పెళ్లికి ముందు ఒప్పుకొని ఇప్పుడు మాట మారుస్తున్నాడు..!

నేను ఎంఏ చదివాను. లెక్చరర్‌ కావాలని కలలు కన్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే పెళ్లైంది. నా భర్త పెళ్లికి ముందు నేను జాబ్‌ చేయడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. ‘మనకు సంపాదించాల్సిన అవసరం ఏముంది? మా అమ్మానాన్నలను....

Published : 07 Apr 2023 12:58 IST

నేను ఎంఏ చదివాను. లెక్చరర్‌ కావాలని కలలు కన్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే పెళ్లైంది. నా భర్త పెళ్లికి ముందు నేను జాబ్‌ చేయడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. ‘మనకు సంపాదించాల్సిన అవసరం ఏముంది? మా అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో.. చాలు’ అంటున్నాడు. రోజంతా ఇంటి పని.. వచ్చి వెళ్లేవారిని చూసుకోవడంతోనే సరిపోతోంది. చాలా నిరాశగా ఉంది. నా బాధ తనకు అర్థం కావడం లేదు. ఇలాగే ఇంకొన్నాళ్లు ఉంటే పిచ్చెక్కిపోతుందేమోనని భయంగా ఉంది. నా భర్తకు నా బాధ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు మాస్టర్స్‌ చదివానని అంటున్నారు. అంటే మీరు మీ సొంత కాళ్ల మీద నిలబడాలని అనుకున్నారు. కేవలం చదువు మాత్రమే ఉండాలంటే డిగ్రీతోటే ఆపేసేవారు. అలాగే పెళ్లికి ముందు నుంచే మీరు లెక్చరర్‌ కావాలని అనుకున్నారు. ఇది మంచి విషయం. ఇదే విషయం పెళ్లికి ముందే మీ భర్తకు చెప్పినప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మాట మారుస్తున్నారని అంటున్నారు. దీనిని బట్టి అతనిది కంట్రోలింగ్‌ నేచర్‌లాగా అనిపిస్తోంది.

అయితే ఉద్యోగం అనేది కేవలం సంపాదన కోసం మాత్రమే చేసేది కాదు. ఉద్యోగం చేయడం వల్ల వ్యక్తిత్వం డెవలప్‌ అవుతుంది. ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. నలుగురితో మాట్లాడతారు.. కాబట్టి సామాజిక అవగాహన పెరుగుతుంది. ఈ విషయాలను మీ భర్తకు తెలియజేయండి. ‘నాకిలా అనిపిస్తోంది.. జీవితం చాలా నిరాశగా ఉంది.. నా లక్ష్యాలు ఇవి కావు.. నా కెరీర్‌ను మెరుగుపరుచుకోవాలి.. నాకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకోవాలి.. అందుకు కొంత సమయం కావాలి’ అన్న విషయాన్ని మీ భర్తకు చెప్పండి. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే మ్యారేజ్‌ కౌన్సెలర్ దగ్గరకు వెళ్లి మీ సమస్యను చెప్పండి. వారు మీ భర్తకు అర్థమయ్యేలా వివరిస్తారు. అప్పుడు మీరు ఆశించిన ఫలితం పొందే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని