Published : 09/04/2022 18:32 IST

Alia-Ranbir Wedding: నా ఊహల్లో తనను ఎప్పుడో పెళ్లి చేసుకున్నా!

మనకు నచ్చిన వాడిని ఎంతగా ప్రేమించాలో మనకు తెలుసు.. కానీ మనసైన వాడిని ఎంతలా ఆరాధించచ్చో తనకు మాత్రమే తెలుసంటోంది అందాల ఆలియా భట్. రణ్‌బీర్‌ కపూర్‌ అంటే ఈ ముద్దుగుమ్మకు ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తను మనసా వాచా వరించిన రణ్‌బీర్‌తో ఇప్పటికే మనసులో మూడుముళ్లు వేయించుకున్నానని పదే పదే చెప్పుకొచ్చే ఆలియా.. ఇక నిజజీవితంలో తన ఇష్టసఖుడి చేయందుకోవడానికి సిద్ధపడింది. మరోవైపు రణ్‌బీర్‌ కూడా తన ప్రియసఖి ఆలియాపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ వచ్చాడు. మొత్తానికి అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఏప్రిల్‌ 14న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోన్న ఈ క్రేజీ కపుల్‌ ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసా? అసలు ముందుగా ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు? ఈ లవ్‌బర్డ్స్‌ ‘ప్యార్‌ కీ ఏక్‌ కహానీ’ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఎవరింట్లో పార్టీ అయినా, ఏ వేడుకైనా.. ఆలియా-రణ్‌బీర్‌ జంట ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’కు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే ఈ క్యూట్‌ కపుల్‌ ఇన్నాళ్లూ తమ మాటలు, చేతలతో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బయటపెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ వివాహబంధంతో తమ ప్రేమను శాశ్వతం చేసుకునేందుకు రడీ అవుతున్నారు.

ఐదు రోజుల పెళ్లి!

ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకలు ఐదు రోజుల పాటు జరగనున్నాయని చెబుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 13న మెహెందీ, సంగీత్‌తో మొదలై.. ఏప్రిల్‌ 14న వివాహం, ఆపై మరో మూడు రోజులు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారట! ఇక వీరి వివాహానికి ముంబయి చెంబూర్‌లోని ఆర్కే హౌజ్‌ వేదిక కానుంది. గతంలో అదే వేదికపై రణ్‌బీర్‌ అమ్మానాన్నలు నీతూ కపూర్‌-రిషీ కపూర్‌ల పెళ్లి జరిగింది. దీంతో సెంటిమెంట్‌గా ఈ నవ జంట కూడా ఇదే వేదికను ఫిక్స్‌ చేసుకున్నారట! ఇక సాధారణంగానే ఫ్యాషన్‌ డిజైనర్లు సబ్యసాచి, మనీష్‌ మల్హోత్రా అవుట్‌ఫిట్స్‌ని ఇష్టపడే ఆలియా.. తన పెళ్లి కోసం కూడా వీళ్లిద్దరినే సంప్రదించనున్నట్లు టాక్‌. ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌, ఇతర ప్రముఖులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారీ క్యూట్‌ కపుల్.

11 ఏళ్లకే ప్రేమ పుట్టింది!

ఆలియా-రణ్‌బీర్‌ల ప్రేమ విషయానికొస్తే.. ఆలియానే నాలుగాకులు ఎక్కువ చదివిందని చెప్పచ్చు. ఎందుకంటే తన ఇష్టసఖుడి గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్మొహమాటంగా బయటపెడుతుంటుందీ ముద్దుగుమ్మ.

‘చిన్నతనంలోనే తెరపై రణ్‌బీర్‌ను చూసి ఇష్టపడ్డా. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మీకు మరో నిజం చెప్పనా..? నా మనసులో ఎప్పుడో అతడితో మూడు ముళ్లు వేయించుకున్నా. బర్ఫీ సినిమా చూశాక అతడిపై మరింత ప్రేమ పెరిగింది. అతడే నా బిగ్గెస్ట్‌ క్రష్‌..’ అంటోందీ బాలీవుడ్‌ అందం. అయితే అప్పటికే రణ్‌బీర్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఆలియా తన పదకొండేళ్ల వయసులో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లింది. అక్కడే తొలిసారి తన కలల రాకుమారుడిని కలిసింది. ఇక ఆ తర్వాత తన మొదటి సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ మీడియా సమావేశంతో పాటు ‘కాఫీ విత్‌ కరణ్‌’.. ఇలా రణ్‌బీర్‌పై తనకున్న ప్రేమను తెలియజేయడానికి ఆలియా ఎదురుచూడని సందర్భమంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు.

అతడి ‘బ్రహ్మాస్త్రం’తో..!

అయితే అప్పటిదాకా తమ మనసులో దాచుకున్న ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోకపోయినా.. 2017లో చిత్రీకరణ ప్రారంభమైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో ఆలియా-రణ్‌బీర్‌లు మరింత దగ్గరయ్యారని చెప్పచ్చు. ఫిల్మ్‌ మేకర్‌ అయాన్‌ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆలియాతో ప్రేమలో పడిపోయానని చెబుతున్నాడీ హ్యాండ్‌సమ్‌ హీరో.

‘నేను కాస్త మిత భాషిని. ఆలియా నటన, తనతో కలిసి పనిచేస్తున్న క్రమంలో తన మంచి మనసు నాకెంతో నచ్చాయి. నేను నా జీవితంలో ఏ ప్రేమ కోసమైతే వెతుకుతున్నానో అది ఆలియా ద్వారా నాకు దొరికింది. మా బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలి.. అందుకు మాక్కాస్త ప్రైవసీ కావాలి..’ అంటూ తనతో ఆలియా ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడీ రొమాంటిక్‌ హీరో.

హనీమూన్‌.. అక్కడేనట!

అయితే అప్పటిదాకా ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం బయటికి పొక్కినా.. ఇద్దరూ కలిసి తొలిసారి మీడియాకు కనిపించింది మాత్రం 2018లో సోనమ్‌-ఆనంద్‌ల వివాహ రిసెప్షన్‌లోనే అని చెప్పచ్చు. ఇక అప్పట్నుంచి లంచ్‌, డిన్నర్‌, డేట్స్‌, ఫ్యామిలీ పార్టీలు, ప్రముఖుల సెలబ్రేషన్స్‌.. ఇలా వేడుక, వేదిక ఏదైనా చెట్టపట్టాలేసుకొనే దర్శనమిస్తున్నారీ లవ్లీ పెయిర్‌. అంతేకాదు.. వీలు చిక్కినప్పుడల్లా ప్రపంచాన్ని చుట్టొచ్చే ఈ అందాల జంట.. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఈ తరం జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు కూడా నేర్పుతున్నారు. సాధారణంగానే హాలిడేని ఇష్టపడే ఈ ముద్దుల జంట.. పెళ్లి తర్వాత తమకిష్టమైన దక్షిణాఫ్రికాకు హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్నారట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని