దుబ్బు జుట్టుతో గిన్నిస్‌కెక్కింది..!

మనలో కొంతమంది జుట్టు సిల్కీగా మెరిసిపోతే.. మరికొంతమందికి ఉంగరాల జుట్టు ఉంటుంది. అత్యంత అరుదుగా ఇంకొంతమందిలో సింహం జూలులాగా దుబ్బు జుట్టు ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన జుట్టుతోనే అమెరికాకు చెందిన ఏవిస్‌ దుగాస్‌ అనే మహిళ గిన్నిస్‌ బుక్‌లో చోటు....

Published : 08 Apr 2023 19:59 IST

(Photos: Guinness World Records)

మనలో కొంతమంది జుట్టు సిల్కీగా మెరిసిపోతే.. మరికొంతమందికి ఉంగరాల జుట్టు ఉంటుంది. అత్యంత అరుదుగా ఇంకొంతమందిలో సింహం జూలులాగా దుబ్బు జుట్టు ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన జుట్టుతోనే అమెరికాకు చెందిన ఏవిస్‌ దుగాస్‌ అనే మహిళ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. ఆమె జుట్టు 25 సెంటీమీటర్ల పొడవు, 26 సెంటీమీటర్ల వెడల్పు, 5’4’’ చుట్టుకొలతతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దాంతో ‘ప్రపంచంలో జీవించి ఉన్నవారిలో అతిపెద్ద దుబ్బు జుట్టు ఉన్న మహిళ’గా ఏవిన్‌ గిన్నిస్‌కెక్కింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి, ఆమె కేశ సంరక్షణ గురించి తెలుసుకుందాం రండి..

రెండోసారి...

అమెరికాకు చెందిన ఏవిస్‌ దుగాస్‌ది లూసియానా. ఆమె 2010లోనే ‘పెద్ద దుబ్బు జుట్టు ఉన్న మహిళ’గా రికార్డు సాధించింది. అప్పుడు ఆమె జుట్టు 4’4’’గా ఉంది. అయితే తాజాగా తన రికార్డును తానే చెరిపేస్తూ మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఏవిస్‌. ప్రస్తుతం ఆమె జుట్టు పొడవు 25 సెంటీమీటర్లు, వెడల్పు 26 సెంటీమీటర్లు, చుట్టుకొలత 5’4’’గా ఉంది. ఇలా తన జుట్టును ఇంత గుబురుగా, ఒత్తుగా పెంచుకోవడానికి ఆమెకు 24 సంవత్సరాలు పట్టిందట!

అవి మానేయడం మంచిదైంది..

మొదట్లో ఏవిస్‌కు దుబ్బు జుట్టంటే నచ్చేది కాదట! అందుకే తన జుట్టును స్ట్రెయిట్‌గా మార్చుకోవడం కోసం వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగించిందట. అయితే వాటివల్ల ఆశించిన ఫలితం లభించకపోవడంతో విసుగెత్తిపోయిందట ఏవిస్‌. ‘కొన్ని సంవత్సరాల క్రితమే ఆ హెయిర్‌కేర్‌ ఉత్పత్తులను మానేయడం మంచిదైంది. ఎందుకంటే ఇప్పుడు అవే ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయనే చర్చ జరుగుతోంది’ అని చెప్పుకొచ్చిందామె. అప్పట్నుంచి ఏవిస్‌ తన జుట్టు సహజంగానే పెరగాలని భావించిందట! అలా తరచుగా ట్రిమ్‌ చేయడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దుబ్బు జుట్టు మరింత గుబురుగా పెరుగుతూ వచ్చిందని అంటోందీ గిన్నిస్‌ గర్ల్‌.

ఈ జాగ్రత్తలు తీసుకొంటూ..

తన జుట్టు ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నానంటోంది ఏవిస్. ‘జుట్టు చివర్లు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే హెయిర్‌ స్టైలింగ్‌ చేసేటప్పుడు వాటి విషయంలో మరింత జాగ్రత్తపడతా. అలాగే గోరువెచ్చగా ఉండే నూనెతో మర్దన చేసుకుంటా. షాంపూ, కండిషనర్‌ ఉపయోగించే ముందు జుట్టును వెన్నతో మర్దన చేస్తాను. ఈ చిట్కా వారానికోసారి పాటిస్తాను. ఇవే నా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి..’ అంటోందీ ఆఫ్రో బ్యూటీ.

పలు అసౌకర్యాలూ!

ఏవిస్‌ ఎప్పుడూ తన దుబ్బు జుట్టును అలాగే వదిలేయదట! దాంతో రకరకాల హెయిర్‌స్టైల్స్‌ వేసుకుంటానంటోందామె. కానీ దుబ్బు జుట్టు ఉన్నప్పుడే చాలామంది తనను గుర్తిస్తారని చెబుతోంది. అలాగే ఈ దుబ్బు జుట్టు వల్ల లాభాలతో పాటు కాస్త అసౌకర్యం కూడా తప్పట్లేదంటోంది. ‘లూసియానాలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జుట్టు ఒత్తుగా ఉండడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. కేశాల్ని అలా వదిలేయడం వల్ల కళ్లపై పడి మరింత చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక చెమటతో మరో చికాకు..’ అని చెబుతోన్న ఏవిస్‌.. ఒత్తైన జుట్టు వల్ల దిండు పెట్టుకోవాల్సిన పనే లేదంటోంది. ఇలా కొన్ని ఉపయోగాలు, మరికొన్ని సార్లు అసౌకర్యంగా అనిపించే ఈ జుట్టే తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందంటోంది ఏవిస్‌.

వ్యాపారవేత్తగానూ..!

ఏవిస్‌ తన జుట్టుతో గిన్నిస్‌ రికార్డు సాధించడమే కాదు.. మరోవైపు వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. ఆమె ‘కెమ్‌హెయిర్‌స్ట్రీ’ అనే సంస్థను స్థాపించింది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో కేశ సంబంధిత ఉత్పత్తులు విక్రయిస్తోంది. అలాగే హానికరమైన ఉత్పత్తులను ఉపయోగించకుండా సహజంగానే జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్