Singer Alka Yagnik: ఒక రోజు సడన్‌గా వినికిడి శక్తిని కోల్పోయా..!

అల్కా యాగ్నిక్‌.. సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆమె.. తన గాత్ర మాధుర్యంతో నాలుగు దశాబ్దాల పాటు సంగీత ప్రియుల్ని ఓలలాడించారు. అద్భుతమైన మెలొడీలతో తెలుగు వారినీ పలకరించారు.

Published : 22 Jun 2024 12:30 IST

(Photos: Instagram)

అల్కా యాగ్నిక్‌.. సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆమె.. తన గాత్ర మాధుర్యంతో నాలుగు దశాబ్దాల పాటు సంగీత ప్రియుల్ని ఓలలాడించారు. అద్భుతమైన మెలొడీలతో తెలుగు వారినీ పలకరించారు. అలాంటి గాయని సడన్‌గా తాను వినికిడి శక్తిని కోల్పోయినట్లు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టేసరికి ఫ్యాన్స్‌ షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలోనే ఓవైపు ఈ సమస్యకు కారణమేంటో వివరిస్తూనే.. మరోవైపు వినికిడి లోపం తలెత్తకుండా పాటించాల్సిన పలు చిట్కాల్నీ పంచుకున్నారామె. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

గాత్రంతో మాయ చేసి..!

తెలుగులో మన చిత్ర ఎలాగో.. బాలీవుడ్‌లో అల్కా యాగ్నిక్‌ అలా! సంగీతంపై మక్కువతో ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలుపెట్టిన ఆమె.. నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ సంగీత ప్రపంచాన్ని శాసించారు. ఏ సినిమా అయినా.. అది సింగిల్‌ అయినా, డ్యూయెట్‌, రొమాంటిక్‌ పాటైనా అల్కానే పాడాలి అనేలా తన గాత్ర మాధుర్యంతో మాయ చేశారామె. ‘ఏక్‌ దో తీన్‌’, ‘దేఖా హై పెహ్లీ బార్‌’, ‘ఐసీ దివాన్‌గీ’, ‘కహో నా ప్యార్‌ హై’, ‘తాల్‌ సె తాల్‌ మిలా’.. వంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆమె.. తెలుగులో రెండు సినిమాల్లో నాలుగు పాటలు ఆలపించారు. ఇప్పటివరకు 25 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన ఆమె.. లతా మంగేష్కర్‌, ఆశా భోస్లే తర్వాత అత్యధిక సోలో సాంగ్స్‌ పాడిన మూడో మహిళా సింగర్‌గా కీర్తి గడించారు. ఏడుసార్లు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, రెండు జాతీయ పురస్కారాల్ని అందుకున్న అల్కా.. ప్రస్తుతం బుల్లితెరపై నిర్వహించే డ్యాన్స్‌ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

అప్పుడు నాకేమీ వినపడలేదు!

సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే అల్కా.. తన కెరీర్‌కు సంబంధించిన విషయాలే కాదు.. వ్యక్తిగత విషయాలూ ఈ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. అలా ఇటీవలే తానో ఆరోగ్య సమస్య బారిన పడ్డట్లు తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారామె. ఉన్నట్లుండి ఒక రోజు సడన్‌గా తాను వినికిడి శక్తిని కోల్పోయినట్లు ఇందులో పేర్కొన్నారు.

‘కొన్ని వారాల క్రితం విమానం దిగి నడుస్తున్నా. ఇదే సమయంలో ఉన్నట్లుండి వినికిడి శక్తిని కోల్పోయా. చుట్టూ ఎన్నో జరుగుతున్నా.. ఏ చిన్న శబ్దం కూడా నా చెవిని చేరలేదు. ఈ బాధను ఇన్నాళ్లూ నాలోనే దాచుకున్నా. కానీ ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నా. ఈ సమస్యను ‘సెన్సరీ న్యూరల్ నెర్వ్‌ హియరింగ్‌ లాస్‌’గా వైద్యులు నిర్ధరించారు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల సడన్‌గా ఇలా జరిగినట్లు వారు తేల్చారు. ఈ అరుదైన సమస్య గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. కానీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఎక్కువ సౌండ్‌తో సంగీతం వినకండి.. హెడ్‌ఫోన్స్‌ అధికంగా వాడకండి.. ఇదనే కాదు.. నా కెరీర్‌లో ఎదురైన ఇతర ఆరోగ్య సమస్యల గురించీ త్వరలోనే మీతో పంచుకుంటా. ఈ క్లిష్ట సమయంలో మీ అందరి సపోర్ట్‌ నాకు కావాలి. మీ ప్రేమాభిమానాలే నేను త్వరగా కోలుకొనేలా చేస్తాయని ఆశిస్తున్నా..’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారీ దిగ్గజ గాయని.

ఇలా అల్కా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా.. అందరూ స్పందిస్తూ తమ అభిమాన గాయని త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు.


ఏంటీ సమస్య? ఎందుకిలా?

‘సెన్సరీ న్యూరల్ నెర్వ్ హియరింగ్‌ లాస్‌’ అనేది చెవి లోపల శ్రవణ నాడి దెబ్బతినడం వల్ల వస్తుంది. వయసు పెరిగే కొద్దీ, వంశపారంపర్యంగా కొంతమందిలో ఈ సమస్య రావడం సహజమని నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొంతమందిలో పెద్ద శబ్దాల్ని వినడం, హెడ్‌ఫోన్స్‌ ఎక్కువగా ఉపయోగించడం, ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, కొన్ని రకాల మందులు, తలకు బలమైన గాయాలవడం.. వంటి పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇక కొంతమంది పిల్లల్లో పుట్టుకతో వచ్చే అసాధారణతల వల్ల కూడా ఈ తరహా వినికిడి లోపం రావచ్చట! ఇలాంటి వారు ఉన్నట్లుండి వినికిడి శక్తిని కోల్పోవడం, ఎదుటివారు మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం, చెవులు మూసుకుపోయినట్లుగా అనిపించడం, చెవుల్లో గుర్‌ర్‌ అనే శబ్దం వినిపించడం, మగతగా అనిపించడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్న వారిలో వినికిడిని తిరిగి పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని, కాకపోతే వినికిడి పరికరాల్ని అమర్చుకోవడం వల్ల కొంతవరకు శబ్దాల్ని వినగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


వినికిడి శక్తికి.. ఈ చిట్కాలు!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ‘సెన్సరీ న్యూరల్ నెర్వ్ హియరింగ్‌ లాస్‌’ సమస్య రాకుండా ముందే జాగ్రత్తపడడం మేలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

⚛ సంగీత ప్రదర్శనలు, రేసింగ్‌ ట్రాక్స్‌, డిస్కోలు, పార్టీల్లో ఉపయోగించే లౌడ్‌ స్పీకర్లు, ఎక్కువ సౌండ్‌తో ఇయర్‌ఫోన్స్‌ వినియోగించడం.. వంటివన్నీ శాశ్వతంగా వినికిడి శక్తిని దెబ్బతీసేవే! కాబట్టి ఇలాంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. రోజూ వినే ధ్వని తీవ్రత 85 డెసిబుల్స్‌ దాటకుండా ఉండేలా జాగ్రత్తపడాలి.

⚛ నిరంతరం చెవుల్లో ఇయర్‌ ఫోన్లు/బ్లూటూత్‌ పెట్టుకొని ఉండడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి అవసరమైనప్పుడే, అదీ తక్కువ సౌండ్‌తో వీటిని ఉపయోగించడం మేలు. మిగతా సమయాల్లో చెవి లోపలి భాగాలు విశ్రాంతి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు.

⚛ వినికిడి శక్తికి 60/60 రూల్‌ చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అంటే గంట పాటు శబ్దాల్ని వినే వారు.. ధ్వని తీవ్రత 60 డెసిబుల్స్‌ దాటకుండా జాగ్రత్తపడాలి. ఆపై కాసేపు విరామం తీసుకోవాలి.. ఈ క్రమంలో చెవి లోపలి భాగాలు తిరిగి పునరుత్తేజితమవుతాయి.

⚛ భారీ మెషినరీ సంస్థల్లో పనిచేసే వారు రోజూ అధిక శబ్దాల్ని వినాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ సౌండ్‌ను తట్టుకునేలా కస్టమైజ్‌ చేసిన వినికిడి సంరక్షణ ఉత్పత్తులు వాడాలి. వీటికి బదులు ఫోమ్‌ తరహా ఇయర్‌ ప్లగ్స్‌ వాడినా అంత ప్రభావవంతంగా పనిచేయవని చెబుతున్నారు నిపుణులు.

⚛ చెవుల్ని శుభ్రం చేసుకోవడానికి కొందరు ఇయర్‌ స్వాబ్స్‌, పిన్నులు, పేపర్‌ క్లిప్స్‌.. ఇలా చేతికొచ్చింది ఉపయోగిస్తుంటారు. దీనివల్ల కర్ణభేరికి రక్షణ కవచంలా ఉండే ఇయర్‌వ్యాక్స్‌ లోపలికి వెళ్లిపోయి చెవి లోపలి భాగాల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మెత్తటి వస్త్రంతో చెవుల్ని పైపైన శుభ్రం చేసుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

⚛ మనం చేసే రోజువారీ వ్యాయామాలు చెవి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం.. చెవి లోపలి భాగాలకు రక్తప్రసరణ మెరుగవడమేనట!

⚛ చెవి ఆరోగ్యానికి, వినికిడి శక్తికి.. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

⚛ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ద్రాక్ష, జామ, ఆప్రికాట్స్‌, పియర్స్‌, చెర్రీస్‌.. వంటి పండ్లతో పాటు.. టొమాటో తదితర కాయగూరల్నీ ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా కూడా చెవి ఆరోగ్యం, వినికిడి శక్తి మెరుగుపడతాయి.

⚛ చల్లటి వాతావరణం కూడా చెవి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటప్పుడు చెవులు కవరయ్యేలా స్కార్ఫ్‌ ధరించడం, ఇయర్‌ మాస్కులు వినియోగించడం తప్పనిసరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్