Published : 29/01/2023 13:47 IST

Parenting: మీరూ ఇలాంటి పేరెంట్సేనా? అయితే మారాల్సిందే..!

తల్లిదండ్రులు పిల్లలతో ఎంత స్నేహంగా మెలిగితే.. వాళ్లు అన్ని విషయాలు అంత నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. ఈ విషయం తెలిసినా.. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయం తమకు నచ్చినట్లుగానే జరగాలనుకుంటారు. తద్వారా మానసిక సంతృప్తిని పొందుతారు. ఇలాంటి పేరెంటింగ్‌ స్టైల్‌నే ‘Codependent Parenting’ అంటారు. అయితే దీనివల్ల తల్లిదండ్రుల మాటెలా ఉన్నా.. పిల్లలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. మరి అదెలాగో తెలుసుకుందాం రండి..

ప్రతి విషయంలో పిల్లలపై అజమాయిషీ చెలాయించే తల్లిదండ్రులు ఇదంతా తమ పిల్లల మంచి కోసమే చేస్తున్నారనుకుంటారే తప్ప.. అసలు విషయాన్ని గుర్తించలేరని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాల్ని గ్రహిస్తే పేరెంట్స్‌ తమది Codependent Parenting అని సులభంగా గ్రహించగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

ఇలా గుర్తించచ్చు!

పిల్లల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకు.. వేసుకునే దుస్తుల దగ్గర్నుంచి చేసే పనుల దాకా.. ఎంచుకునే సబ్జెక్ట్‌ దగ్గర్నుంచి కెరీర్‌ దాకా మీకు నచ్చినట్లే జరగాలనుకోవడం!

అవసరం ఉన్నా, లేకపోయినా పిల్లల ప్రవర్తనను సరిదిద్దడం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? ‘మీ వల్లే ఈ టెన్షన్స్‌ అన్నీ.. కాస్త అర్థం చేసుకొని ఈ అల్లరి పనులు ఆపండి..’ అంటూ మీ భావోద్వేగాలకు వాళ్లను బాధ్యుల్ని చేయడం.. వంటివీ ఇలాంటి పేరెంటింగ్‌ కిందికే వస్తాయి.

పిల్లలకంటూ కొన్ని ఆలోచనలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా వాళ్లు ఎంచుకునే దారి సరైందో లేదోనన్న అనవసరమైన ఆందోళనకు గురవుతుంటారు తల్లిదండ్రులు. వాళ్ల ఆలోచనలు మార్చి తమకు అనుగుణంగా నడుచుకునేలా చేసుకోవాలనుకుంటారు.

సాధారణంగా పెద్దల గొడవలు పిల్లల దాకా రానివ్వకూడదంటారు నిపుణులు. కానీ Codependency Parents మాత్రం పిల్లల్ని పెద్దవారిలా భావించి.. తమ గొడవల్లో వాళ్లనూ ఇన్వాల్వ్‌ చేస్తుంటారట! ఈ క్రమంలో సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు వాళ్ల పైనా ఒత్తిడి తీసుకొస్తారట!

ఒకానొక సమయంలో రాళ్లలోనైనా చలనం రావచ్చేమో గానీ ఇలాంటి పేరెంట్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంటారట! అంటే తమ పిల్లల వైపు వాదన వినకుండా.. అన్ని విషయాల్లో తమదే కరక్ట్‌ అన్నట్లుగా మొండికేస్తుంటారట!

అప్పుడే కోపం ప్రదర్శించడం.. మరుక్షణమే సంతోషంతో ఉప్పొంగిపోవడం.. ఇలా తమకు అనుగుణంగా వెంటవెంటనే మూడ్‌ మార్చుకోవడంలో ఇలాంటి పేరెంట్స్‌ సిద్ధహస్తులట! ఇది కూడా ఓ రకంగా పిల్లల ఎమోషన్స్‌ని పట్టించుకోకపోవడమే అంటున్నారు నిపుణులు.

ఇదీ ఓ రకంగా హింసే!

సాధారణంగా ఏ పేరెంట్స్ అయినా తమ మాటలు, చేతలతో తమ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూడరు. కానీ తమకు తెలిసో, తెలియకో Codependency Parents చేష్టలు చిన్నారుల్ని శారీరకంగా, మానసికంగా ఎంతగానో కుంగదీస్తాయని చెబుతున్నారు నిపుణులు. దీని ప్రభావం వారి బంగారు భవిష్యత్తుపై పడుతుందంటున్నారు.

పిల్లలకంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మీరు పెత్తనం చెలాయించాలని చూస్తే వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. తద్వారా భవిష్యత్తులో మీరు మంచి చెప్పినా వారు వినేందుకు ఆసక్తి చూపించరు.

చిన్నారులకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌! పెద్దలు ఏం చేస్తే పిల్లలూ దాన్ని అనుకరిస్తుంటారు. అయితే ఇలా పెత్తనం చెలాయించే తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలూ భవిష్యత్తులో వాళ్లలాగే అజమాయిషీ చెలాయించేలా తయారవుతారట! తద్వారా అది వాళ్ల ప్రవర్తనకే ముప్పు తెచ్చిపెట్టచ్చు.

నాకు నచ్చిన కెరీర్‌నే ఎంచుకోవాలి..’, ‘నాకు నచ్చిన ఉద్యోగమే చేయాలి..’ అని మీ కలల్ని వారిపై రుద్దడం వల్ల.. వాళ్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారచ్చంటున్నారు నిపుణులు.

పరిష్కారముందా?!

కాబట్టి తెలిసో, తెలియకో తల్లిదండ్రులు తమ పిల్లలపై పెత్తనం చెలాయిస్తున్నా.. ఇకనైనా దీన్ని గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటే మీ చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందించచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పెత్తనం మాని వాళ్లకు ప్రేమను పంచమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో..

పేరెంట్స్‌ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగడం చాలా ముఖ్యం. అప్పుడే సంతోషమైనా, బాధైనా వాళ్లు మీతో సులభంగా పంచుకోగలుగుతారు.

ఒత్తిడిగా ఉండే వాతావరణంలో పెరిగే పిల్లల కంటే.. వాళ్ల ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువిచ్చి.. వాళ్లను సన్మార్గంలో నడిపిస్తేనే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో వాళ్ల పొరపాట్లేవైనా ఉంటే సరిదిద్దడమూ మీ బాధ్యతే అని గుర్తుపెట్టుకోండి.

కోపం మీకే కాదు.. పిల్లలకూ వస్తుంది.. అలాంటప్పుడు ‘వేలెడంత లేవు.. నాపైనే అరుస్తావా’ అని తిరగబడడం కాకుండా.. అసలు వాళ్ల కోపానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఆత్మన్యూనత వల్ల కూడా ఆ ఒత్తిళ్లను పిల్లలపై రుద్దుతుంటారు కొందరు తల్లిదండ్రులు. అందుకే అలాంటి ఆలోచనల నుంచి విముక్తి పొందాలంటే.. స్వీయ ప్రేమను పెంచుకోవడం అన్నింటి కంటే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలతోనూ సానుకూలంగా కాస్త సమయం వెచ్చిస్తే.. ఫలితం ఉంటుందంటున్నారు.

అయితే తమది ఇలాంటి పేరెంటింగ్ అని గుర్తించినా, మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా మారకపోతే మాత్రం ఓసారి నిపుణుల్ని సంప్రదించి కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. లేదంటే ఇటు మీరు, మీ ప్రవర్తన వల్ల అటు మీ పిల్లలూ బాధపడే అవకాశముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని