RRR : ఆ ఒక్క సీన్‌ ఏడాదిన్నర పాటు నేర్చుకున్నా!

‘కొత్త ప్రయోగాలు చేస్తేనే కొత్త విషయాలు నేర్చుకోగలం.. అదే విధంగా నేటివిటీకి భిన్నమైన చిత్రాల్లో నటించినప్పుడే కొత్త అనుభవాలు మూటగట్టుకోగలం..’ అంటోంది బాలీవుడ్‌ అందాల భామ ఆలియా భట్‌. ‘RRR’ సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తొలి సినిమాకే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బోలెడన్ని విషయాలు.....

Published : 06 Apr 2022 15:35 IST

‘కొత్త ప్రయోగాలు చేస్తేనే కొత్త విషయాలు నేర్చుకోగలం.. అదే విధంగా నేటివిటీకి భిన్నమైన చిత్రాల్లో నటించినప్పుడే కొత్త అనుభవాలు మూటగట్టుకోగలం..’ అంటోంది బాలీవుడ్‌ అందాల భామ ఆలియా భట్‌. ‘RRR’ సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తొలి సినిమాకే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది.. ఎన్నో ‘తొలి’ అనుభవాలు తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని చెబుతోంది. వాటన్నింటినీ రంగరించి ‘The first of many on RRR’ పేరుతో ఓ వీడియో రూపొందించి తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసిందీ చక్కనమ్మ. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

‘RRR’.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోందీ చిత్రం.. చిత్ర పరిశ్రమలో మరెన్నో పూర్వ రికార్డులు బద్దలు కొడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా.. సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే! ఇది తనకు తొలి తెలుగు చిత్రం కాగా.. దక్షిణాదిన తాను నటించిన మొదటి సినిమా కూడా ఇదే!

ఈ అనుభవాలు.. మధుర జ్ఞాపకాలు!

అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో తాను భాగమైనందుకు గర్వంగా ఉందంటోంది ఆలియా. ఈ క్రమంలో తనకెదురైన ‘తొలి’ అనుభవాలను ‘The first of many on RRR’ పేరుతో ఓ వీడియో రూపంలో పంచుకుంది.
‘నేను దక్షిణాదిన నటించిన తొలి సినిమా RRR. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో నేను నేర్చుకొన్న కొన్ని విషయాలు, నా తొలి అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా.

* ఈ సినిమా కోసం నేను మొదటిసారి తెలుగు నేర్చుకున్నా.. తెలుగులో మాట్లాడా!

* షోలే (తెలుగులో ఎత్తర జెండా) పాట చిత్రీకరణ సమయంలో నాకు ఆ పాట లిరిక్స్‌ తెలియదు.. ఎందుకంటే వాటిని చాలా గోప్యంగా ఉంచడంతో ముందు ప్రాక్టీస్‌ చేసే అవకాశం రాలేదు. దాంతో అటు డ్యాన్స్‌ చేస్తూ, ఇటు పాట లిరిక్స్‌ ఏకకాలంలో నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది కూడా ఈ సినిమా నాకు అందించిన మరో మధురమైన జ్ఞాపకం!

* RRR సెట్‌లో నేను తొలిసారి బిరియానీ తిన్నాను. సెట్‌లో బిరియానీ తినడం నా సినీ కెరీర్‌లో బహుశా ఇదే మొదటిసారి కాబోలు!

* ఒకే సీన్‌ని ఏడాదిన్నర కాలం పాటు నేర్చుకున్నా.. ఎందుకంటే లాక్‌డౌన్‌ వల్లే (నవ్వుతూ)! నిజానికి ఈ సీన్‌ని ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాక కరోనా కారణంగా అందరం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాం. దాంతో నెలలో పూర్తి కావాల్సిన ఈ సీన్‌ షూటింగ్‌కి ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది. సో.. నేను కూడా అన్ని రోజులు దీన్ని సాధన చేస్తూనే గడిపా (నవ్వుతూ)!

* మొదటిసారి నా జుట్టుకు నాలుగు సార్లు కలర్‌ వేసుకోవాల్సి/మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే RRR లో నా జుట్టు పూర్తి నలుపు రంగులో ఉండాలి.. ఇదే సమయంలో మరో సినిమా చిత్రీకరణలోనూ పాల్గొనాల్సి వచ్చింది. దానికోసం లైట్‌ కలర్‌ లేదా ఇతర రంగులు ప్రయత్నించాల్సి వచ్చేది. సినిమా కోసం నేను ఇలా పలు మార్లు జుట్టు రంగులు మార్చడం ఇదే తొలిసారి!

* ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు రాజమౌళి అమర్‌ చిత్ర కథా (భారతీయ చరిత్ర, పురాణాలు, సాహిత్య కథలు) స్టోరీస్‌ చెప్పేవారు. షాట్స్‌ మధ్యమధ్యలో ఆయన చెప్పే ఈ కథలు ఎంతో ఆసక్తికరంగా అనిపించేవి.. అలసటను దూరం చేసి నూతనోత్సాహాన్ని నింపేవి.

* ఈ సినిమా ప్రమోషన్స్‌ సమయంలోనూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అభిమానుల కోసం పెద్ద ఎత్తున నిర్వహించే ఈవెంట్లు, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యే విధానం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలే ఉన్నాయి..’ అంటూ ఈ సినిమా సక్సెస్‌ సంతోషాన్ని పలు జ్ఞాపకాల రూపంలో పంచుకుంది ఆలియా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఒక్క రోజులోనే 3.29 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

‘RRR’ కంటే ముందు ‘గంగూబాయి కథియావాడి’తో విజయాన్ని అందుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’, ‘డార్లింగ్స్‌’, ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’.. వంటి ప్రాజెక్టులున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్