Updated : 30/12/2022 21:16 IST

జిమ్‌కు వెళ్లేముందు ఆ పరీక్షలు చేయించుకోవాలా?

నాకు 27 ఏళ్లు. గత సంవత్సర కాలంగా నేను వ్యాయామానికి దూరంగా ఉన్నా. అంతకుముందు వాకింగ్‌ చేయడం, జిమ్‌కు వెళ్లడం చేసేదాన్ని. అయితే ఈ మధ్య యువత ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని విన్నా. అప్పటినుంచి జిమ్‌కు వెళ్లాలంటే భయంగా ఉంది. జిమ్‌కు వెళ్లేముందు గుండె సంబంధిత పరీక్షలు ఏవైనా చేయించుకోవాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ వయసు 27 సంవత్సరాలని చెబుతున్నారు. కాబట్టి మీకు హార్ట్ ఎటాక్‌ లాంటివి వచ్చే అవకాశం అరుదు. సాధారణంగా మెనోపాజ్‌ కంటే ముందు మధుమేహం, స్థూలకాయం.. వంటి సమస్యలు లేకపోతే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మహిళల్లో ఈ రిస్క్‌ మెనోపాజ్‌ తర్వాత ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో 25 సంవత్సరాల నుంచే హార్ట్‌ ఎటాక్‌ ముప్పు పెరుగుతుంది. అందుకే గుండెపోటు వచ్చిన వారిలో అధికభాగం పురుషులే ఉంటున్నారు. కాబట్టి, మీరు ఈ విషయాల గురించి ఆలోచించి ఆందోళన చెందకండి. శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు. కాబట్టి, మీరు వ్యాయామం చేయడం తిరిగి మొదలుపెట్టండి.

అయితే ఈ క్రమంలో చాలా గ్యాప్‌ వచ్చింది కాబట్టి, ఒకేసారి భారీ వ్యాయామాలు చేయకుండా.. మొదట వార్మప్‌లు, చిన్న వ్యాయామాలతో ప్రారంభించాలి. వారం రోజులకోసారి వ్యాయామ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. తద్వారా కండరాలు నొప్పులు పట్టే అవకాశం ఉండదు. అప్పటికీ మీకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే.. వారు తగిన సలహా ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని