ధైర్యంగా వాటి గురించి పెదవి విప్పారు!

సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్‌ అండ్‌ గ్లో బ్యూటీ యామీ గౌతమ్‌.

Published : 06 Oct 2021 16:13 IST

సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్‌ అండ్‌ గ్లో బ్యూటీ యామీ గౌతమ్‌. ఈ నిజాన్ని ఇటీవలే గ్రహించానని, అందుకే తనకున్న తీవ్ర చర్మ సమస్య గురించి బయటపెట్టే ధైర్యం చేశానంటోంది. అయినా తాను ఎంతో అందంగా ఉన్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ తన చర్మ సమస్య గురించి ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది యామీ. ఇలా ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పలువురు స్పందిస్తూ ఆమె ధైర్యాన్ని, నిజాయతీని ప్రశంసిస్తున్నారు. యామీ ఒక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు తమకున్న తీవ్ర అనారోగ్యాలు/చర్మ సమస్యల గురించి ధైర్యంగా పెదవి విప్పారు.

టీనేజ్‌ నుంచే ఆ సమస్య ఉంది!

మనలో ఏదైనా అనారోగ్యం ఉంటే అభద్రతా భావానికి గురవుతుంటాం.. బయటికి చెప్పుకోవడానికి భయపడుతుంటాం. అయితే ఇన్నాళ్లూ తానూ ఇదే భావనలో ఉన్నానంటోంది యామీ. అయితే ఇప్పుడు మాత్రం వాటిని జయించి తనలో ఉన్న సమస్య గురించి బయటపెట్టానంటూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది.

‘ఓ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా తీయించుకున్న ఫొటోషూట్‌ ఇది. ఈ ఫొటోల్ని మీరు సునిశితంగా పరిశీలిస్తే నా ముఖంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు గమనించచ్చు. నాకున్న సుదీర్ఘ చర్మ సమస్యే వాటికి కారణం. అవును.. నేను టీనేజ్‌ వయసు నుంచే కెరటోసిస్‌ పిలారిస్‌ అనే చర్మ సమస్యతో బాధపడుతున్నా. ఇప్పటికీ ఇది నయం కాలేదు. ఇన్నాళ్లూ నాలో ఉన్న భయం, అభద్రతా భావం దీని గురించి బయటపెట్టకుండా నాకు అడ్డుపడ్డాయి. కానీ ఎట్టకేలకు వీటిని జయించి.. ఎలా ఉన్నా నన్ను నేను అంగీకరించాలన్న విషయాన్ని గ్రహించా. అందుకే ఇలా మీ ముందుకొచ్చా. అయినా నేను అందంగానే ఉన్నా..’ అంటూ ఎలా ఉన్నా/ఎలాంటి అనారోగ్యం-చర్మ సమస్యలున్నా మనల్ని మనం అంగీకరించాలి, ప్రేమించాలన్న విషయాన్ని మరోసారి అందరికీ గుర్తు చేసింది యామీ. ఇలా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్టుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలూ స్పందిస్తూ ‘నువ్వు, నీ మనసు ఎంతో అందమైనవి.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌!’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

మొన్నామధ్య టాలీవుడ్‌ బ్యూటీ నివేతా థామస్‌ కూడా తనకూ చేతులపై ఈ చర్మ సమస్య ఉందంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీనికి స్పందించిన మరో బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా తనకున్న ఈ చర్మ సమస్య గురించి కామెంట్‌ రూపంలో బయటపెట్టింది.


అదే నన్ను సినిమాలకు దూరం చేసింది!

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది అందాల తార స్నేహా ఉల్లాల్. అయితే అప్పట్లో ఉన్నట్లుండి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. దీనికంతటికీ కారణం అవకాశాలు రాక కాదు.. తనకున్న సుదీర్ఘ అనారోగ్యం కారణంగానే అంటూ ఓ సందర్భంలో ధైర్యంగా పంచుకుంది స్నేహ.

