Alia Bhatt: పెళ్లి, పిల్లలు.. కెరీర్‌కి ఆటంకం కాదు!

ఓవైపు వృత్తిధర్మం, మరోవైపు అమ్మతనం.. ఈ రెండింట్లో దేన్నీ వదులుకోవడానికి ఇష్టపడరు మహిళలు. అందుకే గర్భం దాల్చినా.. అటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూనే, ఇటు తమకు అప్పగించిన బాధ్యతల్నీ పూర్తి చేస్తుంటారు. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బాలీవుడ్‌....

Updated : 03 Jan 2023 20:09 IST

(Photos: Instagram)

ఓవైపు వృత్తిధర్మం, మరోవైపు అమ్మతనం.. ఈ రెండింట్లో దేన్నీ వదులుకోవడానికి ఇష్టపడరు మహిళలు. అందుకే గర్భం దాల్చినా.. అటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూనే, ఇటు తమకు అప్పగించిన బాధ్యతల్నీ పూర్తి చేస్తుంటారు. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బాలీవుడ్‌ అందాల తార ఆలియా భట్‌. చాలామంది సెలబ్రిటీల్లాగే.. ప్రెగ్నెన్సీలోనూ షూటింగ్స్‌, ప్రమోషన్స్‌కి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తొలి త్రైమాసికంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నానంటోంది. అయినా శరీరానికి సౌకర్యంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు సాగానని చెబుతోంది. ఇలా గర్భిణిగా ఉన్నప్పుడు వర్క్‌-లైఫ్ బ్యాలన్స్‌ చేసే క్రమంలో తనకెదురైన అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది ఆలియా.

గర్భం ధరించిన తొలి త్రైమాసికంలో వాంతులు, వేవిళ్లు, నీరసం.. వంటి చిన్న చిన్న అనారోగ్యాలు తలెత్తడం సహజం. ఇలాంటి సమయంలో పని నుంచి కొన్నాళ్లు విరామం తీసుకున్నా.. ఆ తర్వాత తమ ఆరోగ్య స్థితిని బట్టి చాలామంది మహిళలు, సెలబ్రిటీలు వృత్తిలో కొనసాగడం మనం చూస్తుంటాం. గతేడాది నవంబర్‌లో రాహా అనే పాపకు జన్మనిచ్చిన ఆలియా కూడా ఇదే చేశానంటోంది.

పరిమితులు పెట్టుకోవాలనుకోలేదు!

గర్భధారణ సమయంలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంతమంది కొన్ని విషయాల్లో తమను తాము నియంత్రించుకుంటారు. పలు పరిమితులు విధించుకుంటారు. నేను మాత్రం నా శరీరం సహకరించినంత వరకు ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా ముందుకెళ్లాలని ముందే నిర్ణయించుకున్నా. నేను వేసే ప్రతి అడుగూ నా శరీరానికి సౌకర్యంగా ఉండేలా చూసుకునేదాన్ని. పనికి ఎంత ప్రాధాన్యమిచ్చేదాన్నో.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు, నా ఆరోగ్యానికీ అంతే ప్రాముఖ్యతనిచ్చేదాన్ని. అదృష్టవశాత్తూ నా శరీరం ఈ విషయంలో నన్నెప్పుడూ వెనక్కి లాగలేదు. అయితే గర్భం ధరించిన తొలి వారాల్లో మాత్రం వాంతులు, వికారం, తీవ్రమైన అలసటను ఎదుర్కొన్నా. నిజానికి ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు సహజం.. కాబట్టి వీటిని సీరియస్‌గా తీసుకోకుండా నా శరీరం చెప్పింది వింటూ ముందుకు సాగా. షూటింగ్‌ మధ్యలో మరీ నీరసంగా అనిపిస్తే.. నా వ్యాన్‌లోకెళ్లి కాసేపు కునుకు తీసేదాన్ని. ఇక ఆ సమయంలో నా తొలి హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ షూటింగ్‌ జరుగుతోంది. గర్భిణిగా ఉన్నా.. ఈ చిత్ర బృందం మద్దతు వల్ల ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొనగలిగా. ఇలా శరీరం సౌకర్యవంతంగా ఉన్నప్పుడే మనసూ ప్రశాంతంగా ఉంటుంది.. అప్పుడే పనినీ సమర్థంగా పూర్తిచేయగలుగుతాం..’ అంటోందీ అందాల అమ్మ.

పిజ్జా తినాలనిపించేది!

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రత్యేకించి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని కోరిక కలగడం సహజం. అలా తనకు పిజ్జాల పైకి మనసు లాగేదంటోంది ఆలియా. ‘ప్రెగ్నెన్సీలో నాకు పిజ్జాలు ఎక్కువగా తినాలనిపించేది. అందుకే రెండో త్రైమాసికంలో దాదాపు రోజూ పిజ్జా తినేదాన్ని. అయితే అది కూడా ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రత్యేకంగా తయారుచేయించుకొని మరీ తినేదాన్ని. దీంతో పాటు బెర్రీ పండ్లు, డ్రైఫ్రూట్స్‌ జతచేసిన ఓట్‌మీల్‌నూ రోజూ తీసుకునేదాన్ని. ఇలా ఆ తొమ్మిది నెలలు ఆహారంతో పాటు ఫిట్‌నెస్‌కూ సమప్రాధాన్యమిచ్చా. ఈ క్రమంలో నడక, ఈతను నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగం చేసుకున్నా..’ అంటూ తన ప్రెగ్నెన్సీ సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ న్యూ మామ్.

మనసు మాటే వింటా!

పెళ్లి, పిల్లలు.. వంటివి కెరీర్‌లో వెనకబడేలా చేస్తాయనుకుంటారు చాలామంది. అందుకే కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వీటిని వాయిదా వేస్తుంటారు. కానీ వీటి ప్రభావం కెరీర్‌పై ఉంటుందని తాను మాత్రం నమ్మనంటోంది ఆలియా.
‘జీవితంలో తప్పొప్పులనేవి ఏవీ ఉండవు. మన విషయంలో వర్కవుట్‌ అయ్యేవి ఇతరుల విషయంలో కాకపోవచ్చు. జీవితం మనం అనుకున్నట్లుగా సాగదు.. అది నిర్ణయించిన దారిలోనే మనం వెళ్లాలి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా.. నేను మాత్రం నా మనసు చెప్పిందే వింటా. నా కెరీర్‌ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకున్నా, తల్లినయ్యా. అయినా ఈ రెండూ కెరీర్‌పై ప్రభావం చూపిస్తాయని ఎవరు చెప్పారు? నేను మాత్రం దీన్ని నమ్మను. ఒకవేళ అలా మార్పులు జరిగినా నేను బాధపడను. పైగా ఈ సమయంలో నేను ఓ పాపకు తల్లినైనందుకు గర్వపడుతున్నా. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయం అమ్మను కావాలనుకోవడం. ప్రస్తుతం అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నా. మరోవైపు నటిగానూ సంతృప్తిగా ఉన్నా. మనం నిజాయతీగా కష్టపడితే.. అవకాశాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ రాకపోయినా అది నా సమయం కాదని మిన్నకుండిపోతానే తప్ప.. అవకాశాలు రావట్లేదని అస్సలు బాధపడను. ప్రతి క్షణం పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తా.. మనసు మాట విన్నప్పుడే ఇంత సానుకూలంగా ఆలోచించగలం..’ అంటూ ఈ తరం తల్లుల్లో స్ఫూర్తి నింపింది ఆలియా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్