పాతికేళ్ల అనుభవంతో ఆ కంపెనీకి కెప్టెన్ అయింది!

టెక్నాలజీ రంగంలో ప్రతివది పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం. ఐబీఎమ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎంతో సమర్థంగా విధులు నిర్వర్తించింది. ఇప్పుడా గుర్తింపే ‘అడోబ్‌’ లాంటి మల్టీ నేషనల్‌ కంపెనీకి కెప్టెన్‌గా సారథ్యం వహించే అవకాశాన్ని ఆమెకు తీసుకొచ్చింది.

Updated : 09 Sep 2021 19:07 IST

(Photo: Twitter)

టెక్నాలజీ రంగంలో ప్రతివది పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం. ఐబీఎమ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎంతో సమర్థంగా విధులు నిర్వర్తించింది. ఇప్పుడా గుర్తింపే ‘అడోబ్‌’ లాంటి మల్టీ నేషనల్‌ కంపెనీకి కెప్టెన్‌గా సారథ్యం వహించే అవకాశాన్ని ఆమెకు తీసుకొచ్చింది.

అభిరుచితో పాటు సుదీర్ఘ అనుభవం!

అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అడోబ్‌, ఇండియాలోని తమ కార్యకలాపాల నిర్వహణకు గాను ప్రతివ మహాపాత్రను ఉపాధ్యక్షురాలిగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. ‘టెక్నాలజీ రంగంలో ఆమె (ప్రతివ)కు మంచి అభిరుచితో పాటు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె శక్తి సామర్థ్యాలు మా బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళతాయని భావిస్తున్నాం. విధుల్లో భాగంగా అడోబ్‌ ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్, అడోబ్‌ క్రియేటివ్‌ క్లౌడ్‌, అడోబ్‌ డాక్యుమెంట్ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్ల బాధ్యతలను ఆమె చూసుకోనున్నారు’ అని అడోబ్‌ ప్రెసిడెంట్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్ చెప్పుకొచ్చారు.

మొదటి మహిళగా!

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘అడోబ్ ఇండియా’కు మొదటిసారిగా ఓ మహిళ నాయకత్వం వహిస్తోంది. ఇక ప్రతివ విషయానికొస్తే...ఆమెది ఒడిశా రాష్ట్రం. రూర్కెలా రీజనల్ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అనంతరం భువనేశ్వర్‌లోని జేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ నుంచి సిస్టమ్స్ అండ్‌ ఫైనాన్స్‌లో పీజీ పట్టా అందుకుంది. ఆ తర్వాత పీడబ్ల్యూసీ ఇండియాలో కెరీర్‌ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇక 2002లో ఐబీఎమ్‌లో చేరిన ప్రతివ...గత 19 ఏళ్లుగా అక్కడే వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. అడోబ్‌ ఇండియాలో చేరేముందు ఆమె ఐబీఎమ్ ఇండియా అండ్‌ సౌత్ ఆసియా విభాగాలకు సేల్స్‌ లీడ్‌గా వ్యవహరిస్తున్నారు.

‘అడోబ్‌ ఇండియా లాంటి అంతర్జాతీయ సంస్థలో భాగమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇండియాలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంపై నా దృష్టిని కేంద్రీకరిస్తాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రతివ.

మహిళలకు సమాన అవకాశాలు!

‘గత కొన్నేళ్లుగా అడోబ్‌లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. ఆసియా, పసిఫిక్‌ రీజియన్లోని కొన్ని దేశాల్లో వైస్‌ ప్రెసిడెంట్లు, మేనేజింగ్‌ డైరెక్టర్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అడోబ్‌ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది’ అని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్