమైంది!

ఏడేళ్ల పాప ఆరుబయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని ఒకరు. స్కూలుకెళ్లిన బాబు ఇంటికి రాలేదని తల్లడిల్లిపోతోన్న తల్లి మరొకరు... తమ బిడ్డల జాడ తెలుసుకోమంటూ పల్లవిని ప్రాధేయపడుతుంటారు.

Updated : 17 Jun 2024 08:10 IST

ఏడేళ్ల పాప ఆరుబయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని ఒకరు. స్కూలుకెళ్లిన బాబు ఇంటికి రాలేదని తల్లడిల్లిపోతోన్న తల్లి మరొకరు... తమ బిడ్డల జాడ తెలుసుకోమంటూ పల్లవిని ప్రాధేయపడుతుంటారు.

వాహనంలో తరలిస్తోన్న పిల్లల్ని చూశామని కొందరు... చిత్రహింసలకు గురవుతోన్న చిన్నారుల ఆచూకీ చెప్పేవారు ఇంకొందరు. ఆ వివరాలు ఆవిడకే ఎందుకు చెబుతారు? ఇంతకీ ఎవరీమె.  ఆమె వారినెలా కాపాడుతుంది...?

పల్లవి ఘోష్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కార్యకర్త. తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం, ప్రభుత్వాధికారుల సాయంతో అక్రమ రవాణాదారుల ఆటకట్టించడం, బయటపడినవారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ఆమె దినచర్య. బెంగాల్‌కి చెందిన పల్లవి కుటుంబం అసోంలోని లుమ్‌డింగ్‌లో స్థిరపడింది. అప్పటికి ఆమెకు పదమూడేళ్లు ఉంటాయేమో! సెలవుల్లో మేనమామ ఇంటికెళ్లింది. అప్పుడు చూసిందో సంఘటన. కిడ్నాప్‌ అయిన కూతురిని వెతుక్కుంటూ ఇల్లిల్లూ వెతుకుతోన్న ఓ తండ్రి వేదన అది. ఆ చిన్న వయసులోనే అది చూసి కదిలిపోయిన పల్లవి... తనవంతుగా ఆ అమ్మాయి జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది. తను దొరకలేదు కానీ, ఆ ఘటన మాత్రం పల్లవి మనసుపై చెరగని ముద్ర వేసింది. తన కెరియర్‌ మార్గాన్నే మార్చేసింది. ఉన్నత చదువులకోసం పల్లవి దిల్లీ చేరింది. ఇక్కడ డిగ్రీ చేశాక, చెన్నైలో ‘జెండర్‌ ఇష్యూస్‌’ మీద పీజీ చేసింది. ఆపై హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే ‘శక్తివాహిని’ అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరింది. తరవాత మరికొన్ని సేవా సంస్థల్లోనూ పనిచేసింది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులెన్నో ఆమెకు కనిపించాయి. ముఖ్యంగా పశ్చిమ్‌బంగ, ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళల్ని దిల్లీలో పని మనుషులుగా అమ్మేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది. తరవాత అలాంటి వారినెందరినో గుర్తించి విడిపించింది. ఇక రాజస్థాన్, హరియాణాలది మరో రకమైన పరిస్థితి. ‘బెంగాల్, అసోం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను ఎత్తుకొచ్చి వయసుతో సంబంధం లేకుండా అక్కడివాళ్లకిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. గ్రామాల్లో ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపరు. అడ్డుకోరు. ఇక్కడి నుంచి వీరిని బయటకు తీసుకు రావడానికి ఎంతో సాహసం చేయాలి’ అనే పల్లవి శక్తివాహినిలో ఏడేళ్లు పని చేశాక 2020లో సొంతంగా ‘ఇంపాక్ట్‌ అండ్‌ డైలాగ్‌’ అనే ఎన్జీవో స్థాపించి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది.

దాడులెన్నో ఎదుర్కొని...

బందీలుగా మారిన ఆడపిల్లలను ఇళ్లు, వ్యభిచార గృహాల నుంచి విడిపించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది పల్లవి. కొన్నిసార్లు ఈ ముఠాలు భౌతికదాడులకూ దిగాయి. ఎన్నో సార్లు చావునుంచీ తప్పించుకుంది. ఓవ్యక్తి కోర్టు హాలులోనే కత్తి చూపించి బెదిరించాడు. ‘నిజానికి చాలామంది ట్రాఫికింగ్‌ని అడ్డుకోవడం, దాన్ని చేధించడం సాహసోపేతమైనదని నమ్ముతారు. కానీ, దానికంటే బాధితులను గుర్తించే ప్రయాణమే కష్టతరమైంది’ అనే పల్లవి... ఇందుకోసం సమస్య తీవ్రంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ఊరూరా తిరిగి వివిధ వర్గాల మహిళలు, స్కూలు విద్యార్థినులకు మానవ అక్రమ రవాణా గురించి చెబుతోంది. అలాంటి పరిస్థితులను గుర్తించి స్పందించేలా... రిక్షావాళ్లను, క్యాబ్‌ డ్రైవర్లను, ఆటోవాళ్లను చైతన్యపరుస్తోంది. ‘ఎందుకంటే ఆడవాళ్లను ఎత్తుకుపోవాలంటే వీరి ద్వారానే పోవాలి. వీరు ఆపగలిగితే సగం కేసులు ఆగిపోతాయి’ అని చెబుతోంది.

కొత్త జీవితాన్నిస్తోంది...

ఆడపిల్లల అక్రమ రవాణాను నిరోధించడం ఒకెత్తయితే వాళ్లని కాపాడి తీసుకొచ్చాక వారికి కొత్త జీవితాలు ఇవ్వడం మరొకెత్తు. సామాజిక దురాచారాలు, పేదరికం, నిరుద్యోగం, వలసలు, నిరక్షరాస్యత వంటి ఎన్నో సమస్యలు... ఈ మానవ అక్రమ రవాణాకు దారితీస్తున్నాయి. ఇక, బాధితుల గురించి తెలిసినప్పుడు... ఐపీసీ(ట్రాఫికింగ్‌)సెక్షన్‌ 370కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు బుక్‌ చేయమని పోలీసు అధికారులను ఒప్పించడం, మిస్సింగ్‌ కేసుల డేటాను సంపాదించడమూ అంత తేలికేం కాదంటారామె. ‘అక్రమ రవాణా నుంచి బయటపడ్డాక కూడా బాధిత మహిళలు సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు కుంగుబాటుకి గురై ప్రాణాలూ తీసుకుంటుంటారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపాలి. నేతపని, ఊలు అల్లడం, కుట్టు పని, కంప్యూటర్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కోర్సులు నేర్పించి...వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తాం. స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు అవసరమైన చేయూతనందిస్తాం. వాళ్ల పిల్లల్ని పాఠశాలలకు పంపిస్తున్నాం. ఇలా ఇప్పటివరకూ పదివేలమందికిపైగా అక్రమరవాణా బాధితులకు అండగా నిలిచాం. ప్రజల్లోనూ మార్పు వస్తే మరింతమందికి సాంత్వన కలిగించొచ్చు’ అంటోంది పల్లవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్