Celebrity Tips: పరగడుపున వీళ్లేం తాగుతారో తెలుసా?

మన అందాల తారలంతా సౌందర్యం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తారన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో వారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయాల్లో అత్యంత శ్రద్ధ వహిస్తారు. అయితే మనం పరగడుపునే తీసుకునే కొన్ని పానీయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని మన సొంతం.....

Published : 26 Apr 2022 16:37 IST

(Photos: Instagram)

మన అందాల తారలంతా సౌందర్యం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తారన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో వారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయాల్లో అత్యంత శ్రద్ధ వహిస్తారు. అయితే మనం పరగడుపునే తీసుకునే కొన్ని పానీయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని మన సొంతం చేస్తాయని స్వీయానుభవంతో చెబుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అంతేకాదు.. ఆ సీక్రెట్లేంటో పలు సందర్భాల్లో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు కూడా! మరి, ఆ రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సమంత ‘స్మూతీ’

రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ఓ స్మూతీని పరగడుపునే తాగడం తనకు అలవాటంటోంది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. కొబ్బరి నీళ్లు, అవిసె గింజలు, సబ్జా గింజలు, పాలకూర, కొత్తిమీర కాడలు, లెట్యూస్‌ (ఇదొక రకమైన ఆకుకూర), ఒమేగా మీల్‌ మిక్స్‌ (ఇది సూపర్‌ మార్కెట్లో దొరుకుతుంది).. వీటన్నింటినీ స్మూతీలా తయారుచేసుకొని తీసుకుంటుంది సామ్‌. అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడని ఈ చక్కనమ్మ.. వీటిని తన సొంతం చేసుకోవడానికి వివిధ రకాల వ్యాయామాలు కూడా చేస్తుంటుంది.

రష్మిక ‘వెనిగర్‌’ సీక్రెట్

అందం, ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోవాలి. ఇందుకోసం యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను మించింది లేదంటోంది ‘పుష్ప’ బ్యూటీ రష్మిక మందాన. గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కలుపుకొని పరగడుపునే తీసుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. ఇదే తన సౌందర్య, ఆరోగ్య రహస్యమంటూ పలుమార్లు చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ.

ఆలియా ‘డీటాక్స్‌’ డ్రింక్

ఇటీవలే తన పెళ్లిలో నో మేకప్‌ లుక్‌తో న్యాచురల్‌గా మెరిసిపోయింది ఆలియా భట్‌. మరి, ఇంత సొగసైన చర్మం వెనకున్న రహస్యమేంటని అడిగితే.. డీటాక్స్‌ డ్రింక్‌ అని చెబుతోందీ బాలీవుడ్‌ బేబ్‌. గ్లాసు గోరువెచ్చటి నీటిలో టీస్పూన్‌ తేనె, ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కలుపుకొని పరగడుపునే తాగితే ఆరోగ్యం, అందం విషయంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతోంది అల్లూ బేబీ.

సోనమ్‌ ‘ప్రెగ్నెన్సీ’ చిట్కా

త్వరలో అమ్మ కాబోతోన్న సోనమ్‌ కపూర్‌లో రోజురోజుకీ ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడుతోందని చెప్పచ్చు. అయితే ఇందుకు ఓ కారణం.. తాను పరగడుపునే తీసుకునే గోరువెచ్చటి నీళ్లు అని చెప్పచ్చు. గోరువెచ్చటి నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకొని ఉదయం తొలి ఆహారంగా తీసుకోవడం ఈ సొగసరికి ముందు నుంచే అలవాటు! సినీ రంగంలోకి అడుగుపెట్టే క్రమంలో తన అధిక బరువును తగ్గించుకోవడంలోనూ ఇది కీలక పాత్ర పోషించిందంటూ అప్పుడప్పుడూ చెబుతుంటుందీ కపూర్‌ బ్యూటీ.

కియారా ‘పసుపు’ రహస్యం

తన అందం, ఫిట్‌నెస్‌తో ఈతరం అమ్మాయిలకు బ్యూటీ పాఠాలు చెబుతుంటుంది మన వసుమతి అలియాస్‌ కియారా అడ్వాణీ. మరి, ఇంతకీ తన అందం, ఆరోగ్య రహస్యమేంటో తెలుసా? పసుపు నీళ్లట! గోరువెచ్చటి నీళ్లలో టీస్పూన్‌ పసుపు, అరటీస్పూన్‌ నిమ్మరసం వేసుకొని పరగడుపునే తాగందే ఏ పనీ మొదలుపెట్టనంటోందీ ముద్దుగుమ్మ. కావాలంటే ఈ మిశ్రమంలో టీస్పూన్‌ తేనె కూడా కలుపుకోవచ్చు.

శిల్ప ‘CCF’ డ్రింక్

యాభైకి చేరువవుతోన్నా.. వయసులో ఉన్న అమ్మాయిలా ఎంతో చలాకీగా ఉంటుంది శిల్పా శెట్టి. దీనికంతటికీ కారణం.. తాను రోజూ పరగడుపునే తీసుకునే CCF డ్రింక్‌ అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్.

‘వాము, జీలకర్ర, సోంపు.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని పొడి చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రోజూ టీస్పూన్‌ చొప్పున గ్లాసు నీళ్లలో కలుపుకొని, ఒక నిమ్మ చెక్క పిండుకొని తీసుకోవాలి.. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. తద్వారా ఎలాంటి అనారోగ్యాల నుంచైనా దూరంగా ఉండచ్చు..’ అంటూ తన రెసిపీని ఇన్‌స్టాలో పంచుకుందీ అందాల అమ్మ.

అనుష్క ‘ఆల్కలైన్‌’ వాటర్

అందం, ఆరోగ్యం కోసం మూడంచెల విధానాన్ని పాటిస్తున్నానంటోంది అందాల అనుష్కా శర్మ. తొలుత పసుపు నీళ్లు, ఆపై లెమనేడ్‌ తీసుకునే ఈ బ్యూటీ.. ఆల్కలైన్‌ వాటర్‌తో మరింత చురుగ్గా మారతానంటోంది. నిమ్మరసం, బేకింగ్‌ సోడా, నీళ్లు.. ఈ మూడింటినీ కలిపి తయారుచేసే ఈ పానీయం.. అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

దీపిక - ఎ ‘ఫ్రూట్‌’ లవర్

ఆరోగ్యానికైనా, అందానికైనా తాజా పండ్ల రసాలను మించిన పానీయాలు లేవంటోంది బాలీవుడ్‌ అందం దీపికా పదుకొణె. పరగడుపునే ఏదో ఒక పండ్ల రసం తీసుకొని రోజును ప్రారంభించడం ఈ చక్కనమ్మకు అలవాటట! మరీ ముఖ్యంగా.. ఆయా సీజన్లలో దొరికే పండ్లతో తయారుచేసిన జ్యూసులు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చంటోంది దీప్స్‌. అంతేకానీ.. పాలు, వాటితో తయారుచేసిన టీ, కాఫీలతో రోజు ప్రారంభించకపోవడమే మంచిదని చెబుతోందీ ముద్దుగుమ్మ.

మలైకా ‘బ్యూటీ’ సీక్రెట్

వయసుతో పాటు అందాన్ని, ఫిట్‌నెస్‌ను పెంచుకుంటూ పోతోంది అందాల తార మలైకా అరోరా. మరి, తన సౌందర్య రహస్యమేంటని అడిగితే.. కమలాఫలం జ్యూస్‌ అని చెబుతోందీ చక్కనమ్మ. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ ‘సి’ చర్మ ఆరోగ్యానికి, అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

సారా ‘ఫిట్‌నెస్‌’ మంత్ర

ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న సారా అలీ ఖాన్‌.. సినీ రంగంలో ప్రవేశించేటప్పటికే ఫిట్‌గా, నాజూగ్గా మారిపోయింది. అయితే దీనికి కారణమేంటో తెలుసా? తాను పరగడుపునే తీసుకునే పానీయం. గోరువెచ్చటి నీళ్లలో పసుపు, పాలకూర రసం కొద్ది మొత్తాల్లో వేసుకొని పరగడుపునే తీసుకోవడం సారాకు అలవాటు. దీంతో పాటు డీహైడ్రేషన్‌కి గురికాకుండా రోజంతా కొబ్బరి నీళ్లు తాగుతానంటోందీ పటౌడీ బ్యూటీ.

మరి, పరగడుపునే మీరు ఎలాంటి పానీయాలు తీసుకుంటారు? మీ ఆరోగ్య/సౌందర్య రహస్యాలేంటో Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్