‘ఫేషియల్‌ కప్పింగ్‌’తో నవయవ్వనంగా..!

వయసు పెరిగినా అందం తరిగిపోకూడదనే అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే పలు చికిత్సలు తీసుకోవడంతో పాటు ఇంటి చిట్కాలూ పాటిస్తుంటారు. అయినా కొందరికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడుతుంటాయి.

Published : 23 Jun 2024 12:07 IST

వయసు పెరిగినా అందం తరిగిపోకూడదనే అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే పలు చికిత్సలు తీసుకోవడంతో పాటు ఇంటి చిట్కాలూ పాటిస్తుంటారు. అయినా కొందరికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడుతుంటాయి. ఇలాంటి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయడంలో ‘ఫేషియల్‌ కప్పింగ్‌’ పద్ధతి చక్కగా దోహదం చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. బాడీ కప్పింగ్‌ను పోలి ఉన్నా.. ఎన్నో విధాలుగా అందాన్ని ద్విగుణీకృతం చేసే ఈ పద్ధతిని పాటించే అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతుందంటున్నారు. మరి, ఏంటీ ఫేషియల్‌ కప్పింగ్‌? సౌందర్య పోషణలో దీని పాత్రేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

బాడీ కప్పింగ్‌.. చాలామందికి తెలిసిన పద్ధతే! శారీరక నొప్పుల్ని దూరం చేసుకునేందుకు చాలామంది ఈ చికిత్స తీసుకుంటారు. ‘ఫేషియల్‌ కప్పింగ్‌’ కూడా ఇలాంటిదే! కానీ దీని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. చర్మానికి రక్తప్రసరణను పెంచి పునరుత్తేజితం చేసే ఈ సౌందర్య థెరపీతో వృద్ధాప్య ఛాయల్నీ దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. బాడీ కప్పింగ్‌లో భాగంగా శరీరంపై కప్స్‌ అమర్చుకున్నప్పుడు మచ్చలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఫేషియల్‌ కప్పింగ్‌లో ఈ సమస్య ఉండకపోవచ్చంటున్నారు.

కప్పింగ్‌.. దశల వారీగా!

బాడీ కప్పింగ్‌లో మాదిరిగానే ఫేషియల్‌ కప్పింగ్‌లోనూ సిలికాన్‌, గ్లాస్‌ మెటీరియల్‌తో రూపొందించిన వివిధ రకాల కప్స్‌ ఉపయోగిస్తారు. అయితే ఇవి కాస్త మృదువుగా ఉండడం వల్ల చర్మంపై మచ్చలు పడే అవకాశం చాలా తక్కువంటున్నారు నిపుణులు. ఫేషియల్‌ కప్పింగ్‌ కోసం ప్రత్యేకమైన కిట్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించి ఫేషియల్‌ కప్పింగ్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

⚛ ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని కాస్త తేమగా ఉండేలా తుడుచుకోవాలి.

⚛ ఇప్పుడు చేతులు, మునివేళ్లతో ముఖంపై కాసేపు మర్దన చేసుకోవాలి. ఈ క్రమంలో కొన్ని చుక్కల ఫేస్‌ ఆయిల్‌/సీరమ్‌ని కూడా వాడచ్చు. దీనివల్ల కప్‌ మచ్చలు చర్మంపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ గడ్డం వద్ద నుంచి కప్పింగ్‌ థెరపీ మొదలుపెట్టాలి. గడ్డం వద్ద చిన్న కప్‌ని అమర్చుకొని.. కాసేపటి తర్వాత నోటి చుట్టూ అక్కడక్కడా కప్‌ని కొన్ని నిమిషాల చొప్పున అమర్చుకోవాలి. ఇలా ఆపై బుగ్గలు, నుదుటి వరకూ దశల వారీగా కప్స్‌ని అమర్చుకొని తొలగించుకోవాలి.

⚛ బుగ్గలు, నుదురు వంటి విశాలమైన ప్రదేశాల్లో పెద్ద కప్స్‌ని కూడా ఉపయోగించచ్చు. ఇలా అవసరమైన ముఖ భాగాల్లో కప్పింగ్‌ చేసుకోవాలి.

⚛ ముందుగా ఫేస్‌ ఆయిల్‌/సీరమ్‌ రాసుకున్న వాళ్లు కప్పింగ్‌ పూర్తయ్యాక ముఖం శుభ్రం చేసుకొని తడి-పొడిగా ఉండేలా తుడుచుకోవాలి. ఆయిల్‌/సీరమ్‌ రాసుకోని వారు గోరువెచ్చటి నీటిని ముఖంపై చల్లుకొని తుడుచుకుంటే సరిపోతుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని శ్వాసిస్తాయి. ఫలితంగా అందం ఇనుమడిస్తుంది.

⚛ ఆపై మీ బ్యూటీ రొటీన్‌ని యథావిధిగా కొనసాగించచ్చు. ఫేషియల్‌ కప్పింగ్‌.. సౌందర్య పోషణలో భాగంగా ఉపయోగించే పదార్థాల్ని చర్మం మరింతగా శోషించుకునేలా ప్రేరేపిస్తుంది.
అవగాహన ఉన్న వారు ఫేషియల్‌ కప్పింగ్‌ని ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు.. లేదంటే నిపుణుల సహాయం తీసుకోవచ్చు. అంతేకానీ సొంత ప్రయత్నాలు మాత్రం వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే సరైన పద్ధతిలో దీన్ని పాటించినప్పుడే సత్ఫలితాలు పొందచ్చంటున్నారు.

ప్రయోజనాలెన్నో!

ఫేషియల్‌ కప్పింగ్‌తో సౌందర్య పరంగా బహుళ ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

⚛ కప్‌ అమర్చుకున్న ప్రదేశంలో దాని కింద ఉండే చర్మం ఒత్తిడికి లోనవుతుంది. తద్వారా ఆ భాగానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే ఆ ప్రదేశానికి ఆక్సిజన్‌, పోషకాలు కూడా అంది.. చర్మంలోని మలినాలు కూడా తొలగిపోతాయి. ఫలితంగా చర్మం పునరుత్తేజితం అవుతుంది.

⚛ ఈ థెరపీ వల్ల కప్‌ అమర్చుకున్న ప్రదేశం చుట్టూ కొత్త రక్తకణాలు ఏర్పడతాయి. ఇది కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా చర్మం కాంతివంతంగా, నవయవ్వనంగా మారుతుంది.

⚛ కప్పింగ్‌ థెరపీలో భాగంగా వ్యాక్యూమ్‌ తరహా ఒత్తిడిని అందించడం వల్ల చర్మంపై ఉండే వాపు కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.

⚛ ఫేషియల్‌ కప్పింగ్‌ చర్మంపై ఉండే ముడతలు, గీతలు, మచ్చల్ని తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా యవ్వనంగా మెరిసిపోవచ్చు.

⚛ చర్మం స్థితిస్థాపకతను పెంచడంలోనూ ఈ థెరపీ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పిగ్మెంటేషన్‌ సమస్యనూ దూరం చేస్తుందట!

⚛ జిడ్డు చర్మం ఉన్న వారికి షేఫియల్‌ కప్పింగ్‌ ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సీబమ్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచడంలో సహకరిస్తుంది.

అయితే ఈ థెరపీ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలన్నీ తాత్కాలికమే అని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ కప్పింగ్‌ను తరచూ బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకోవడం, నిర్ణీత వ్యవధుల్లో పాటించడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాల్ని పొందచ్చంటున్నారు. అది కూడా నిపుణుల సలహా మేరకు సరైన పద్ధతిలో పాటించడం ముఖ్యమంటున్నారు.

అందరికీ సూటవుతుందా?

అందాన్ని పెంచే ఫేషియల్‌ కప్పింగ్‌ని పాటించే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం అవసరమంటున్నారు నిపుణులు.

⚛ ఒకే ప్రదేశంలో కప్‌ని ఎక్కువ సేపు ఉంచకూడదు. దానివల్ల అక్కడ మచ్చలు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కప్‌ అమర్చుకునే ప్రదేశాన్ని నిర్ణీత సమయాల్లో మార్చాల్సి ఉంటుంది.

⚛ సున్నితమైన చర్మతత్వం, వివిధ రకాల చర్మ సమస్యలు/ఇన్ఫెక్షన్లు ఉన్న వారు ఈ థెరపీ తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

⚛ అలాగే వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, నెలసరిలో ఉన్న వారు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, కొవ్వులు అధికంగా ఉండే వారు.. ఫేషియల్‌ కప్పింగ్‌కి దూరంగా ఉండాలట!

⚛ ఫేషియల్‌ కప్పింగ్‌ కారణంగా కొంతమందిలో వికారం, అలసట, మగతగా అనిపించడం.. వంటి దుష్ప్రభావాలూ కనిపించచ్చట!

కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని, నిపుణుల సలహా మేరకు ఈ థెరపీ తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్