కంటి అలసటను ఇలా తగ్గించుకుందాం!

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నట్లు కళ్లు ఎంతో సున్నితమైనవి.. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం మన విధి. అయితే కరోనా వచ్చాక మన కళ్లకు పని బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు, వర్చువల్‌ మీటింగులు.. అంటూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్లు/ ల్యాప్‌టాప్‌/ స్మార్ల్‌ఫోన్లకే అధిక సమయం కళ్లప్పగిస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతోంది. దీంతో చాలామందికి కళ్లు పొడిబారడం, మంట పుట్టడం, కళ్ల కింద నల్లటి వలయాలు.. వంటి సమస్యలొస్తున్నాయి.

Updated : 24 Jun 2021 20:58 IST

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నట్లు కళ్లు ఎంతో సున్నితమైనవి.. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం మన విధి. అయితే కరోనా వచ్చాక మన కళ్లకు పని బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు, వర్చువల్‌ మీటింగులు.. అంటూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్లు/ ల్యాప్‌టాప్‌/ స్మార్ల్‌ఫోన్లకే అధిక సమయం కళ్లప్పగిస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతోంది. దీంతో చాలామందికి కళ్లు పొడిబారడం, మంట పుట్టడం, కళ్ల కింద నల్లటి వలయాలు.. వంటి సమస్యలొస్తున్నాయి.

అలాగని ఈ పనులన్నింటికీ దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే కంటి అలసటను దూరం చేసుకునే ప్రయత్నం చేయమంటోంది అలనాటి అందాల తార భాగ్యశ్రీ. ఈ క్రమంలోనే అలసిన కళ్లకు సాంత్వననిచ్చే కొన్ని చిట్కాలను ఇటీవలే ఇన్‌స్టాలో పంచుకుందామె. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. తాను పాటించే సౌందర్య, ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాల్ని.. కుకింగ్‌ టిప్స్‌ని వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఈసారి కంటి ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను మన ముందుకు తెచ్చింది.

వరమో/శాపమో తెలియట్లేదు!

‘ఈ డిజిటల్‌ ప్రపంచంలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనేది మనకు దక్కిన వరమో/శాపమో అర్థం కావడం లేదు. ఈ పని విధానం వల్ల మన కళ్లపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అందుకే కంటి ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో విటమిన్‌ ‘ఎ’ (రెటినాల్‌, బీటా కెరోటిన్‌) కళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎక్కువగా లభించే క్యారట్లు, ఆకుకూరలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు కళ్ల అలసటను తగ్గించుకునేందుకు కొన్ని రకాల వ్యాయామాలు కూడా అలవాటు చేసుకోవాలి. కంటి చూపు మెరుగయ్యేందుకు, భవిష్యత్‌లో ఎలాంటి కంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఇవి బాగా సహకరిస్తాయి’ అంటూ వీడియోను షేర్‌ చేసింది భాగ్యశ్రీ.

ఇలా చేస్తే కళ్లు రిలాక్సవుతాయి!

‘ప్రస్తుతం కంప్యూటర్లు/ ల్యాప్‌టాప్‌/ స్మార్ట్‌ఫోన్లతోనే రోజంతా గడిచిపోతోంది. దీంతో కళ్ల మీద ఒత్తిడి పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న చిట్కాను పాటిస్తే కంటి అలసట నుంచి ఉపశమనం పొందచ్చు. అదేంటంటే.. ముందుగా కళ్లు మూసుకోవాలి. చేతి మునివేళ్లను కళ్లపై ఉంచి సవ్యదిశలో మూడుసార్లు, ఆ తర్వాత అపసవ్య దిశలో మరో మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి. ఆపై మూడుసార్లు కళ్లు మూస్తూ తెరవాలి. ఈ చిన్నపాటి వ్యాయామం తరచుగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కళ్లకు సాంత్వన లభిస్తుంది.

దీంతో పాటు మరో చిట్కా ఏంటంటే.. కంప్యూటర్‌ స్ర్కీన్‌ ముందు ఎక్కువగా పనిచేసే వారు బ్లూలైట్‌ ఫిల్టర్‌ గ్లాసెస్‌ వాడడం ఉత్తమం. ఎందుకంటే ఈ కళ్లద్దాలు కంప్యూటర్‌ నుంచి వెలువడే నీలి రంగు కాంతిని కళ్లలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. తద్వారా కళ్లపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు..’ అంటోందీ అందాల తార.

వీటితోనూ ఉపశమనం!

కళ్లు అలసిపోకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు కూడా దోహదం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

* చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు తదేకంగా చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారి, మంట పుడుతుంది. అందుకే మధ్యమధ్యలో ఐదు పది నిమిషాల విరామం తీసుకోవాలి. అయినా ఈ సమస్యలెదురైతే మాత్రం డాక్టర్‌ని సంప్రదించి ఐడ్రాప్స్‌ వాడాల్సి ఉంటుంది.

* కళ్లు, మానిటర్ పైభాగం ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానిటర్ మధ్య భాగానికి, కళ్లకు 15 నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. ఫలితంగా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

* కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్‌కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవడం మంచిది.

* దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.

* మానిటర్‌పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలుపుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు వేసేయాలి.

* అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మన కంటికి సరిపోయే రీతిలో సెట్‌ చేసుకొని పెట్టుకోవాలి.

* కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి వీలుగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. అయితే ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి.

* గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్‌వేర్‌లను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. ఫలితంగా కళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

* సాధ్యమైనంత వరకు ఫాంట్ సైజు పెంచుకోవాలి.

* ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే గాలి వల్ల కూడా కళ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.

* కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ఈ ఆహారం తీసుకోండి!
కంటి ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకమే. ఈ క్రమంలో బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే క్యారట్స్‌, చిలగడదుంప, ఆకుకూరలు; లైకోపీన్‌ ఎక్కువగా లభించే టొమాటో, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌-ఎ సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్