మొటిమలు, పిగ్మెంటేషన్‌కు భాగ్యశ్రీ చిట్కా!

మహిళలను బాగా ఇబ్బంది పెట్టే సౌందర్య సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి. అలాగే ముడతలు, పిగ్మెంటేషన్‌ కూడా ముఖాన్ని అంద విహీనంగా మారుస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు.

Published : 17 Oct 2021 12:25 IST

మహిళలను బాగా ఇబ్బంది పెట్టే సౌందర్య సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి. అలాగే ముడతలు, పిగ్మెంటేషన్‌ కూడా ముఖాన్ని అంద విహీనంగా మారుస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి సత్ఫలితాలు ఇస్తాయన్న గ్యారంటీ లేదు. పైగా ఒక్కోసారి దుష్ర్పభావాలు కూడా ఎదురుకావచ్చు. ఈ క్రమంలో మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, పిగ్మెంటేషన్‌.. వంటి సమస్యల్ని తగ్గించుకునేందుకు ఓ సహజ చిట్కాను మన ముందుకు తీసుకొచ్చింది అలనాటి అందాల నటి భాగ్యశ్రీ.

‘భాగ్యశ్రీ’ అనగానే అందరికీ ‘మైనే ప్యార్‌ కియా’ సినిమానే గుర్తొస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే... ఆమె ఓ సర్టిఫైడ్‌ న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ అని! అందుకే క్రమం తప్పకుండా వివిధ రకాల బ్యూటీ టిప్స్‌, ఆరోగ్య చిట్కాల్ని, ఫిట్‌నెస్‌, కుకింగ్‌ వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అమ్మాయిల ముఖ సౌందర్యానికి సంబంధించి ఓ మంచి చిట్కాను షేర్‌ చేసుకుంది.

అరటి తొక్కతో ఆ మచ్చలను తగ్గించుకోండి!

అరటి పండే కాదు...వీటి తొక్కతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనకు తెలిసిందే! అయితే వీటితోనే మొటిమలు, పిగ్మెంటేషన్‌ సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చంటోంది భాగ్యశ్రీ. ఈ నేపథ్యంలో ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె... ‘వయసు పెరిగే కొద్దీ మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషన్.. మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇంట్లోనే ఉండి వీటిని ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే నా దగ్గర ఓ సులభమైన చిట్కా ఉంది. అదే అరటి పండు తొక్క. నేను దీంతో నా ముఖాన్ని మర్దన చేసుకుంటాను. ఇందులో చర్మ సౌందర్యాన్ని పరిరక్షించే సిలికా, ఫినోలిక్‌ అనే రెండు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. సిలికా.. వయసు పెరిగే కొద్దీ తగ్గిపోయే కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక యాంటీ మైక్రోబియల్‌గా పనిచేసే ఫినోలిక్.. ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది’ అని చెప్పుకొచ్చింది.

ఎలా వాడాలంటే!

ఇక అరటి తొక్కను ఉపయోగించే విధానాన్ని కూడా వీడియోలో వివరించింది భాగ్యశ్రీ... ‘అరటి పండు తొక్కతో పావుగంట పాటు నెమ్మదిగా, మృదువుగా ముఖంపై రుద్దుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరి. అరటి తొక్కల్ని ఫేస్‌ మాస్కుల్లో భాగంగా కూడా ఉపయోగించుకోవచ్చు. తరచూ ఇలా చేయడం వల్ల చర్మంలోని మృత కణాలు తొలగిపోతాయి. ఫలితంగా ముఖం మృదువుగా మారడంతో పాటు మెరుపుదనాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి మీరూ ఈ చిట్కాను పాటించండి. అందంగా మెరిసిపోండి!’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్