అప్పుడు రెండు రోజులు నీళ్లు తాగలేదు.. చలికి గడ్డ కట్టుకుపోయాం!

షూటింగ్‌ అంటే సెట్లోనే కాదు.. కొన్నిసార్లు గడ్డకట్టుకుపోయే మంచులో, ఎడారిలోనూ జరుగుతుంటుంది. తమ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడానికి, సాహసాలు చేయడానికీ వెనకాడరు....

Published : 09 Jun 2023 12:29 IST

(Photos: Instagram)

షూటింగ్‌ అంటే సెట్లోనే కాదు.. కొన్నిసార్లు గడ్డకట్టుకుపోయే మంచులో, ఎడారిలోనూ జరుగుతుంటుంది. తమ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడానికి, సాహసాలు చేయడానికీ వెనకాడరు మన అందాల నాయికలు. ‘కేరళ స్టోరీస్‌’తో ఇటీవలే మన ముందుకొచ్చిన టాలీవుడ్‌ బ్యూటీ అదా శర్మ కూడా ఇదే చేశానంటోంది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో, రోజుల తరబడి నీళ్లు తాగకుండా మరీ నటించానంటూ తన షూటింగ్‌ అనుభవాల్ని తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో గుదిగుచ్చిందామె. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో నటించి మెప్పించారు. మరి, వాళ్ల షూటింగ్‌ అనుభవాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..!

రెండు రోజులు నీళ్లు తాగలేదు! - అదా శర్మ

ఓ నటిగా ఎలాంటి పాత్రకైనా, సన్నివేశానికైనా న్యాయం చేసేందుకు ముందు నుంచే శారీరకంగా, మానసికంగా సిద్ధపడతా. అలాంటప్పుడే నటిగా గుర్తింపొస్తుంది.. మనసుకు సంతృప్తీ దక్కుతుంది. ‘కేరళ స్టోరీస్‌’లో నా పాత్ర కూడా నాకు అలాంటి గుర్తింపే తెచ్చిపెట్టింది. అందులో.. అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరం నుంచి పారిపోయే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆపై కొన్ని సీన్లను -16 డిగ్రీల మంచులో చిత్రీకరించారు. అక్కడ ఆక్సిజన్‌ కూడా చాలా తక్కువ. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు 40 గంటల పాటు నీళ్లు తాగకుండా ఉండిపోయా. దాంతో నా శరీరం తేమను కోల్పోయి పెదాలు బాగా పొడిబారిపోయాయి. ఉగ్రవాద శిబిరం నుంచి పారిపోయి వచ్చిన సన్నివేశానికి ఇది సరిగ్గా సరిపోయింది. నిజానికి నేనో పెద్ద ఫుడీని. ఆహారం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేను. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగడం నాకు అలవాటు! అలాంటిది సుమారు రెండు రోజులు నీళ్లు తాగకుండా ఉన్నానంటే.. ఆ సీన్‌కు ఎలా కనెక్ట్‌ అయ్యానో మీరే అర్థం చేసుకోవచ్చు. మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే!


11 గంటలు నీటిలోనే..! - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

నేను ఎంచుకునే ప్రతి చిత్రం, చేసే ప్రతి పాత్ర నాకు ప్రత్యేకమే! అయితే ఈ ఏడాది విడుదలైన ‘ఛత్రీవాలీ’ నా కెరీర్‌లో మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే సామాజిక సందేశాన్ని చాటే సినిమా ఇది. విద్యార్థులకు లైంగిక విద్యపై పాఠాలు బోధించే టీచర్‌ పాత్రలో నటించాను. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల్ని నీటి అడుగున చిత్రీకరించారు. ఇందుకోసం దాదాపు 11 గంటల పాటు నీటి అడుగునే ఉండాల్సి వచ్చింది. అలా ఓ రోజంతా నీటిలోనే షూట్‌ చేశారు. ఇది చాలా కష్టంగా అనిపించింది. చలికి వణుకొచ్చేది.. కానీ ఇలాంటి సాహసం చేయడం సంతోషాన్నిచ్చింది. ఇక షూట్‌ పూర్తయ్యాక లేయర్ల కొద్దీ టవల్స్‌ చుట్టుకొని.. కాఢా పానీయం తాగుతూ నా శరీరాన్ని వెచ్చబర్చుకున్నా.. ఏదేమైనా ఇదో కొత్త అనుభవం!


వింటర్‌లో సమ్మర్‌.. సమ్మర్‌లో వింటర్‌! - కృతీ సనన్‌

పాత్ర డిమాండ్‌ చేస్తే.. దానికి అనుగుణంగానే మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే సమయంలో రెండు సినిమాలు చేయాల్సి వచ్చినప్పుడు మరింత సవాలుగా అనిపిస్తుంటుంది. ‘రాబ్తా’, ‘బరేలీ కీ బర్ఫీ’ చిత్ర షూటింగ్స్‌లో నా పరిస్థితీ ఇదే! ‘రాబ్తా’ షూటింగ్‌ బుడాపెస్ట్‌లో జరిగింది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందులో నా పాత్రను బట్టి సమ్మర్‌ వేర్ వేసుకోవాల్సి వచ్చింది. దాంతో చలికి తట్టుకోలేకపోయా. దాదాపు రెండున్నర నెలలు ఇలాంటి వాతావరణంలోనే గడిపా. ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తైన వెంటనే ‘బరేలీ కీ బర్ఫీ’ సినిమా కోసం లక్నో చేరుకున్నా. ఇక్కడ వాతావరణం మరీ వేడి. ఇలాంటి పరిస్థితుల్లో లేయర్ల కొద్దీ దుస్తులు (వింటర్‌ వేర్) ధరించమని నా పాత్ర డిమాండ్‌ చేసింది. దీనికి తోడు రెండు ప్రాంతాల సంస్కృతుల్ని అర్థం చేసుకొని, నడచుకోవడం మరో అనుభవం. మొత్తానికి కష్టంగానే అనిపించినా.. ఇష్టంగా షూటింగ్స్‌ పూర్తి చేశా. అందుకే బోలెడన్ని సరదాల్ని, మధుర జ్ఞాపకాల్నీ సొంతం చేసుకున్నా.


మైనస్‌ డిగ్రీల్లో ఆ సాహసం! - పరిణీతి చోప్రా

నా పదేళ్ల సినీ ప్రయాణంలో ప్రతి సినిమా, ప్రతి పాత్ర కొత్తగా, ప్రత్యేకంగా ఉన్నదే ఎంచుకున్నా. కెరీర్‌ ప్రారంభం నుంచే యాక్షన్‌ చిత్రంలో నటించాలని, తద్వారా యాక్షన్‌ హీరోయిన్‌ అని పిలిపించుకోవాలని నా కోరిక. ఇది ‘కోడ్‌ నేమ్‌ తిరంగా’తో నెరవేరింది. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో నటించాను. ఈ క్రమంలో కొన్ని సీన్లు టర్కీలో చిత్రీకరించారు. అప్పుడు బోట్‌లో షూటింగ్‌ జరుగుతోంది.. ఆ సమయంలో అక్కడి ఉష్ణోగ్రత -11 డిగ్రీలుంది. చిత్ర బృందమంతా లేయర్ల కొద్దీ దుస్తులు ధరించారు. నేనేమో షార్ట్‌ స్లీవ్స్‌ ఉన్న బ్లాక్‌ కలర్‌ టీ-షర్ట్‌ వేసుకోవాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు అక్కడ చలికి తట్టుకోవాలంటే పదుల సంఖ్యలో రగ్గులు కప్పుకున్నా సరిపోదు. అలాంటిది.. సాధారణ దుస్తులతోనే షూటింగ్‌ పూర్తిచేశా. ఇలా మైనస్‌ డిగ్రీల్లో నేను చేసిన ఆ సాహసం నా కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది..!


గడ్డకట్టుకుపోయాం! - అలయా ఎఫ్‌

రోజురోజుకీ మారే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ సన్నివేశాల్ని పండించాలంటే సవాలే! ‘ఆల్‌మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌’ సినిమా నాకు అలాంటి సవాలునే విసిరింది. ఈ సినిమా తాలూకు కొన్ని సన్నివేశాల్ని గుల్‌మార్గ్‌లో చిత్రీకరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి. ఓ రోజు గడ్డకట్టుకుపోయే చలి నమోదైతే.. మరో రోజు ఎండ కాస్తుంది.. ఆ మరుసటి రోజు వర్షం.. ఇలాంటి వాతావరణం ఉన్నా షూటింగ్‌ ఆపలేదు. సాహసోపేతమైన ఈ ప్రయత్నం ఎన్నో మధురానుభూతుల్ని పంచింది.. ఈ జ్ఞాపకాలు నా సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.


అప్పుడు నా పెదాలు రంగు మారాయి! - మాధురీ దీక్షిత్‌

పాటల షూటింగ్‌ అంటే హావభావాలే కాదు.. పాట పాడుతున్నట్లుగా పెదాల్నీ కదిలించాల్సి ఉంటుంది. అయితే ‘పుకార్‌’ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఇలా లిప్‌ సింక్‌ చేయడానికి చాలా కష్టపడ్డా. దీనికి కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులే! ఆ సినిమాలోని ‘కిస్మత్‌ సే తుమ్‌ హమ్‌ కో మిలే’ పాటను అలస్కాలోని మంచు పర్వతాలపై చిత్రీకరించారు. అందులో నేను తేలికపాటి షిఫాన్‌ చీర ధరించాను. దాంతో చలి తీవ్రత నన్ను బిగుసుకుపోయేలా చేసింది. ఎలాగోలా స్టెప్పులేశాను కానీ పాటకు తగ్గట్లుగా పెదాలు కదిలించలేకపోయా. పైగా ఆ చలి తీవ్రతకు నా పెదాలు నీలం రంగులో మారడంతో చిత్రబృందం ఆ రోజుకు ప్యాకప్‌ చెప్పేసి.. షూటింగ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ఇక ఆ రోజు షూటింగ్‌ పూర్తయ్యాక చలి నుంచి ఉపశమనం పొందడానికి ఓ హీటర్‌, రగ్గు.. వంటివి వెంటే ఉంచుకున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్