శృంగార జీవితాన్ని ఆనందమయం చేసే ‘సెక్స్‌ థెరపీ’!

లైంగిక జీవితం భార్యాభర్తల అనుబంధాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజుల్లో చాలా జంటలు వివిధ కారణాల వల్ల లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు తమ జీవిత కాలంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు పలు అధ్యయనాలు....

Updated : 12 Mar 2024 15:45 IST

లైంగిక జీవితం భార్యాభర్తల అనుబంధాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజుల్లో చాలా జంటలు వివిధ కారణాల వల్ల లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు తమ జీవిత కాలంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వైవాహిక జీవితాన్ని దెబ్బతీసే ఈ సున్నితమైన సమస్యను థెరపీతో పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఈ థెరపీ ఎవరికి అవసరం? లైంగిక కోరికల్ని పెంచడంలో దీని పాత్రేంటి? జంటలు దీన్నెలా పాటించాలి? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!

శృంగారం.. ఇది చాలా సున్నితమైన అంశం. జీవిత భాగస్వామితో చర్చించడానికే మొహమాటపడే ఈ అంశాన్ని నలుగురిలో ఎలా మాట్లాడగలుగుతాం? లైంగిక జీవితంలో సమస్యలొస్తే ముక్కూ మొహం తెలియని థెరపిస్ట్‌తో మనసు విప్పి ఎలా పంచుకోగలుగుతాం?.. అనుకుంటూ చాలామంది దంపతులు తమ లైంగిక సమస్యల్ని తమలోనే దాచుకుంటుంటారు. తద్వారా అటు లైంగిక జీవితాన్నీ, ఇటు వైవాహిక జీవితాన్నీ ఆస్వాదించలేకపోతారు. కానీ దాంపత్య బంధాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఈ మొహమాటాలు, బిడియాలు పక్కన పెట్టి సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలంటున్నారు నిపుణులు.

అసలేంటీ.. సెక్స్‌ థెరపీ?

లైంగిక థెరపీ గురించి అవగాహన లేకపోవడం, ఈ క్రమంలో తమకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తారోనన్న భయంతో చాలామంది థెరపిస్టుల్ని సంప్రదించడానికి వెనకాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ నిజానికి సెక్స్‌ థెరపీ ఒక టాక్‌ థెరపీ లాంటిది. అంటే.. మాటల ద్వారానే వ్యక్తిగతంగా లేదంటే జంటగా.. వాళ్లు ఎదుర్కొనే లైంగిక సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా, మానసికంగా, వ్యక్తిగతంగా.. ఇలా విభిన్న కోణాల నుంచి సమస్యల్ని పసిగట్టేందుకు ప్రయత్నిస్తారు నిపుణులు. వాటిని ఆధారంగా చేసుకొని తగిన పరిష్కార మార్గాల్ని సూచిస్తారు.

ఎవరికి అవసరం?

జంటలు లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోవడానికి వివిధ అంశాలు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒక్కరిలో లేదంటే ఇద్దరిలోనూ సమస్యలుండచ్చంటున్నారు. కోరికలు తగ్గిపోవడం లేదంటే మరీ ఎక్కువగా ఉండడం, ఆసక్తి లేకపోవడం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, లైంగిక పరమైన ఆలోచనలు మదిలోకి రాగానే ఒత్తిడికి గురవడం, బలవంతంగా కలయికలో పాల్గొనడం, శృంగారం అంటేనే భయపడడం, గతంలో అత్యాచారాలు వంటి చేదు అనుభవాలు ఎదురవడం.. ఇలాంటివన్నీ లైంగిక జీవితానికి అవరోధాన్ని కలిగించేవే! కాబట్టి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనే జంటలు తప్పనిసరిగా థెరపిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఈ క్రమంలో మీ సమస్యలతో పాటు వాళ్లు మీ లైంగిక జీవితానికి సంబంధించిన పూర్వ అనుభవాలు, లైంగిక విద్యపై మీకు ఎంతవరకు అవగాహన ఉంది?, శృంగారం విషయంలో మీకున్న నమ్మకాలు-అపోహలేంటి? తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే.. దాన్ని బట్టి థెరపీ మొదలుపెడతారు. కాబట్టి మీకున్న సమస్యల్ని పారదర్శకంగా నిపుణులతో పంచుకోవడం ముఖ్యం. అప్పుడే మీ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది.

మూడు సూత్రాలు!

సమస్యను బట్టి థెరపీ ఒక్కరికి అవసరమా? లేదంటే భార్యాభర్తలిద్దరికీ అవసరమా? అన్నది నిపుణులు నిర్ణయిస్తారు. ఆపై థెరపీ ఇచ్చే క్రమంలో ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తారు.

అవగాహనతో మొదలు!

లైంగిక అంశాలకు సంబంధించి చాలామందికి పెళ్లయ్యాకే అవగాహన మొదలవుతుంది. పెరిగి పెద్దయ్యే క్రమంలో వీటి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. నిజానికి ఇదీ దంపతుల లైంగిక జీవితాన్ని దెబ్బతీసే అంశమే అంటున్నారు నిపుణులు. కానీ చిన్నప్పట్నుంచే ఈ సున్నితమైన విషయాన్ని సానుకూలంగా బోధిస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు తప్పుతాయంటున్నారు. అందుకే సెక్స్‌ థెరపీలో భాగంగా లైంగిక అంశాలకు సంబంధించిన అవగాహన పెంపొందించడంతో చికిత్స మొదలుపెడతారు నిపుణులు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన కొన్ని కథనాలు చదవమని, వీడియోలు చూడమని సలహాలివ్వడం; శరీరం గురించి అవగాహన పెంచుకోవడానికి కొన్ని రకాల యాక్టివిటీలు సూచించడం.. వంటివి ఇందులో ముఖ్యమైనవి. తద్వారా లైంగిక అంశాల పట్ల అవగాహన పెరుగుతుంది.. ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది.

కమ్యూనికేషన్‌ పెంచేలా..!

కమ్యూనికేషన్‌ ఎంత ఎక్కువగా ఉంటే అనుబంధం అంత దృఢంగా ఉంటుంది. కానీ శృంగారం విషయానికొచ్చేసరికి చాలా జంటల్లో ఇది తగ్గిపోతుంది. కారణం.. సిగ్గు, మొహమాటం, తమ కోరికలు చెప్తే అవతలి వాళ్లు ఏమనుకుంటారోనన్న భయం.. వంటివన్నీ అడ్డుపడుతుంటాయి. జంటలు ఈ సమస్యను అధిగమించాలంటే మానసికంగా దృఢంగా మారడమొక్కటే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సిగ్గు, బిడియం పక్కన పెట్టి.. నిర్మొహమాటంగా మనసులోని కోరికను పంచుకోవడం, అవతలి వారి కోరికల్నీ గౌరవించడం, లైంగిక పరమైన విషయాల గురించి చర్చించడం, ఇద్దరూ కలిసి రొమాంటిక్‌ కథలు చదవడం-సినిమాలు చూడడం.. వంటివన్నీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేవే.

ఈ వ్యాయామాలు!

లైంగిక అంశాలపై అవగాహన పెంచుకొని, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కూడా తగ్గితే.. ఇద్దరూ తమ లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి దాదాపు సన్నద్ధమైనట్లే అంటున్నారు నిపుణులు. అయినా వాళ్ల మధ్య లైంగికాసక్తిని మరింతగా పెంచడానికి కొన్ని రకాల వ్యాయామాలు సూచిస్తారు థెరపిస్టులు. జంటలు ఒకరి శరీర భాగాల్ని మరొకరు రొమాంటిక్‌గా తాకుతూ చేసే విభిన్న వ్యాయామాలివి. పది నిమిషాలు మొదలు దాదాపు గంట దాకా కొనసాగే ఈ వ్యాయామాల వల్ల.. ఇద్దరి మధ్యా బిడియం పోయి, చనువు పెరిగి శృంగార జీవితానికి సిద్ధం కావడానికి అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే లైంగిక పరంగా ఇద్దరిలో ఉండే అభద్రతా భావాలు-ఆత్మన్యూనత తగ్గడంతో పాటు శృంగారం విషయంలో మానసికంగానూ దృఢంగా తయారవుతారు. తద్వారా లైంగిక జీవితాన్నీ ఆస్వాదించగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్