‘ఇన్నాళ్లూ ఏమైపోయారని చాలామంది అభిమానులు నన్ను అడిగేవారు. అయితే దీనికంతటికీ కారణం నాకున్న Auto Immune Disorder వల్లనే! రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది నా రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. తద్వారా నేను చాలా నీరసించి పోయాను. అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్ని. అలాంటిది షూటింగ్స్‌కి హాజరవడం, డ్యాన్స్‌ చేయడం.. వంటివన్నీ కష్టంగా మారాయి. అందుకే కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. శారీరకంగా బలంగా లేకపోయినప్పటికీ మానసిక దృఢత్వాన్ని మాత్రం కోల్పోలేదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడం, శారీరక సత్తువ కోసం వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకున్నా. చక్కటి పోషకాహారం.. ముఖ్యంగా గ్లూటెన్‌ ఫ్రీ ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకున్నా. చక్కెర, పాల పదార్థాలను పూర్తిగా దూరం పెట్టా. యోగాపై దృష్టి సారించా. జాగింగ్‌, స్విమ్మింగ్‌, జిమ్‌ వ్యాయామాలు నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అలాగని దీన్నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పలేను. ఎందుకంటే ఇదీ మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్యం. అదుపు చేసుకోవడమే తప్ప శాశ్వత పరిష్కారం లేదు. ప్రస్తుతమైతే నా సమస్య అదుపులోనే ఉంది..’ అందీ టాలీవుడ్‌ బ్యూటీ.


అతి అనర్థదాయకమే!

తెరపై అందంగా కనిపించడానికి ముద్దుగుమ్మలంతా చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామాలు చేయడం మనకు తెలిసిందే! అయితే ‘అతి అనర్థదాయకమే!’ అన్నట్లు అవి మితిమీరినా సమస్యలు తప్పవంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇలాంటి మితిమీరిన లైఫ్‌స్టైలే తనకు పలు అనారోగ్యాల్ని తెచ్చి పెట్టిందని ఓ సందర్భంలో పంచుకుందీ టాలీవుడ్‌ అందం.

‘నాకు ముందు నుంచీ ఆరోగ్య స్పృహ ఎక్కువ. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు పాటిస్తుంటా. వ్యాయామాలూ చేస్తుంటా. అయితే అవి మితిమీరడం వల్ల నాపై తీవ్ర ఒత్తిడి పడింది. ఫలితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించాయి. అయినా నేను వాటికి తలొగ్గలేదు. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఆహారాన్నే ఔషధంగా మార్చుకున్నా. ముఖ్యంగా ద్రవాహారానికి ప్రాధాన్యమిచ్చా. ఈ క్రమంలో నోని/తొగరు పండు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకున్నా. దీంతో పాటు ఉసిరి రసం, కీరా జ్యూస్‌, బాదం పాలు, కొబ్బరి నీళ్లు.. వంటివి నా మెనూలో చేర్చుకున్నా. అలాగే కొన్ని రకాల వ్యాయమాల్నీ సాధన చేశా..’ అంటోంది తమ్మూ. ఆహారమైనా, వ్యాయామమైనా మోతాదులో ఉన్నంత వరకే సానుకూల ఫలితాలనిస్తుందని తన స్వీయానుభవంతో అందరిలో స్ఫూర్తి నింపిందీ అందాల తార. అంతేకాదు.. ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయడానికి బామ్మల కాలం నాటి చిట్కాల్ని క్రోడీకరించి ‘బ్యాక్‌ టు ది రూట్స్‌’ పేరుతో ఇటీవలే ఓ పుస్తకం రాసిందీ ముద్దుగుమ్మ.


ఇది నా పీసీఓఎస్‌ స్టోరీ!

పీసీఓఎస్‌.. ప్రతి పది మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి దీని గురించి బయటపెట్టడానికి, కనీసం వైద్యులను సంప్రదించడానికి సైతం చాలామంది వెనకాడుతుంటారు. కానీ తాను మాత్రం ధైర్యంగా, నిర్మొహమాటంగా తన పీసీఓఎస్‌ స్టోరీని అందరితో పంచుకుంది బాలీవుడ్‌ సొగసరి సోనమ్‌ కపూర్‌. అంతేకాదు.. దాన్ని అదుపు చేసుకోవడానికి తాను పాటించిన జీవనశైలి గురించి కూడా ఇలా చెప్పుకొచ్చింది.

‘టీనేజ్‌లో ఉన్నప్పుడే నేను పీసీఓఎస్‌ బారిన పడ్డాను. ప్రస్తుతం చాలామంది మహిళల్ని వేధిస్తోన్న సమస్య ఇది. అయితే దీని లక్షణాలు, కారణాలు అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఈ క్రమంలో చాక్లెట్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, ఐస్‌క్రీమ్స్‌, స్వీట్స్‌ విపరీతంగా తినేదాన్ని. ఫలితంగా ఎక్కువగా బరువు పెరిగిపోయా. అప్పుడు అమ్మే నా ఈ అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లకు కళ్లెం వేసింది. అయితే చక్కటి పోషకాహారం, వ్యాయామాలు, నిపుణుల సలహాలే నేను ఈ సమస్యను అదుపు చేసుకోవడంలో సహకరించాయి..’ అంటోంది సోనమ్.

ఇదే కాదు.. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన ఆహారపుటలవాట్ల కారణంగా టైప్‌-1 మధుమేహం బారిన పడిందట ఈ కపూర్‌ బ్యూటీ. ఇందుకోసం రోజూ ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకునేదట!


అంగీకరించినప్పుడే ఆనందం!

‘ఈ సృష్టిలో ఎవరూ సంపూర్ణం కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది.. నిజానికి అదే మన ప్రత్యేకత’ అంటోంది బెల్లీ బ్యూటీ ఇలియానా. గతంలో తాను బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌ (BDD)తో బాధపడ్డానని పలు సందర్భాల్లో వెల్లడించిన ఈ గోవా బ్యూటీ.. మనల్ని మనం అంగీకరించినప్పుడే మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని పొందగలుగుతామంటోంది. తన స్వీయానుభవంతోనే ఈ విషయం తెలుసుకున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఇల్లూ బేబీ.

‘నేను ముందు నుంచీ కాస్త సిగ్గరిని. అయితే 12 ఏళ్ల వయసు నుంచే అందం, శరీరాకృతి, ఫిట్‌నెస్‌ విషయాల్లో పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండేది. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నన్ను నేను మార్చుకోవాలని. ఈ ఆలోచనే నన్ను మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేసింది. ఒకానొక దశలో ఆందోళనలో కూరుకుపోయా. పదే పదే అద్దంలో చూసుకోవడం, నాలోని లోపాల్ని భూతద్దంలో చూస్తూ ఇతరులతో పోల్చుకోవడం.. ఇలా 15 ఏళ్ల వయసులోనే నాకు బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌ సమస్య ఉందన్న విషయం అర్థమైంది.

ఒక్కోసారి ఈ సమస్యల్ని ఎదుర్కోవడం కంటే చావే మేలనిపించేది. కానీ ఆ తర్వాత్తర్వాత నా ఆలోచనల్ని మార్చుకున్నా. నెమ్మదిగా ఆందోళనల నుంచి బయటపడడం అలవాటు చేసుకున్నా. నన్ను నేను ప్రేమించడం, అంగీకరించడం నేర్చుకున్నా.. లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సర్వసాధారణం.. వాటిని అంగీకరించినప్పుడే ఆనందంగా ఉండగలమన్న విషయం గ్రహించిన నాటి నుంచి ఎవరేమనుకున్నా పట్టించుకోవట్లేదు..’ అంటూ తన స్వీయానుభవాన్ని పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి రగిలించిందీ బెల్లీ బ్యూటీ.

వీళ్లే కాదు.. దీపికా పదుకొణె (డిప్రెషన్‌), సోనాలీ బింద్రే (హై గ్రేడ్‌ మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌), మనీషా కొయిరాలా (ఒవేరియన్‌ క్యాన్సర్‌).. వంటి తారలు కూడా తమ అనారోగ్యాల్ని, వాటి వల్ల తామెదుర్కొన్న భయంకరమైన అనుభవాల్ని అభిమానులతో పంచుకుంటూ ఎంతోమందిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్