పెళ్లికి ముందే.. ఆ శుభవార్త చెప్పేశారు!
పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. కానీ క్రమంగా పాశ్చాత్య పోకడల ప్రభావం మన సంస్కృతీ సంప్రదాయాల పైనా పడుతోంది. దాంతో పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. అయితే ఆ విషయాన్ని సోషల్ మీడియా....
(Photos: Instagram)
పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. కానీ క్రమంగా పాశ్చాత్య పోకడల ప్రభావం మన సంస్కృతీ సంప్రదాయాల పైనా పడుతోంది. దాంతో పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. అయితే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొందరు తారలు. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా అదే చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ప్రకటించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిందీ ముద్దుగుమ్మ. అయితే ఇల్లూ బేబీనే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లోకెక్కారు. వాళ్లెవరో తెలుసుకుందాం రండి..
ఇలియానా
తన అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది బెల్లీ బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామమిచ్చినా.. సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటోందీ చిన్నది. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాల్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోన్న ఇలియానా.. తాజాగా ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. ‘త్వరలోనే రాబోతోంది.. నా చిన్నారిని చేతుల్లోకి తీసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ ఓ బేబీ డ్రస్, ‘Mama’ లాకెట్ ఫొటోల్ని పోస్ట్ చేస్తూ తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించిందీ గోవా బ్యూటీ. అయితే ఇలా పెళ్లి కాకుండానే తాను తల్లిని కాబోతున్నానని ఇలియానా సడెన్‌గా ప్రకటించేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే తన భాగస్వామి గురించి మాత్రం బయటపెట్టలేదీ బాలీవుడ్ అందం.
గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తమ రిలేషన్‌షిప్ గురించి ఏనాడూ బయటపెట్టలేదు. ఒకానొక సందర్భంలో ‘బెస్ట్ హబ్బీ’ అంటూ నీబోన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టిన ఇలియానా.. 2019లో అతనితో అనుబంధం తెంచుకుంది. ‘నేనేమీ బాధపడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుటుంబం, స్నేహితుల విలువ తెలుస్తుంది. ప్రతికూల సమయంలో నాకూ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారు..’ అంటూ ఈ విషయాన్నీ పరోక్షంగానే ప్రకటించిందీ బాలీవుడ్ బ్యూటీ. అయితే కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్‌తో ఇలియానా ప్రస్తుతం ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఫ్రిదా పింటో
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ అందాల తార ఫ్రిదా పింటో కూడా పెళ్లికి ముందే తాను తల్లిని కాబోతున్నానన్న శుభవార్త చెప్పింది. 2019లోనే తన ప్రియుడు, అమెరికన్ ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే అంతకంటే కొన్ని నెలల ముందే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది ఫ్రిదా. 2021లో రుమీ రే అనే పాపకు జన్మనిచ్చిన ఈ బాలీవుడ్ బేబ్.. ఆపై తన ప్రసవానంతర అనుభవాల్ని ఓ సందర్భంలో పంచుకుంది.
కల్కి కొచ్లిన్
బాలీవుడ్ తెరపై విభిన్న పాత్రల్లో మెరిసింది అందాల తార కల్కి కొచ్లిన్. తన జీవితంలో జరిగే ఏ విషయాన్నైనా సూటిగా, నిర్భయంగా చెప్పే ఈ బోల్డ్ బ్యూటీ.. తన ప్రేమ విషయాన్ని, ఆపై తాను పెళ్లికి ముందే తల్లిని కాబోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయెల్‌కు చెందిన పియానిస్ట్ గై హెర్ష్‌బెర్గ్‌తో కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ భామ.. 2019లో తాను తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే పెళ్లికి ముందే పిల్లలంటే తన కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది కల్కి.
‘నా ప్రెగ్నెన్సీ గురించి ముందు హెర్ష్‌తో చెప్పా.. చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఇద్దరం ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులతో పంచుకున్నాం. వాళ్లూ సానుకూలంగానే స్పందించారు. పెళ్లయ్యాకే పిల్లల్ని కనాలన్న నియమాలేవీ పెట్టలేదు. అయితే మా అమ్మ మాత్రం ఓ మాట చెప్పింది.. ‘మరోసారి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే ముందు మాత్రం పెళ్లి చేసుకో..’ అని! నాకిది వరకే విడాకులయ్యాయి.. కాబట్టి నా పెళ్లి విషయంలో వాళ్లు నాపై ఒత్తిడి పెట్టరు.. వాళ్లూ తొందరపడరు..’ అందీ ముద్దుగుమ్మ.
2020లో ‘వాటర్ బర్త్’ పద్ధతిలో సాఫో అనే పాపకు జన్మనిచ్చిన కల్కి.. గర్భిణిగా, అమ్మగా తనకు ఎదురైన అనుభవాలను రంగరించి ‘The Elephant in the Womb’ అనే పుస్తకం కూడా రాసింది.
గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్
బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్.. దక్షిణాఫ్రికాకు చెందిన మోడల్, నటి గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ల ప్రేమకు గుర్తుగా 2019 జులైలో అరిక్ అనే కొడుకు పుట్టాడు. అయితే గ్యాబ్రియెల్లా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇప్పటికీ ప్రేమ పక్షులుగానే కొనసాగుతోన్న ఈ జంట.. అప్పుడే తమ పెళ్లికి తొందరేముంది? అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘పెళ్లికి ముందే పిల్లల్ని కనడంతో చాలామంది మా నిర్ణయాన్ని తప్పుపట్టారు. కానీ మాకు ఇదేమీ తప్పుగా అనిపించట్లేదు. ఎందుకంటే మా మనసులు కలిసిన రోజే మా ఇద్దరికీ పెళ్లైపోయింది. అలాంటప్పుడు నిజమైన పెళ్లితో పనేముంది?’ అంటూ ఎప్పటికీ తమ ప్రేమ శాశ్వతమంటూ ఓ సందర్భంలో పంచుకుందీ జంట.
అయితే అర్జున్ 1998లోనే మోడల్ మెహర్ జెస్సియాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు మహిక, మైరా.. అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వివిధ కారణాల రీత్యా కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకుందీ జంట. అయినా ఇప్పటికీ ప్రతి సందర్భాన్నీ తన ఇద్దరు కూతుళ్లతో సెలబ్రేట్ చేసుకుంటాడీ కండల వీరుడు.
దియా మీర్జా
నేచర్ లవర్ దియా మీర్జా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. 2021 ఫిబ్రవరిలో ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ రేఖితో ఏడడుగులు వేసిన ఈ చక్కనమ్మ.. ఆపై రెండు నెలలకే తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టింది. దాంతో పెళ్లికి ముందే గర్భం దాల్చడంతోనే హడావిడిగా వివాహం చేసుకుందంటూ అప్పట్లో దియాపై విమర్శలొచ్చాయి. అయితే అసలు కారణం అది కాదంటూ ఓ సందర్భంలో పంచుకుందీ బాలీవుడ్ మామ్.
‘గర్భం ధరించానన్న హడావిడితో మేము పెళ్లి చేసుకోలేదు. మా పెళ్లి కోసం ప్లాన్ చేసుకునే సమయంలోనే మాకీ విషయం తెలిసింది. కాబట్టి నా ప్రెగ్నెన్సీకి, మా పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి మా జీవితాల్లో ఇది ఆనందకరమైన సమయం. ఈ శుభ ఘడియ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. మహిళలుగా మనం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ ఈ సమాజం తప్పు పడుతుంటుంది. కానీ ఏది మంచి, ఏది చెడు అన్నది మన ఆత్మసాక్షికి తెలిస్తే చాలు..’ అంది దియా.
వీరితో పాటు బాలీవుడ్ అందాల తార కొంకణా సేన్ శర్మ; బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్; క్రికెటర్ హార్దిక్ పాండ్యా సతీమణి-సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్; బాలీవుడ్ నటి నేహా ధూపియా; అలనాటి నటీమణులు నీనా గుప్తా, శ్రీదేవి, సారిక.. తదితరులు సైతం పెళ్లికి ముందే గర్భం ధరించి మాతృత్వపు బాధ్యతలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.