అప్పుడు ఆ సమస్యతో నాతో నేనే మౌన పోరాటం చేశా!

ఎంత అందంగా, నాజూగ్గా ఉన్నా.. తమ శరీరాకృతి విషయంలో ఇంకా ఏదో చిన్న లోపం ఉందనుకుంటారు చాలామంది. ఇతరులతో పోల్చుకుంటూ లోలోపలే మథనపడుతుంటారు. నిజానికి దీనివల్ల మానసిక సంఘర్షణ తప్ప మరే ప్రయోజనం లేదంటోంది బాలీవుడ్‌ అందం ఆలియా భట్‌. ఒకానొక సమయంలో తానూ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నానని, వీటి నుంచి....

Published : 12 Mar 2022 12:39 IST

ఎంత అందంగా, నాజూగ్గా ఉన్నా.. తమ శరీరాకృతి విషయంలో ఇంకా ఏదో చిన్న లోపం ఉందనుకుంటారు చాలామంది. ఇతరులతో పోల్చుకుంటూ లోలోపలే మథనపడుతుంటారు. నిజానికి దీనివల్ల మానసిక సంఘర్షణ తప్ప మరే ప్రయోజనం లేదంటోంది బాలీవుడ్‌ అందం ఆలియా భట్‌. ఒకానొక సమయంలో తానూ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నానని, వీటి నుంచి బయటపడడానికి థెరపీ కూడా తీసుకున్నానంటోంది. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడమొక్కటే దీనికి సరైన మందు అని చెబుతోంది.

ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉండడం ఆలియాకు అలవాటు! అయితే కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. తన శరీరాకృతి విషయంలో తాను మౌనపోరాటమే చేశానని చెబుతోందీ ముద్దుగుమ్మ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తన శరీరాకృతి విషయంలో తానెదుర్కొన్న సమస్యలు, వాటి నుంచి బయటపడిన తీరును వివరించింది. అంతేకాదు.. ‘మనకు మనం ఎలా ఉన్నా అంగీకరిస్తే ప్రశాంతంగా ఉండచ్చం’టూ ఈ కాలపు అమ్మాయిల్లో బాడీ పాజిటివిటీని నింపింది.

దానివల్లే ఒత్తిడికి లోనయ్యా!

‘ఎంతో ఇష్టంతో సినిమాల్లోకి ప్రవేశించిన నేను.. సినీ ప్రేక్షకుల్ని మెప్పించాలని ఆరాటపడేదాన్ని. కెమెరా ముందు కనిపించాలి కాబట్టి నేను తీసుకునే ఆహారం, నా బరువు, ఎదుటివారికి నేను ఎలా కనిపిస్తున్నానన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేదాన్ని. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నా. లాక్‌డౌన్‌కి ముందు వరకూ ఇలాంటి సమస్యలు నన్ను వెంటాడేవి. అయితే దీన్నుంచి బయటపడడానికి లాక్‌డౌన్‌ సరైన సమయం అనిపించింది. అందుకే అప్పుడే మూడు నెలల పాటు ఆన్‌లైన్‌ థెరపీ క్లాసులకు హాజరయ్యా. వారానికి ఒక సెషన్‌ చొప్పున మూడు నెలలు ఈ థెరపీ కొనసాగింది. ఇక ఈ మానసిక చికిత్స ఎప్పుడు మొదలైందో అప్పట్నుంచి నాలో మార్పు రావడం ప్రారంభమైంది.

నచ్చినవి తింటున్నా.. కానీ!

మనసులోని ఒత్తిళ్లు తొలగిపోయి ప్రశాంతంగా మారడం గమనించాను. వ్యాయామాలు చేయడం, నా శరీరాన్ని నేను ప్రేమించుకోవడం, ప్రతికూల ఆలోచనలు అదుపు చేసుకోవడం.. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి అలవడ్డాయి. నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడూ మనసు సంతోషపడుతుంది. అందుకే తినాలనిపించినప్పుడల్లా పెసరపప్పు హల్వా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాగించేస్తా. ఇక నన్ను నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌ వ్యాయామాలు ఎలాగో చేస్తాననుకోండి! నేననే కాదు.. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు తమ శరీరాకృతి విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. సోషల్‌ మీడియా సంస్కృతి వచ్చాక ఇది మితిమీరిపోయింది. అయితే ఇతరుల్ని మెప్పించడానికి మిమ్మల్ని మీరుగా చూపించే ఫొటోల్ని ఎడిట్‌ చేసి మరీ పోస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించండి.. మీ శరీరాన్ని ప్రేమించుకోండి.. మనసు చెప్పింది విని.. శరీరంపై ఒత్తిడి పెట్టకుండా ఉంటే నిరంతరం హ్యాపీగా ఉండచ్చు..’ అంది ఆలియా.

ప్రస్తుతం ‘గంగూబాయి కథియావాడి’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోన్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతేకాదు.. ఇటీవలే ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే హాలీవుడ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌కి సంతకం చేసిందీ క్యూటీ. తద్వారా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్