Pilot Routine: విమానం నడిపే ముందు ఇలా ప్రిపేరవుతాం..!
విమానం నడపడం ఓ సాహసం.. వందలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే ఈ బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకోవాలంటే.. సాహసంతో పాటు సమయస్ఫూర్తీ అవసరం.. అంతకుమించి శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా, అలర్ట్‌గా....
విమానం నడపడం ఓ సాహసం.. వందలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే ఈ బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకోవాలంటే.. సాహసంతో పాటు సమయస్ఫూర్తీ అవసరం.. అంతకుమించి శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా, అలర్ట్‌గా ఉండాలి.. మరి, అందుకోసం పైలట్లు ఎలా సిద్ధపడతారు? టేకాఫ్‌కు ముందు వారి దినచర్య ఎలా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆరాటం చాలామందిలో సహజం. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇటీవల ఇదే అంశాలపై ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది. ఆ సంస్థలో పనిచేస్తోన్న సీనియర్ కమాండర్ ఆనీ దివ్య దినచర్యను ప్రధానంగా తీసుకొని రూపొందించిన ఈ వీడియోను తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరలైంది. మరి, ఇంతకీ టేకాఫ్‌కు ముందు పైలట్లు ఎలా సిద్ధపడతారు? మనమూ తెలుసుకుందాం రండి..
పైలట్ అంటే విమానం నడపడమే కాదు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించాలి.. విమానయానానికి సంబంధించిన సంక్లిష్టతల్ని అర్థం చేసుకోవాలి.. ప్రమాదాల్ని పసిగట్టి వెంటనే అప్రమత్తమయ్యే నేర్పు కలిగి ఉండాలి. మరి, ఈ లక్షణాలన్నీ ఉండాలంటే ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. పైలట్ కాస్త కసరత్తు చేయాలంటోంది ఎయిరిండియా. ఈ క్రమంలోనే తమ సంస్థలో సీనియర్ కమాండర్ అయిన ఆనీ దివ్య టేకాఫ్‌కు ముందు ఎలా సన్నద్ధమవుతుందో తెలియజేసేందుకు ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది.
ప్రి-ఫ్లైట్ రొటీన్.. ఇలా!
‘టేకాఫ్‌కు ముందు పైలట్ శారీరకంగా, మానసికంగా ఎలా సిద్ధమవుతారో తెలుసుకోవాలనుందా? అయితే మా సీనియర్ కమాండర్ ఆనీ దివ్య ప్రి-ఫ్లైట్ రొటీన్‌పై ఓ లుక్కేయండి..’ అనే క్యాప్షన్‌తో తాజాగా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది ఎయిరిండియా. ఇంతకీ ఆ రొటీన్‌లో ఏముందంటే..?
☛ యూనిఫాంను సిద్ధం చేసుకోవడం..
☛ బ్యాగ్ సర్దుకోవడం..
☛ సరిపడా విశ్రాంతి తీసుకోవడం..
☛ ప్రయాణానికి సన్నద్ధమవడం..
☛ సమయానికి విమానాశ్రయానికి చేరుకోవడం..
☛ ఫ్లైట్ డిశ్పాచ్ సెక్షన్‌కి వెళ్లడం..
☛ నడపబోయే విమానానికి సంబంధించిన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవడం..
☛ బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసుకోవడం..
‘ప్రయాణికుల భద్రత, ప్రయాణం సురక్షితంగా-సజావుగా సాగడం కోసం.. ప్రతి విమాన ప్రయాణానికి ముందు పైలట్ ఇలాంటి కొన్ని కసరత్తులు చేయాల్సి ఉంటుంది..’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరలైంది. ప్రయాణికుల భద్రత కోసం పైలట్లు పాటించే కఠినమైన, క్రమశిక్షణతో కూడిన రొటీన్‌ను చూసి.. వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ చెక్ లిస్ట్ తప్పనిసరి!
ముందస్తు రొటీన్‌తో పాటు.. ప్రతి పైలట్ ప్రయాణానికి ముందు I'M SAFE అనే చెక్ లిస్‌్సని స్వీయ పరిశీలన చేసుకోవాలంటున్నారు నిపుణులు. అంటే..
I – Illness (ఎలాంటి అనారోగ్యాలు ఉండకూడదు)
M – Medication (ప్రయాణ సమయాల్లో కొన్ని రకాల మందులు పైలట్లు వేసుకోవడం నిషిద్ధం)
S – Stress (ఒత్తిడికి గురికాకూడదు)
A – Alcohol (మద్యం తీసుకోకూడదు)
F – Fatigue (అలసట, నీరసం లేకుండా చూసుకోవాలి)
E – Emotion (ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకూడదు)
ఇలా ఈ లక్షణాలన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉన్నప్పుడే విమానం నడపడానికి సమర్థులు, అర్హులుగా గుర్తిస్తుంది సదరు విమానయాన సంస్థ.
పైలట్‌గా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు!
ఇక తన ప్రి-ఫ్లైట్ రొటీన్‌తో మరోసారి తెరమీదకొచ్చిన ఆనీ దివ్య.. తన 30 ఏళ్ల వయసులో బోయింగ్-777 విమానానికి పైలట్‌గా ఎంపికై.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. పదేళ్ల వయసు నుంచే పైలట్ కావాలని కలలు కన్న ఆమెకు.. తొలుత కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు.. ఆపై ఇంగ్లిష్‌లో మాట్లాడలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా పట్టుదలతో వీటిని అధిగమించి.. ప్రపంచ విమానయాన రంగంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గత పదిహేనేళ్లుగా ఎయిరిండియాలో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆనీ.. సమాజ సేవలోనూ ముందుంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని అనాథ పిల్లల శ్రేయస్సుకు, ముంబయిలోని వృద్ధాశ్రమాలకు విరాళంగా అందిస్తోంది. ‘మన విద్యార్హతల కంటే విలువలే ముఖ్యమని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అనాథాశ్రమాలకు వెళ్లడానికే ఆసక్తి చూపుతుంటా. నాతో సమయం గడపడమంటే ఆ పిల్లలకు చాలా ఇష్టం. ఈ క్రమంలో తమకంటూ ఒకరున్నారన్న ఆత్మ సంతృప్తి వారి ముఖంలో కనిపిస్తుంది. అది చూసి నా మనసు నిండిపోతుంది..’ అంటోందీ సీనియర్ పైలట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.