ఊరి కోసం మోడలింగ్ వద్దనుకుంది!

‘ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనమూ ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం..’ ఇది సినిమా డైలాగే అయినా నిజ జీవితంలో దీన్ని అక్షర సత్యం చేసి చూపిస్తానంటోంది యువ మోడల్‌ ఏశ్రా పటేల్ గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె.. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలో నిలదొక్కుకుంది.

Updated : 16 Dec 2021 17:29 IST

(Photo: Twitter)

‘ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనమూ ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం..’ ఇది సినిమా డైలాగే అయినా నిజ జీవితంలో దీన్ని అక్షర సత్యం చేసి చూపిస్తానంటోంది యువ మోడల్‌ ఏశ్రా పటేల్. గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె.. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలో నిలదొక్కుకుంది. అయితే సరైన వసతులు లేక, ప్రభుత్వ పథకాలు అందక తన ఊరు పడుతోన్న కష్టాల్ని దగ్గర్నుంచి గమనించిన ఆమె.. తన వంతుగా ఊరికి ఏదైనా చేయాలని సంకల్పించుకుంది. ఈ క్రమంలోనే మోడలింగ్‌ని వదిలి రాజకీయాల వైపు అడుగేసింది. త్వరలో జరగబోయే గుజరాత్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పటేల్‌.. గ్రామ సర్పంచ్‌గా గెలిచి అంచెలంచెలుగా ప్రజా సమస్యలు తీర్చడమే తన లక్ష్యమంటోంది. ఈ నేపథ్యంలో ఈ యువ మోడల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

ఏశ్రా పటేల్‌.. గుజరాత్‌ ఛోటా ఉదయ్‌పూర్‌ జిల్లాలోని కవిత అనే గ్రామంలో పుట్టి పెరిగింది. వ్యవసాయాధారిత కుటుంబమే అయినా చిన్నతనం నుంచే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కందామె. ఆమె పట్టుదలకు కుటుంబ ప్రోత్సాహం కూడా తోడవడంతో ‘ఫోర్డ్‌ సూపర్ మోడల్‌ - 2009’ పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది ఏశ్రా. ఇక 2010లో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొని టాప్‌-10లో చోటు సంపాదించింది.

ఎన్ని మారినా.. మా ఊరు మారలేదు!

ఆ తర్వాత ముంబయికి చేరుకొని మోడల్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన ఏశ్రా.. వందకు పైగా ప్రకటనల్లో నటించింది. ఇలా తన కెరీర్‌లో నిలదొక్కుకున్న ఆమె.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పనులన్నీ వాయిదా పడడంతో తన గ్రామానికి చేరుకుంది. అయితే పదేళ్లకు పూర్వం తన గ్రామంలో ఎలాంటి సమస్యలైతే ఉండేవో.. ఇప్పటికీ వాటిలో ఎలాంటి మార్పు, అభివృద్ధి కనిపించలేదంటోందీ యువ మోడల్.

‘నా కెరీర్‌లో భాగంగా నేను ఎన్నో దేశాలు తిరిగాను. అన్నింటా ఎంతో కొంత అభివృద్ధి కనిపించింది. కానీ నా గ్రామం మాత్రం పదేళ్ల కింద ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది.. ఊర్లో సరైన విద్యా సదుపాయాల్లేవు.. పోనీ పక్క ఊర్లో ఉన్న స్కూలుకెళ్దామంటే ఆ స్కూల్‌ బస్‌ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు రాదో ఎవరూ చెప్పలేరు. నా చిన్నతనంలో నేనూ ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్నా. మరోవైపు రోడ్ల సమస్య. ఊర్లో సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు. దాంతో గర్భిణులు అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లాలంటే గగనమే! ఇక వర్షం పడిందంటే రోడ్లు చెరువులను తలపిస్తాయి. లాక్‌డౌన్‌లో ఇంటికెళ్లినప్పుడు ఈ సమస్యలన్నీ దగ్గర్నుంచి గమనించా.. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాలేవీ ఇక్కడ అమలవ్వట్లేదన్న విషయం స్పష్టమవుతోంది..’ అంటోంది ఏశ్రా.

(Image for Representation)

గెలిస్తే.. వాటికే ప్రాధాన్యం!

ఇలా తన గ్రామంలోని సమస్యల్ని దగ్గర్నుంచి గమనించిన ఆమె.. తన దారి తాను చూసుకోకుండా ఊరి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తోంది. ఇందుకోసం తన వంతు ప్రచారం నిర్వహిస్తోంది ఏశ్రా. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవడం.. ఇచ్చిన హామీల్ని నెరవేర్చుతానని వాళ్లకు మాటివ్వడం.. ఇలా ఆమె చురుకుదనం చూస్తే ఎన్నికల్లో ఆమెకే విజయం ఖాయమనుకుంటున్నారు అక్కడి ప్రజలు. మరి, ఒకవేళ సర్పంచ్‌గా గెలిస్తే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తారని ఏశ్రాను అడిగితే..

‘గ్రామంలో చాలా సమస్యలున్నాయి. అయితే అన్నింటికంటే ముందుగా ఇక్కడి ప్రజల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటున్నా. అప్పుడే వాళ్ల హక్కుల గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఇక ఆ తర్వాత పిల్లలకు విద్యా సౌకర్యాలు, రోడ్లు, వైద్య సదుపాయాలు, మురుగు నీటి వ్యవస్థను పునరుద్ధరించడం.. ఇవన్నీ పైఅధికారులతో మాట్లాడి ఒక్కొక్కటిగా చేయాలనుకుంటున్నా. అలాగే పిల్లలకు స్కూల్లో సరైన పోషకాహారం అందట్లేదు.. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపకపోతే దీనికయ్యే ఖర్చును నేనే భరిద్దామనుకుంటున్నా. ఇక ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA)’ కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెడతా..’ అంటూ సమాధానమిస్తోంది ఏశ్రా.

ఇక ఏశ్రా తండ్రి కూడా గతంలో ఈ గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తించారు. ఏదేమైనా నిస్వార్థంగా ఆలోచించి తన గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం తనకిష్టమైన మోడలింగ్‌నే కాదంటోన్న ఏశ్రా మంచి మనసుకు హ్యాట్సాఫ్!

ఆల్‌ ది బెస్ట్‌ ఏశ్రా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్