Published : 15/05/2022 10:43 IST

అలాంటి సెంటిమెంట్లు ఉన్నా.. మా పైన మాకే నమ్మకం ఎక్కువ!

(Photos: Instagram)

ఏదైనా పని మొదలుపెట్టే ముందు దైవ దర్శనం చేసుకోవడం కొంతమందికి అలవాటు..

ఫలానా రంగు డ్రస్‌ వేసుకుంటే కలిసొస్తుందన్న నమ్మకం మరికొంతమందిలో ఉంటుంది.

బయటికి వెళ్లే ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సక్సెసవుతామని ఇంకొందరు భావిస్తుంటారు.

తమకూ ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయంటున్నారు కొందరు తారలు. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో కియారా అడ్వాణీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చింది. తాను బాగా విశ్వసించే ఓ అంశం కెరీర్‌ పరంగా తనకు కలిసొస్తుందంటోందీ అందాల తార. మరి, కియారా అంతగా నమ్మే ఆ విషయమేంటి? అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు తమ నమ్మకాల గురించి వివిధ సందర్భాల్లో ఏం చెప్పారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

కియారా అడ్వాణీ

కొంతమంది ఏ పనైనా కార్యరూపం దాల్చే దాకా ఎవరితోనూ చెప్పరు. అలా చెప్తేనే ఆటంకాలు లేకుండా విజయం సాధించచ్చన్నది వారి నమ్మకం. తాను కూడా అంతేనంటోంది కియారా. తన సినిమా ‘భూల్‌ భూలయ్యా - 2’ ప్రచారంలో భాగంగా ఇటీవలే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తను బాగా నమ్మే ఓ విషయం గురించి బయటపెట్టింది.

‘నేను సాధారణంగా మూఢనమ్మకాలకు దూరంగా ఉంటాను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం బాగా నమ్ముతా. అదేంటంటే.. నేను ఒక సినిమాకు సంతకం చేసే దాకా దాని గురించి ఎవరికీ చెప్పను.. పరోక్షంగా కూడా తెలియనివ్వను.. అప్పుడే అది నిరాటంకంగా ముందుకు సాగుతుందని, సక్సెసవుతుందని నా గట్టి నమ్మకం!’ అంది వసుమతి.

సమంత

టాలీవుడ్‌ బ్యూటీ సమంతకు కూడా కియారా లాంటి నమ్మకమే ఉంది. ముఖ్యంగా చిత్ర షూటింగ్‌ ప్రారంభమయ్యే దాకా ఆ సినిమాలో తన పాత్ర గురించి బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడదని, అలాగే సినిమా విడుదలయ్యే దాకా దాని గురించి మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపదని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించడం కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్ద సెంటిమెంట్!

కాజల్‌ అగర్వాల్

కొంతమంది తాము అనుకున్న పనులు సక్సెస్‌ కావాలని తమకు నచ్చిన రంగు దుస్తులు వేసుకుంటుంటారు. టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ప్రతి సినిమాలో మొదటి సీన్‌లో కాజల్‌ తెలుపు రంగు దుస్తుల్లో కనిపించడం మనం చూసే ఉంటాం. అయితే ఇదే తన నమ్మకమని, ఈ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల ఆ సినిమా విజయవంతం అవుతుందని ఈ ముద్దుగుమ్మ నమ్మకం. 2009లో విడుదలైన ‘మగధీర’ అప్పట్నుంచే ఈ ట్రెండ్‌ ఫాలో అవుతోందట కాజల్. ఆ చిత్రంలో తన తొలి సీన్‌లో కాజల్‌ తెలుపు రంగు చుడీదార్‌లో ఎంట్రీ ఇవ్వడం మనం మర్చిపోగలమా?!

రకుల్‌ ప్రీత్‌ సింగ్

కొంతమందికి కొన్ని లక్కీ నంబర్లుంటాయి. ఈ విషయానికొస్తే తన లక్కీ నంబర్లు 1, 3 అంటోంది రకుల్‌. ఏ పని/ప్రాజెక్ట్‌ ప్రారంభించేటప్పుడైనా తేదీలోని అంకెల్ని కలిపి ‘8’ రాకుండా చూసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ఈ అంకె ఉన్న తేదీల్లో సినిమాకు సంబంధించిన ఎలాంటి కథలు విననంటోందీ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

దీపికా పదుకొణె

ఏ పనైనా నిర్విఘ్నంగా సాగాలంటే గణపతికి పూజ చేయడం మనకు అలవాటే! తద్వారా అనుకున్న సమయంలో పని పూర్తవుతుందనేది మన నమ్మకం. దీపికా పదుకొణెకు కూడా ఈ అలవాటుందట! ‘నా ప్రతి సినిమా విడుదలకు ముందు ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించడం నాకు అలవాటు. ఆ గణపతి దయ వల్ల సినిమా సక్సెసవుతుందనేది నా బలమైన నమ్మకం..’ అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇక కత్రినాకూ ఇలాంటి అలవాటే ఉంది. సినిమా విడుదలకు ముందు అజ్మీర్‌ దర్గాను సందర్శిస్తుందట క్యాట్.

విద్యా బాలన్

బ్యూటీ ఉత్పత్తులు అందాన్ని తీసుకురావడమే కాదు.. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయంటోంది విద్య. పాకిస్థాన్‌కు చెంది హష్మి బ్రాండ్‌ కాటుక (ఇదొక రకమైన ఐలైనర్‌ పౌడర్‌)నే నిత్యం వాడతానని, అది పెట్టుకోకుండా బయటికి వెళ్లనని చెబుతోందీ బబ్లీ బ్యూటీ. మరి, ఎందుకిలా అని అడిగితే..? అదే తన అదృష్ట వస్తువని, అది పెట్టుకుంటే కెరీర్‌ నిరాటంకంగా ముందుకు సాగిపోతుందని ఓ సందర్భంలో పంచుకుంది విద్య.

ఏక్తా కపూర్

బాలీవుడ్‌ దర్శక నిర్మాత ఏక్తా కపూర్‌ టీవీ సీరియల్స్‌ పేర్లను ఓసారి పరిశీలిస్తే.. ‘క్యోంకి సాస్‌ భీ కభీ బహూ థీ’, ‘కహానీ ఘర్‌ ఘర్‌ కీ’.. ఇలా ప్రతిదీ ‘K’ అనే ఇంగ్లిష్‌ అక్షరంతో ప్రారంభమవడం మనం గమనించచ్చు. పైగా ఈ సీరియల్స్‌ అన్నీ ప్రేక్షకాదరణను చూరగొన్నాయి కూడా! అందుకే ఈ అక్షరం తనకు అదృష్టమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ట్యాలెంటెడ్‌ లేడీ.

బిపాసా బసు

నరదిష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుందనేది సామెత. అందుకే దిష్టి తగలకుండా వివిధ పద్ధతుల్ని పాటించడం మనకు తెలిసిందే! బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు కూడా తన కారుకు దిష్టి తగలకుండా ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చిమిర్చితో తయారుచేసిన దండను కారుకి వేలాడదీస్తుందట! ఈ పద్ధతి తనకు అమ్మే నేర్పించిందని, ఏ వారమూ దీన్ని మిస్సవనని అంటోంది బిపాసా.

ఇలాంటి సెంటిమెంట్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తికరంగానే ఉంటుంది.. అయితే ఇలాంటి వాటి కన్నా- మన పైన మనకు ఉండే నమ్మకమే మనల్ని విజయపథం వైపు నడిపిస్తుందన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు... ఈ విషయాన్ని కూడా ఈ తారలంతా తమదైన ప్రత్యేకతతో, సాధించిన విజయాలతో ఇప్పటికే నిరూపించేశారు. అందుకే సెంటిమెంట్లను పట్టుకుని కూర్చోకుండా మనదైన ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేద్దాం.. మనమేమిటో నిరూపించుకుందాం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని