అందుకే ‘గుర్రపు స్వారీ’ లోనూ ఆరితేరుతున్నారు!

సినిమాలోని పాత్రల్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవడం మన ముద్దుగుమ్మలకు అలవాటే! పాత్ర డిమాండ్‌ చేస్తే కత్తిసాము, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ.. వంటి సాహసకృత్యాల్లో నైపుణ్యం సంపాదించడానికీ వెనకాడట్లేదు కొందరు తారలు. ఇలా మన ఎంపికలకు ప్రాధాన్యమివ్వడంతో పాటు అందులో....

Published : 23 Sep 2022 13:19 IST

(Photos: Instagram)

సినిమాలోని పాత్రల్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవడం మన ముద్దుగుమ్మలకు అలవాటే! పాత్ర డిమాండ్‌ చేస్తే కత్తిసాము, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ.. వంటి సాహసకృత్యాల్లో నైపుణ్యం సంపాదించడానికీ వెనకాడట్లేదు కొందరు తారలు. ఇలా మన ఎంపికలకు ప్రాధాన్యమివ్వడంతో పాటు అందులో నిష్ణాతులు కావాలన్న తపన ఉంటే మన విజయాన్ని ఏదీ అడ్డుకోలేదంటోంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. నాలుగు నెలల క్రితం బాబుకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. తాజాగా తన రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ‘భారతీయుడు-2’ సినిమా కోసం ప్రస్తుతం తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది.

ప్రసవానంతరం ఇది కాస్త కష్టంగానే ఉన్నా.. వృత్తిపై తనకున్న మక్కువతో ఈ ఫీలింగ్‌ని అధిగమిస్తున్నానంటూ ఈ అందాల చందమామ తాజాగా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. ఇలా తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు ఆయా సినిమాల్లో తమ పాత్రల కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. మరి, వాళ్లెవరు? ఈ కొత్త సవారీలో వాళ్లకెదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..


కాజల్‌ అగర్వాల్‌

నాలుగు నెలల క్రితం బాబు నీల్‌కు జన్మనిచ్చింది కాజల్‌. ప్రెగ్నెన్సీ చివర్లో, ప్రసవానంతరం కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ చక్కనమ్మ.. తాజాగా తన రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తోన్న కాజల్‌.. అందుకోసం గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటోంది. అయితే ప్రసవానంతరం తన శరీరం మునుపటిలా లేదని, అయినా వృత్తిలో ఉత్సాహమే ఈ ప్రతికూలతలన్నీ అధిగమించే శక్తిని తనకిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల చందమామ.

‘ప్రసవానంతరం నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి వృత్తిలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. అయితే ఇప్పుడు ఏ చిన్న కసరత్తు చేసినా కొత్తగా మొదలుపెట్టానన్న ఫీలింగ్‌ కలుగుతోంది. నా శరీరం మునుపటిలా లేదు. అదే గర్భధారణకు ముందు- రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా.. వ్యాయామం చేయడానికి, జిమ్‌కి వెళ్లడానికి నా శరీరం చురుగ్గా ఉండేది. మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ఎంతో అలవోకగా చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా పూర్వపు శక్తిస్థాయుల్ని తిరిగి పొందడానికి కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వస్తోంది. గుర్రపు స్వారీ కూడా కష్టమైన పనిలా అనిపిస్తోంది. ఏదేమైనా ఒక దశలో మన శరీరంలో మార్పులు సహజం. వాటిని అంగీకరించి.. తపన, పట్టుదలతో ముందుకు సాగితే మనం లక్ష్యాన్ని చేరుకోకుండా ఏదీ మనల్ని అడ్డుకోలేదు. మన ప్రాధాన్యతలపై దృష్టి పెట్టి.. నిరంతరం పరిశ్రమ చేయడమే అందుకు కావాల్సింది!’ అంటోంది కాజల్‌. ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకోవడంలో నిమగ్నమైన ఈ చక్కనమ్మ.. ఇలా మనం నేర్చుకునే కొత్త కొత్త నైపుణ్యాలనే జీవితంలో అభిరుచులుగా మలచుకోవచ్చంటోంది.


వాణీ కపూర్‌

ఏ నైపుణ్యం నేర్చుకోవాలన్నా.. ముందుగా మనం దాని గురించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుంటుంటాం. గుర్రపు స్వారీకీ ఇది వర్తిస్తుందంటోంది బాలీవుడ్‌ అందాల తార వాణీ కపూర్‌. విభిన్న కథల్ని ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే విడుదలైన ‘షంషేరా’ చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంది.

‘కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు దాని గురించి కొంత ప్రాథమిక సమాచారం సేకరిస్తాం.. అలాగే గుర్రపు స్వారీ నేర్చుకునేటప్పుడు కూడా ముందుగా గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం ముఖ్యం. లేదంటే దాని వేగానికి మనం తట్టుకోలేం. అందుకే నేను ఈ విద్య నేర్చుకునే క్రమంలో రోజూ నా గుర్రం కోసం బిస్కట్‌ ప్యాకెట్లు తీసుకొచ్చేదాన్ని. దానికి తినిపించేదాన్ని. నా ట్రైనర్‌ సహకారంతో ముందుగా గుర్రంతో స్నేహం ఏర్పరచుకున్నా. ఆ తర్వాతే ట్రైనింగ్‌ మొదలుపెట్టా. దీనివల్ల గుర్రపు స్వారీ అంటే భయం పోవడంతో పాటు.. త్వరగా ఈ విద్య నేర్చుకోగలిగా.. మూగజీవాల్ని మనం ప్రేమిస్తే.. అవి తిరిగి ఆ ప్రేమను మనకు అందిస్తాయి.. వాటికి తెలిసిన భాష ప్రేమ ఒక్కటే!’ అంటూ తన అనుభవాలను ఓ సందర్భంలో గుదిగుచ్చింది వాణి.


త్రిష

తపనతో ఒక పని చేస్తున్నప్పుడు అందులో ఎదురయ్యే సవాళ్లను కూడా సులభంగా అధిగమించగలుగుతాం అంటోంది తెలుగందం త్రిష. వైవిధ్యమైన సినిమాల్లో నటించి తెలుగువారిని మెప్పించిన ఈ అందాల తార.. ప్రస్తుతం మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రాణి కుందవిగా నటిస్తోన్న ఆమె.. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుందీ బ్యూటీ. ‘ఈ సినిమాలో నా పాత్రలో ఎక్కువగా గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలే ఉంటాయి. అందుకే షూటింగ్‌ మొదలు కాకముందే ఈ నైపుణ్యాలు ఒంటబట్టించుకున్నా. అయితే ఈ క్రమంలో రోప్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల చేతి వేలికి గాయమైంది. అయినా ఇష్టంతో నేర్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ పెద్దగా కష్టమనిపించవు..’ అంటూ తన గుర్రాన్ని అభిమానులకు పరిచయం చేసింది త్రిష.


రిచా చద్దా

సవాలుతో కూడిన పాత్రలు ఎంచుకోవడం, కొత్త నైపుణ్యాల్ని నేర్చుకునే విషయాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రిచా చద్దా. సినిమాల్లోని ఆమె పాత్రలే ఈ విషయం చెప్పకనే చెబుతాయి. ప్రస్తుతం ‘ఫక్రీ-3’లో నటిస్తోన్న ఆమె.. ఇటీవలే ఓ హాలీవుడ్‌ చిత్రానికీ సంతకం చేసింది. ఇందులో భారత సంతతికి చెందిన రాంచ్‌ (పశువుల పెంపకం కోసం కేటాయించే ప్రదేశం)  యజమాని పాత్రలో నటించనున్న ఆమె.. ఇందుకోసం ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది.


కృతీ సనన్‌

కొత్త కొత్త విషయాలు, నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం, అదృష్టం తనకు సినిమాల్లోకొచ్చాకే వచ్చాయంటోంది అందాల కృతీ సనన్‌. గతంలో ‘రాబ్తా’ చిత్రం కోసం ఈత, గుర్రపు స్వారీ నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం సంపాదించుకుంది. అయితే ‘పానిపట్‌’ సినిమా కోసం మరోసారి తన రైడింగ్‌ నైపుణ్యాలకు పదును పెట్టింది కృతి.  ‘గుర్రపు స్వారీ నేర్చుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. సినిమా పాత్ర కోసం నాకు ఈ అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఒక నటిగా కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కన్నా కావాల్సిందేముంటుంది! మళ్లీ పానిపట్‌ కోసం నా బ్యూటీ (గుర్రం)తో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది..’ అందీ అందాల తార.

వీళ్లే కాదు.. గతంలో కంగనా రనౌత్‌ (మణికర్ణిక), సన్నీ లియోని (వీరమాదేవి), సయామీ ఖేర్‌ (మీర్జ్యా), విద్యాబాలన్‌ (రాజ్‌కహిని).. వంటి ముద్దుగుమ్మలు కూడా ఆయా చిత్రాల్లో తమ పాత్రల కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.

ఇక టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌కు గుర్రపు స్వారీ అంటే ఎంతో మక్కువ. ఈ ఇష్టంతోనే తాను ఈ నైపుణ్యాలు ఒంటబట్టించుకున్నానని ఓ సందర్భంలో పంచుకుందీ చక్కనమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్