Published : 19/01/2022 20:11 IST

నీకు ఆకాశమే హద్దు తల్లీ..!

(Photo: Instagram)

‘వందే భారత్‌ మిషన్‌’.. ఈ పేరు తలచుకుంటే కరోనా తొలి రోజులే గుర్తొస్తాయి.. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అనూహ్య ధైర్యసాహసాలు ప్రదర్శించి ఈ మిషన్‌లో భాగమయ్యారు కొంతమంది మహిళా పైలట్లు. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి చేర్చి కొవిడ్‌ వారియర్లుగా మన్ననలందుకున్నారు. ఎయిరిండియా పైలట్‌ లక్ష్మి జోషి కూడా వీరిలో ఒకరు. చిన్న వయసు నుంచే పైలట్‌ కావాలని కలలు కన్న ఆమె తపనకు తన తండ్రి ప్రోత్సాహం కూడా తోడవడంతో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిందామె. ప్రతి పైలట్‌ నడపాలని కలలు కనే బోయింగ్‌ విమానాన్నీ నడిపి అరుదైన ఘనతను అందుకుంది. అయితే ఏడాదిన్నర క్రితం నాటి వందేభారత్‌ మిషన్‌ అనుభవాలను ఇటీవలే ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో పంచుకుంది లక్ష్మి. ఇప్పటికీ ఈ మిషన్‌ సేవలు కొనసాగుతున్నాయని, 24×7 సేవకు సై అంటోన్న ఈ డేరింగ్‌ పైలట్‌ పంచుకున్న తన సక్సెస్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

2020 మే, అప్పటికే చైనా కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి బయటపడే వారే కానీ.. అలాంటి రిస్క్‌ జోన్‌లోకి వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ అలాంటి సాహసమే చేసింది పైలట్‌ లక్ష్మి జోషి. ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా.. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి చేర్చి కొవిడ్‌ వారియర్‌గా ఎంతోమంది మన్ననలందుకుందీ డేరింగ్‌ పైలట్.

ఎనిమిదేళ్లకే నిర్ణయించుకున్నా!

‘ఆకాశంలో ఎగిరే విమానాలంటే నాకు చిన్నప్పట్నుంచే ఆసక్తి. నా ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి విమానం ఎక్కా. దిగాక నాన్నతో ‘ఏదో ఒక రోజు నేను పైలట్‌ అవుతా!’ అన్నా. నాన్న చిరునవ్వుతో నా జుట్టు నిమురుతూ నాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 12వ తరగతి పూర్తయ్యాక మరోసారి నాన్నతో ఇదే విషయం చెప్పా. ఈసారి దీన్ని నాన్న సీరియస్‌గా తీసుకున్నారు. ‘నీకు ఆకాశమే హద్దు తల్లీ..’ అంటూ నన్ను ప్రోత్సహించారు. నా పైలట్‌ ట్రైనింగ్‌ కోసం రుణం కూడా తీసుకున్నారు.

కల నెరవేరిన వేళ..!

ఇష్టమైన కోర్సు కదా.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. న్యూజిలాండ్‌లో పైలట్‌ ట్రైనింగ్‌ పూర్తయింది.. లైసెన్స్‌ కూడా వచ్చింది.. ఇక ఆ తర్వాత ఎయిరిండియాలో ఉద్యోగం రావడంతో నా కలలకు రెక్కలు తొడిగినట్లనిపించింది.. కల నెరవేరింది.. పైలట్‌గా ముంబయి నుంచి దిల్లీకి తొలి విమానం నడిపా! ఆ సమయంలో కాస్త నెర్వస్‌గా అనిపించినా.. కాక్‌పిట్‌లో కూర్చున్నప్పుడు మా ఇంట్లో కూర్చున్నట్లనిపించింది. నా కల నెరవేరినందుకు అమ్మానాన్నలు కూడా ఎంతో సంతోషించారు. ‘మీ కూతురు భవిష్యత్తులో ఏమవుదామనుకుంటోంది’? అని ఎప్పుడు మా బంధువులు అడిగినా సరే.. ‘నా కూతురు పైలట్‌గా ఆకాశంలో ఎగరడానికే పుట్టింది.. అదే తన కెరీర్‌!’ అంటూ తన మాటలతో అందరిముందు నన్ను ఆకాశానికెత్తేసేవారు.

సేవలోనే సంతృప్తి!

ఇక బోయింగ్‌ 777 విమానం నడిపిన అతికొద్ది మంది మహిళా పైలట్లలో ఒకరిగా నిలిచినప్పుడు ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నేను కూడా నా వృత్తిని ప్రేమిస్తూ, దేశవిదేశాల అందాల్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయా. అయితే అనుకున్న కెరీర్‌లో స్థిరపడ్డా.. కానీ మనసులో ఏదో వెలితి. కరోనా సమయంలో ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌తో ఆ లోటు తీరిపోయింది. నిజానికి అమ్మానాన్నలు ఆ సమయంలో కాస్త ఆందోళన చెందారు. కానీ ఇది ఎంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమో తెలుసుకొని గర్వపడ్డారు. ఈ క్రమంలోనే మొదటి రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా షాంఘైలో చిక్కుకున్న భారతీయుల్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇండియాలో దిగాక.. ప్రయాణికులంతా మాకు జయజయ ధ్వానాలు చేశారు. అంతలోనే ఓ చిన్నారి నా వద్దకొచ్చి.. ‘నేనూ భవిష్యత్తులో నీలా కావాలనుకుంటున్నా’ అంది. ‘నీకు ఆకాశమే హద్దు’ అంటూ ఆనాడు నాన్న నాకు చెప్పిన మాటల్ని ఆరోజు ఆ అమ్మాయితో చెప్పాను.

నేటికీ సేవలు కొనసాగుతున్నాయ్!

ఆ తర్వాత నెల రోజుల్లో మరో మూడు రెస్క్యూ మిషన్లతో పాటు మందులు సరఫరా చేసే విమానాల్నీ నడిపా. సుదూర ప్రయాణాలకు తోడు గంటల తరబడి పీపీఈ కిట్లలో ఉండాలంటే కష్టమే! కానీ మరొకరికి సహాయపడుతున్నానన్న సంతృప్తి ముందు ఇవేవీ పెద్ద సమస్యగా అనిపించలేదు. కరోనాతో అలా ఆ ఏడాది గడిచిపోయింది.. ఇప్పటికి మూడేళ్లైనా ఈ మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంది. నేటికీ వందే భారత్‌ మిషన్‌ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే నెవార్క్‌కీ వెళ్లొచ్చా. ‘ఆకాశమే హద్దు అని నేను చెప్పిన మాటల్ని అక్షర సత్యం చేసి చూపించావు తల్లీ!’ అని నాన్న నన్ను చూసి గర్వపడుతుంటే అంతకుమించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి?!’ అంటూ తన సంతోషాన్ని పంచుకుందీ కొవిడ్‌ వారియర్.

ఇలా తన సక్సెస్‌తోనే కాదు.. ‘విజయం అకస్మాత్తుగా వరించదు.. దానికోసం ఎంతో కఠోర పరిశ్రమ చేయాలి.. లక్ష్యాన్ని ప్రేమించాలి.. అప్పుడే అనుకున్నది సాధించగలం..’ అంటూ సోషల్‌ మీడియాలో తన స్ఫూర్తిదాయక పోస్టులతోనూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది పైలట్‌ లక్ష్మి.


Advertisement

మరిన్ని