Updated : 19/08/2021 18:22 IST

వాళ్ల భవిష్యత్తు గురించి తలచుకుంటేనే భయమేస్తోంది..!

(Photo: Instagram)

రోడ్లపై తుపాకులతో తిరుగుతున్న తాలిబన్లు... ప్రాణభయంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్న సామాన్యులు.. దేశం విడిచి వెళ్లేందుకు విమానాల వెంట పరుగులు... వెరసి అఫ్గానిస్థాన్‌ వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా అక్కడి మహిళలు, అమ్మాయిల భవిష్యత్‌ ఏంటని అందరూ ఆందోళన చెందుతున్నారు.

ఆప్తుల ఆచూకీ తెలియడం లేదు!

ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో పుట్టి భారత్‌లో స్థిరపడిన ప్రముఖ టీవీ నటి అర్షి ఖాన్‌ తన బంధువులు, స్నేహితుల గురించి బాధపడుతోంది. తన మాతృభూమి ముష్కరుల చేతుల్లోకి వెళ్లాక తన ఆప్తులతో కనీసం మాట్లాడలేకపోతున్నానంటూ కన్నీరుమున్నీరవుతోంది.

నాలుగేళ్ల వయసులో ఇండియాకు!

అర్షికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అఫ్గాన్‌ నుంచి భోపాల్‌కు వచ్చి అక్కడే స్థిరపడింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు భోపాల్‌లోనే చదువుకుంది అర్షి. మొదట ఫిజియోథెరపిస్ట్‌ కావాలనుకున్న ఆమె క్రమంగా మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. అవకాశాల కోసం ముంబయికి మకాం మార్చింది. మోడల్‌గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో నటించింది. 2017లో బిగ్‌బాస్‌-11 లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రియాలిటీ షో కారణంగానే ఆ ఏడాది గూగుల్‌ ఇండియా విడుదల చేసిన ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఎంటర్‌టైనర్‌’ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. దీంతో పాటు ‘సావిత్రి దేవి కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌’, ‘విష్‌’ లాంటి సీరియల్స్‌, వెబ్‌సిరీస్‌, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, వీడియోలతో హిందీ టీవీ ప్రేక్షకులకు మరింత చేరువైంది.

అక్కడి మహిళల గురించి బాధేస్తోంది!

ఈ క్రమంలో తన దేశం మళ్లీ తాలిబన్ల వశం కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అర్షి. ‘నేను అఫ్గానిస్థాన్‌లోనే పుట్టాను. నా నాలుగేళ్ల వయసులో మా ఫ్యామిలీ ఇండియాకు వచ్చేసింది. ఇప్పటికీ కొందరు బంధువులు, స్నేహితులు అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు కాబూల్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిసి నా మనసు కలత చెందింది. ఇప్పుడు దేశమంతా ముష్కరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో నా ఆప్తులతో కనీసం మాట్లాడలేకపోతున్నాను. వారి క్షేమ సమాచారాలు తెలుసుకోలేకపోతున్నాను. ఇక అక్కడి మహిళలు, అమ్మాయిల భవిష్యత్‌ను తలచుకుంటేనే భయమేస్తోంది. ఎందుకంటే నేను కూడా ఒక అఫ్గానీ పఠాన్‌ అమ్మాయినే. తాలిబన్లు ఎంతటి క్రూరులో నాకు తెలుసు.’

ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు!

‘ప్రస్తుతం నా ఆలోచనలన్నీ అఫ్గాన్‌ వాసుల చుట్టే తిరుగుతున్నాయి. అసలు తినాలనిపించడం లేదు. వారిని రక్షించేందుకు ఏం చేయాలో తెలియడం లేదు. నేను పూర్తిగా నిస్సహాయురాలిగా మారిపోయాను. అందుకే నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ అఫ్గాన్‌ ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అని ఆకాంక్షిస్తున్నాం’ అని చెప్పుకొచ్చిందీ టీవీ యాక్ట్రెస్.

నేను భారత పౌరురాలినే!

ఈ మేరకు సోషల్‌ మీడియాలో తన పౌరసత్వంపై వస్తోన్న విమర్శలు, ట్రోల్స్‌పై గట్టిగానే స్పందించింది అర్షి. ‘నేను అఫ్గానిస్థాన్‌లో పుట్టినా భారత పౌరురాలినే. అయితే కొందరు నెటిజన్లు అకారణంగా నాపై విమర్శలు చేస్తున్నారు. నేను పాకిస్థాన్‌ నుంచి వచ్చానని నిందిస్తున్నారు. ఇది నాకు చాలా బాధేస్తోంది. మా తాత అఫ్గాన్‌ నుంచి ఇండియాకు వలస వచ్చారు. భోపాల్‌లో జైలర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. అదేవిధంగా భారతదేశ పౌరసత్వానికి సంబంధించి అన్ని రకాల గుర్తింపు కార్డులు నా వద్ద ఉన్నాయి. నాకు అఫ్గాన్‌ మూలాలుండొచ్చు...కానీ ఎప్పటికీ నేను భారత పౌరురాలినే’ అంటూ ట్రోలర్స్‌కు సమాధానమిచ్చిందీ బుల్లితెర నటి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి