Updated : 25/12/2021 19:33 IST

అమ్మయ్యాక అలా స్లిమ్‌గా మారా.. ఆయనే నా ఫిట్‌నెస్‌ గురువు!

బరువు తగ్గే విషయంలో చాలామంది సెలబ్రిటీలను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం ఫిట్‌గా మారే క్రమంలో తల్లయ్యాక ముద్దుగుమ్మలు పాటించిన ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఏంటో తెలుసుకొని మరీ దాన్ని అనుసరిస్తుంటారు కొంతమంది మహిళలు. అయితే అది ఎంతమాత్రమూ కరక్ట్‌ కాదంటోంది బాలీవుడ్‌ అందం సాయేషా సైగల్‌. ప్రతి ఒక్కరి శరీరతత్వం భిన్నంగా ఉంటుందని, దాన్ని బట్టి ఎవరికి వారు చక్కటి ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుందంటోంది. ఇటీవలే తల్లైన ఈ చక్కనమ్మ.. తన ప్రసవానంతర బరువు తగ్గించుకొని.. తిరిగి రెండో ఇన్నింగ్స్‌ని కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే పిల్లలు పుట్టాక బరువు తగ్గే విషయంలో తల్లుల్లో స్ఫూర్తి నింపేలా తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది సాయేషా.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా తన సొంత ప్రతిభతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది సాయేషా. తన కంటే 17 ఏళ్లు పెద్దవాడైన నటుడు ఆర్యను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత తన భర్తతో వెకేషన్‌కి వెళ్లిన సందర్భాలు, ప్రత్యేక రోజుల్ని ఫొటోల రూపంలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన ప్రెగ్నెన్సీ ఫొటోలు గానీ, ఆ విషయం గురించి కానీ ఎప్పుడూ పంచుకోలేదు. ఈ ఏడాది జులైలో పాప పుట్టాకే ఒక్కసారిగా ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా పంచుకొని అభిమానులందరినీ ఆశ్చర్యపరిచిందీ బ్యూటీ. ప్రస్తుతం తన ముద్దుల కూతురికి అరియానా అని పేరు పెట్టుకున్నారు ఆర్య-సాయేషా.

మీ రొటీన్‌ మీదే.. ఎవరినీ ఫాలో అవ్వద్దు!

సహజంగానే సాయేషాకు ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. ఈ క్రమంలోనే వివిధ రకాల వ్యాయామాలు, డ్యాన్స్‌ చేస్తూ తన ఫిజిక్‌ని కాపాడుకుంటుంది. ఇక పాప పుట్టాక కూడా కొన్ని నెలలకే తిరిగి తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ని ప్రారంభించిందీ న్యూమామ్‌. ఈ క్రమంలోనే జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ప్రసవానంతర బరువు గురించి ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

‘ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత సులభం కాదు. అయితే ఎవరైతే బరువు తగ్గాలన్న పట్టుదలతో, అంకితభావంతో లక్ష్యం పైనే దృష్టి పెడతారో వాళ్ల విషయంలో తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. అంతేకానీ.. ఏదో తగ్గాలని పైపైన అనుకోవడం, ఇతరుల్ని అనుసరిస్తూ అవాస్తవ లక్ష్యాలు నిర్దేశించుకోవడం అస్సలు కరక్ట్‌ కాదు. ఎందుకంటే ప్రతి మహిళా ఎవరికి వారే ప్రత్యేకం. నాజూగ్గా ఉండాలనుకోవడం తప్పు కాదు.. ఎందుకంటే దీనివల్ల పొట్ట చుట్టూ అవయవాల్లో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకోవడమూ మంచి నిర్ణయమే. ప్రసవం తర్వాత ఈ రెండూ సాధ్యం కావాలంటే అందుకు కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఓపికతో ప్రయత్నించాలి. అంతేకానీ.. ఫలానా సెలబ్రిటీ అనుసరించింది కదా అని అదే రొటీన్‌ని మీ లక్ష్యంగా నిర్దేశించుకోవడం ఎంతమాత్రమూ కరక్ట్‌ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయండి.. చక్కటి పోషకాహారం తీసుకోండి.. నీళ్లు తాగడం మాత్రం మర్చిపోవద్దు.
ఇక నా విషయంలో ఫిట్‌నెసే నా జీవనశైలి.. అదే నన్ను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతుంది..’ అంటూ నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపుతోందీ అందాల అమ్మ.

నాకు డ్యాన్స్‌ ఇష్టం.. మరి మీకు?

ఫిట్‌నెస్‌నే తన జీవనశైలిగా మార్చుకున్న సాయేషా.. ఈ క్రమంలో తాను చేసే రోజువారీ వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ ఇన్‌స్టాలో పంచుకుంటుంటుంది. ‘ఫిట్‌నెస్‌కు నా జీవితంలో ప్రత్యేకమైన స్థానముంది. నా తొమ్మిదో ఏట నుంచే వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. సహజంగానైతే జిమ్‌లో వివిధ రకాల వర్కవుట్లు చేయడానికి ఇష్టపడతాను. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఆ అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌.. వంటివి చేశా. ఇక నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇందులో విభిన్న రకాల స్టైల్స్‌ ప్రయత్నిస్తుంటా. ఇవి నా నైపుణ్యాలను పెంచడంతో పాటు నా శరీరాన్నీ ఫిట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మారుస్తాయి. మరి, మీరు ఎలాంటి వ్యాయామాల్ని ఇష్టపడతారు?’ అని అడుగుతోందీ బాలీవుడ్‌ బేబ్‌.

ఛీట్‌ చేస్తా.. కరిగించుకుంటా..!

ఫిట్‌నెస్‌ విషయంలో వ్యాయామాలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో.. తీసుకునే ఆహారం విషయంలోనూ అంతే శ్రద్ధ వహిస్తానంటోంది సాయేషా. అలాగని తనకు ఇష్టమైనవి మాత్రం పక్కన పెట్టనని ఖరాకండిగా చెప్పేస్తుంది. ‘ఐస్‌క్రీమ్‌.. అందులో చాకోబార్‌ని ఇష్టపడని వారెవరైనా ఉంటారా చెప్పండి? అందుకే అప్పుడప్పుడూ దీన్ని ఛీట్‌ మీల్‌గా తీసుకుంటా.. ఇక దీని ద్వారా శరీరంలోకి చేరిన క్యాలరీలను ఆ తర్వాత వర్కవుట్స్‌, డ్యాన్స్‌తో ఎలాగూ కరిగించుకుంటాననుకోండి..!’ అంటూ తన ఛీట్‌ మీల్‌ గురించి మరో పోస్ట్‌లో భాగంగా పంచుకుందీ బాలీవుడ్‌ దివా.

అయితే సాయేషా భర్త ఆర్య కూడా ఫిట్‌నెస్‌ లవరే! అందుకే ‘ఫిట్‌నెస్‌ విషయంలో మా ఆయనే నాకు స్ఫూర్తి.. గురువు కూడా!’ అంటోందీ చక్కనమ్మ.


CEvuRsYjbjG

Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి