Adah Sharma: అప్పుడు 48 రోజులు బ్లీడింగ్‌ అయింది!

నటన అంటే ప్రాణం పెడతారు మన అందాల నాయికలు. సినిమాల్లో తమ పాత్రల కోసం బరువు పెరగడానికి, తగ్గడానికి, తమ శరీరాన్ని పాత్రలకు తగినట్లుగా మార్చుకోవడానికీ సిద్ధపడతారు. ఈ క్రమంలో తలెత్తే అనారోగ్యాల్నీ పక్కన పెట్టి.. చిత్ర విజయాల్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అదా శర్మ కూడా ఇదే చేశానంటోంది....

Updated : 13 Jun 2024 19:39 IST

నటన అంటే ప్రాణం పెడతారు మన అందాల నాయికలు. సినిమాల్లో తమ పాత్రల కోసం బరువు పెరగడానికి, తగ్గడానికి, తమ శరీరాన్ని పాత్రలకు తగినట్లుగా మార్చుకోవడానికీ సిద్ధపడతారు. ఈ క్రమంలో తలెత్తే అనారోగ్యాల్నీ పక్కన పెట్టి.. చిత్ర విజయాల్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అదా శర్మ కూడా ఇదే చేశానంటోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు వరుసగా నాలుగు చిత్రాలతో బిజీగా గడిపిన ఈ చక్కనమ్మ.. ఆయా పాత్రలకు అనుగుణంగా తనను తాను మార్చుకునేందుకు తీవ్రంగా శ్రమపడింది. ఈ ఒత్తిడే తనను ఎండోమెట్రియోసిస్‌ బారిన పడేలా చేసిందంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది అదా. ఈ దీర్ఘకాలిక సమస్య వల్ల కలిగిన దుష్ప్రభావాల గురించి చెబుతూనే.. తన సినిమాలకు మంచి గుర్తింపు దక్కడంతో.. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించిందంటూ మురిసిపోతోంది. మరి, అదా పంచుకున్న తన ఎండోమెట్రియోసిస్‌ అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

అదా శర్మ.. బయట ఎంత చలాకీగా ఉంటుందో సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తన సినిమాలకు సంబంధించిన విశేషాలే కాదు.. వ్యక్తిగత విషయాల్నీ ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి వెనకాడదు. గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగు సినిమాలతో బిజీగా గడిపిన ఈ భామ.. తన ఈ బిజీ షెడ్యూల్‌ వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని ఇటీవలే ఓ సందర్భంలో వెల్లడించింది.

ఫిట్‌నెస్‌ను కోల్పోయా!
‘ఏడాది కాలంలో నాలుగు సినిమాలతో బిజీ బిజీగా గడిపాను. ఈ చిత్రాల్లో నా పాత్రలకు అనుగుణంగా నా శరీరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ‘ది కేరళ స్టోరీ’లో తొలి అర్థభాగం కాలేజీ అమ్మాయిలా చిన్నగా, నాజూగ్గా కనిపించాలి.. అందుకోసం బరువు తగ్గాను. ఇక ఆపై ‘కమాండో’ కోసం కండలు తిరిగిన దేహదారుఢ్యాన్ని పొందడానికి కృషి చేశా. ‘సన్‌ఫ్లవర్‌’లో బార్‌ డ్యాన్సర్‌ పాత్ర నాది. ఇందులో సెక్సీగా కనిపించేలా నన్ను నేను మార్చుకున్నా. అయితే ‘బస్తర్‌’లో పాత్ర వీటన్నింటి కంటే భిన్నం. ఇందుకు తగినట్లుగా చక్కటి దేహదారుఢ్యంతో కనిపించేందుకు కొన్ని కిలోల బరువు పెరిగా. ఈ క్రమంలో రోజుకు డజను అరటిపండ్లు తినేదాన్ని. నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, అవిసె గింజలతో చేసిన లడ్డూలు.. అమితంగా తీసుకున్నా. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీన్లలో ఎనిమిది కిలోల బరువైన తుపాకులను మోస్తూ కొండలు, గుట్టలు ఎక్కడం, దిగడం చేయాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సినిమా షూటింగ్‌ ముగిసే సరికి నా ఫిట్‌నెస్‌ను పూర్తిగా కోల్పోయా..’ అంది అదా.

ఒత్తిడితోనే ఆ సమస్య!
ఇలా సినిమాల్లో తన పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడంతో తీవ్ర శారీరక ఒత్తిడికి లోనైన అదా.. దీని ప్రభావం తన ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైనా పడిందంటోంది.
‘నిజానికి నేను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని.. జిమ్నాస్టిక్స్‌ బాగా సాధన చేస్తా. ఇదే నా శరీరాన్ని, వెన్నెముకను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. అయితే సినిమాల్లో పాత్రల కోసం వేగంగా బరువు తగ్గడం, పెరగడం చేసేసరికి.. శరీరంపై తీవ్ర ఒత్తిడి పడింది. కటి వలయ కండరాలపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డా. ఇది ఎండోమెట్రియోసిస్‌కు దారితీసింది. ఓవైపు పొత్తి కడుపులో నొప్పి, మరోవైపు ఆగకుండా బ్లీడింగ్‌.. ఇలా ఆ సమయంలో సుమారు 48 రోజుల పాటు ఎంతో ఇబ్బంది పడ్డా. అయితే ఒక నటిగా పాత్ర కోసం ఎంతైనా కష్టపడగలను. ఎందుకంటే జీవితకాలంలో ఇలాంటి పాత్రలు, అవకాశాలు ఒకేసారి వస్తాయన్నది నా భావన. అంతేకాదు.. ఆయా పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా నన్ను నేను ఎలాగైనా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. ఇలా నా కష్టానికి ప్రతిఫలం దక్కినప్పుడు ఆ సంతోషం, సంతృప్తి మాటల్లో చెప్పలేను. ఈ నాలుగు సినిమాలు నాకు అలాంటి సంతృప్తినే ఇచ్చాయి..’ అంటోందీ బాలీవుడ్‌ అందం.


ఏంటీ ఎండోమెట్రియోసిస్‌?

అదానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 మిలియన్ల మంది, భారత్‌లో 42 మిలియన్ల మంది రుతుచక్రం మొదలైన మహిళలు, అమ్మాయిలు ‘ఎండోమెట్రియోసిస్‌’తో బాధపడుతున్నట్లు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)’ చెబుతోంది. గర్భాశయం లోపలి పొరను పోలిన పొర దాని బయట పెరగడం వల్ల ఈ దీర్ఘకాలిక సమస్య వస్తుందంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆ ప్రదేశంలో వాపు, మచ్చలాగా ఏర్పడి.. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. ఈ సమస్య వల్ల నెలసరి/కలయిక/మూత్ర విసర్జన సమయాల్లో నొప్పి రావడంతో పాటు కడుపుబ్బరం, వికారం, అలసట, డిప్రెషన్‌, యాంగ్జైటీ.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు.. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ఈ అనారోగ్యం కారణంగా.. గర్భం ధరించడమూ కష్టమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ సమస్యను పూర్తిగా నయం చేసుకోలేకపోయినా.. మందులు, కొన్నిసార్లు సర్జరీ ద్వారా దీని లక్షణాల నుంచి విముక్తి పొందచ్చంటున్నారు. ఇక నొప్పిని తగ్గించడానికి మందులు, హార్మోనల్‌ ఐయూడీలు, వెజైనల్‌ రింగ్స్‌, ఇంప్లాంట్స్‌, ఇంజెక్షన్లు, ప్యాచెస్‌.. వంటి పద్ధతులున్నాయి. ఈ సమస్య ఉన్నప్పటికీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తోన్న మహిళలు వైద్యుల పర్యవేక్షణలో సంబంధిత చికిత్సలు తీసుకుంటే సానుకూల ఫలితం పొందచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్