Cloud Skin : ఈ మేకప్‌ ట్రెండ్‌ గురించి తెలుసా?

మేకప్‌ అంటే పైపై పూత అనుకుంటాం.. కానీ ఇదే మేకప్‌తో చర్మానికి లోలోపలి నుంచి మెరుపునూ అందించచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘క్లౌడ్‌ స్కిన్‌’ కూడా అలాంటి ఓ మేకప్‌ ట్రెండే అని చెబుతున్నారు. నిజానికి ఇది కొరియన్‌ బ్యూటీ ట్రెండే అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేకప్‌ లవర్స్‌ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

Updated : 30 Aug 2021 20:09 IST

మేకప్‌ అంటే పైపై పూత అనుకుంటాం.. కానీ ఇదే మేకప్‌తో చర్మానికి లోలోపలి నుంచి మెరుపునూ అందించచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘క్లౌడ్‌ స్కిన్‌’ కూడా అలాంటి ఓ మేకప్‌ ట్రెండే అని చెబుతున్నారు. నిజానికి ఇది కొరియన్‌ బ్యూటీ ట్రెండే అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేకప్‌ లవర్స్‌ని విపరీతంగా ఆకర్షిస్తోంది. సహజమైన లుక్‌ని అందించడం దీని ప్రత్యేకత! అంతేకాదు.. హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్న ఈ కాలంలోనూ ఇది ముఖానికి పర్‌ఫెక్ట్‌ లుక్‌నిస్తుంది.. అందుకే చాలామంది మేకప్‌ లవర్స్‌ క్లౌడ్‌ స్కిన్‌కే ఓటేస్తున్నారు. మరి, ఇంతకీ ఏంటీ మేకప్‌ ట్రెండ్‌? దీన్నెలా వేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఏంటీ ‘క్లౌడ్‌ స్కిన్’?

సాధారణంగా వాతావరణం కాస్త వేడిగా ఉన్నా, హ్యుమిడిటీతో కూడుకున్నా.. చెమటలు వచ్చి వేసుకున్న మేకప్‌ అంతా చెదిరిపోవడం మనలో చాలామందికి అనుభవమే! అయితే క్లౌడ్‌ స్కిన్‌తో ఆ సమస్య ఉండదంటున్నారు నిపుణులు. పేరుకు తగినట్లుగానే మెరిసే మేఘాన్ని తలపిస్తుందీ మేకప్‌. అంటే సూర్యకిరణాల్ని కమ్మేసిన మబ్బులు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాయో.. ఈ మేకప్‌ వేసుకున్నాక ముఖమూ అంతే కాంతివంతంగా కనిపిస్తుందని దీని అర్థం! లైట్‌వెయిట్‌గా కనిపించే ఈ మేకప్‌ లుక్‌ హ్యుమిడిటీలోనూ పర్‌ఫెక్ట్‌ లుక్‌ని అందిస్తుంది. అంతేకాదు.. మేకప్‌కి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే హైలైటర్‌నూ ఇందులో వాడాల్సిన అవసరం లేదు. అయితే ఇందుకోసం మనం ఎంచుకునే మేకప్‌ ఉత్పత్తులు ఎంత నాణ్యమైనవైతే లుక్‌ అంతగా ఇనుమడిస్తుందంటున్నారు నిపుణులు.

ఎలా వేసుకోవాలి?

సాధారణ మేకప్‌ వేసుకున్నట్లే ఈ క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ వేసుకునే క్రమంలోనూ కొన్ని స్టెప్స్‌ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఒక్కో స్టెప్‌కి మధ్యలో కొన్ని నిమిషాల పాటు గ్యాప్‌ ఇవ్వాలి. తద్వారా ఆయా ఉత్పత్తులు చర్మంలోకి బాగా ఇంకి న్యాచురల్‌ లుక్‌ని అందించడంతో పాటు, చర్మం లోలోపలి నుంచి కాంతివంతంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

* ముందుగా ముఖాన్ని మాయిశ్చరైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం హైడ్రోఅల్యురోనికామ్లం సీరమ్‌ను రాసుకొని కొద్దిసేపు మర్దన చేయాలి. తద్వారా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

* ఇప్పుడు మీ చర్మతత్వాన్ని బట్టి ఎంచుకున్న కొన్ని చుక్కల ఫేషియల్‌ ఆయిల్‌ను మునివేళ్లతో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తేమగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే ఇది కచ్చితంగా రాసుకోవాలన్న నియమమేమీ లేదు.. వద్దనుకున్న వాళ్లు దీన్ని వదిలేయచ్చు.

* ఆపై ఫౌండేషన్‌ను అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఫౌండేషన్‌ బ్రష్‌ని ఉపయోగించచ్చు. అది కూడా చాలా పలుచటి పొరలాగా వేసుకుంటేనే లుక్‌ సహజంగా కనిపిస్తుంది. లేదు.. మాకు ముఖంపై మచ్చలు, ముడతలు ఉన్నాయనుకున్న వారు దీనిపై కన్సీలర్‌ని రాసుకొని వాటిని కవర్‌ చేసుకోవచ్చు.

* ఇక ఆఖరుగా కాంపాక్ట్‌ పౌడర్‌ని రాసుకోవాలి. అది కూడా ఎంత తక్కువగా అప్లై చేసుకుంటే లుక్‌ అంతగా ఇనుమడిస్తుంది. ఈ క్రమంలో నుదురు-వెంట్రుకలు కలిసే చోట, ముక్కు వంపులు-కళ్ల దగ్గర, బుగ్గలు, గడ్డం.. వంటి ముఖ భాగాల్లో పౌడర్‌ సమానంగా పరచుకునేలా జాగ్రత్తపడాలి.

* కాస్త షైనీ లుక్‌ కావాలనుకున్న వారు షిమ్మరీ హైలైటర్‌ రాసుకోవచ్చు.. ఇలా మేకప్‌ వేసుకోవడం పూర్తయ్యాక పెదాలకు మీకు నప్పే లిప్‌స్టిక్‌, కళ్లకు కాజల్‌, మస్కారా.. వంటివి అప్లై చేసుకుంటే క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ పూర్తయినట్లే!

ఇలా ఈ మేకప్‌ అంతా పూర్తయ్యాక చూడ్డానికి ముఖం తెల్లటి మబ్బుల మాదిరిగా మసకగా, మృదువుగా కనిపిస్తుంది. మేకప్‌ వేసుకున్నా వేసుకోనట్లు సహజసిద్ధంగా కనిపించేలా చేయడం ఈ మేకప్‌ ప్రత్యేకత!

ఇవి గుర్తుపెట్టుకోండి!

* మేకప్‌ వేసుకునే ముందు మేకప్‌ బ్రష్‌లను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. చేతుల్ని శుభ్రం చేసుకొని గ్లౌజులు ధరించాలి.

* ఈ మేకప్‌ కోసం ఉపయోగించిన ప్రతి వస్తువును ఎంత తక్కువగా ఉపయోగిస్తే లుక్‌ అంత న్యాచురల్‌గా కనిపిస్తుంది.

* క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ మనల్ని సహజసిద్ధంగా కనిపించేలా చేస్తుంది కాబట్టి.. ఈ క్రమంలో అధరాలకు కూడా న్యూడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకోవడం లేదంటే గ్లాసీ లిప్‌బామ్‌ ఉపయోగించడం, కళ్లను సింపుల్‌గా తీర్చిదిద్దుకోవడం.. వంటివి చేస్తే అసలు మేకప్‌ వేసుకున్నట్లే అనిపించదు.

* మేకప్‌ లుక్‌ ఇనుమడించాలంటే మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పోషకాహారానికి ప్రాధాన్యమివ్వడం, చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండడం, కంటి నిండా నిద్ర పోవడం.. వంటివి చేస్తే ముఖం ఉబ్బినట్లుగా కనిపించదు. తద్వారా మరింత అందంగా, షైనీగా కనిపించేయచ్చు.

మరి, మీకూ మేకప్‌ వేసుకోవడం ఇష్టమా? లేదంటే వృత్తిలో భాగంగా రోజూ మేకప్‌ వేసుకోవాల్సిందేనా? అయితే ఎప్పుడూ సాధారణ మేకపే కాకుండా.. అప్పుడప్పుడూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఈ క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ ట్రెండ్‌ని ఫాలో అయిపోండి! న్యాచురల్‌ బ్యూటీగా అందరి మన్ననలు అందుకోండి!

ఈ క్రమంలో మీకేమైనా సందేహాలుంటే నిపుణుల్ని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మేకప్‌ ఉత్పత్తుల వల్ల దుష్ప్రభావాలు ఎదురవకుండా ఉండాలంటే ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మాత్రం మర్చిపోవద్దు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్