లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌.. మంచిదా? కాదా?

ఎదుటివారు ఏమనుకుంటారోనన్న మొహమాటంతో, సిగ్గుతో ఆడవాళ్లు చాలా విషయాలు తమలోనే దాచుకుంటారు. దీనివల్ల సందేహాలు ఇంకా పెరిగిపోతాయే తప్ప వాటికి సమాధానం మాత్రం దొరకదు. అలాంటి అంశాల్లో అవాంఛిత రోమాలు ఒకటి.

Published : 05 Dec 2021 18:42 IST

ఎదుటివారు ఏమనుకుంటారోనన్న మొహమాటంతో, సిగ్గుతో ఆడవాళ్లు చాలా విషయాలు తమలోనే దాచుకుంటారు. దీనివల్ల సందేహాలు ఇంకా పెరిగిపోతాయే తప్ప వాటికి సమాధానం మాత్రం దొరకదు. అలాంటి అంశాల్లో అవాంఛిత రోమాలు ఒకటి. ప్రస్తుతం వ్యాక్సింగ్‌, షేవింగ్‌.. వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నా.. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ గురించి ఇప్పటికీ అతివల్లో ఎన్నో సందేహాలు, సందిగ్ధాలు! అసలు ఇది మంచిదా? కాదా? ఒకవేళ చేయించుకుంటే ఏవైనా దుష్ప్రభావాలు ఎదురవుతాయా? బికినీ ఏరియాలో లేజర్‌ చికిత్స తీసుకోవచ్చా? ఇలాంటి సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే ఇది చదివేయండి!

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌.. అవాంఛిత రోమాల్ని శాశ్వతంగా తొలగించడానికి చేసే చికిత్స ఇది. ఇందులో భాగంగా అత్యంత శక్తిమంతమైన కాంతి పుంజాన్ని చర్మంపై పడేలా చేసి.. రోమాలు మొలిచే హెయిర్‌ ఫాలికల్‌ని నశింపజేస్తారు. తద్వారా కొత్త రోమాలు పెరగకుండా ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ వల్ల దీర్ఘకాలం పాటు అవాంఛిత రోమాలు పెరగకపోవచ్చు.. కానీ అందరి విషయంలో ఇది వర్కవుట్‌ కాకపోవచ్చంటున్నారు నిపుణులు.

వాళ్లకు ఎక్కువ ప్రయోజనకరం!

కాళ్లు-చేతులు, చంకలు, పైపెదవి, గడ్డం, బికినీ లైన్‌, ఛాతీ.. ఇలా ఏ శరీర భాగంలోని అవాంఛిత రోమాలనైనా లేజర్‌ పద్ధతిలో తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే జుట్టు రంగు, చర్మ రంగును బట్టి ఈ చికిత్స సక్సెస్‌ రేటు ఆధారపడి ఉంటుందట! అదెలాగంటే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ వర్ణద్రవ్యం లేజర్‌ కిరణాలను మరింత సమర్థంగా ఆకర్షిస్తుంది.. కాబట్టి నల్లటి రోమాలు, తెల్లటి చర్మ ఛాయ కలిగిన వారి విషయంలో లేజర్‌ చికిత్స సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే.. వెంట్రుకలు నల్లగానే ఉండి, చర్మ ఛాయ కూడా తక్కువగా ఉన్నట్లయితే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ని లేజర్‌ అంత త్వరగా గుర్తించలేదు. ఈ క్రమంలో చర్మంలోని మెలనిన్‌ లేజర్‌ని ఆకర్షించి.. ఫలితంగా చర్మం డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువ! అందుకే ఇలాంటి వారికోసం ప్రత్యేక లేజర్‌ చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది.

చేయించుకునే ముందు..!

లేజర్‌ చికిత్స మీ చర్మతత్వానికి సరిపడుతుందో లేదో ముందుగా చర్మ సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఆపై వారి సూచన మేరకు చేయించుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ లేజర్‌ చికిత్స తీసుకోవాలని అనుకుంటే మాత్రం ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

* కొన్ని రోజుల ముందు నుంచే ఎండలో ఎక్కువ సమయం గడపకుండా చూసుకోవాలి. ఎందుకంటే ట్యాన్‌ ఏర్పడిన చర్మంపై లేజర్‌ చికిత్స చేయరు.

* చర్మానికి సరిపడని సౌందర్య ఉత్పత్తులు వాడడం, అలర్జీకి కారణమయ్యే ఆహార పదార్థాలు తినడం.. మంచిది కాదు.

* వ్యాక్సింగ్‌, ప్లకింగ్‌.. వంటి అవాంఛిత రోమాలు తొలగించుకునే పద్ధతులకు దూరంగా ఉండాలి. అయితే లేజర్‌కి ఒకరోజు ముందు షేవింగ్‌ చేసుకోవచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తుంటారు.

* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడకూడదు. ఎందుకంటే వాటిని వాడడం వల్ల చికిత్స తీసుకునే క్రమంలో రక్తస్రావమయ్యే ప్రమాదం ఎక్కువట!

* చర్మంపై ఏవైనా ఇన్ఫెక్షన్లున్నట్లయితే ఈ చికిత్స చేయించుకోకూడదు. అలాగే వంశపారంపర్యంగా ఏవైనా చర్మ సమస్యలున్నట్లయితే అలాంటి వారు ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి.

* కనురెప్పలు-కంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఈ చికిత్స చేయరు.. అలాగే ట్యాటూస్‌ వేయించుకున్న చర్మ ప్రదేశంలో కూడా లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స చేయకూడదంటున్నారు నిపుణులు.

ఈ దుష్ప్రభావాలు తాత్కాలికమే!

దాదాపు అందరికీ లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స సరిపడినా.. కొంతమందిలో మాత్రం కొన్ని రకాల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే అవి కూడా తాత్కాలికమే అంటున్నారు.

* వ్యాక్సింగ్‌ చేయించుకున్న చోట చర్మం ఉబ్బడం, ఎరుపెక్కడం సహజమే! లేజర్‌ చికిత్స తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపించచ్చంటున్నారు నిపుణులు. అయితే ఇవి కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయని.. ఈ క్రమంలో వాపు, నొప్పిగా అనిపిస్తే ఐస్‌ ప్యాక్‌తో ఉపశమనం పొందచ్చంటున్నారు.

* లేజర్‌ చికిత్స తర్వాత పిగ్మెంటేషన్‌ సమస్య కూడా తలెత్తచ్చట! అంటే.. తెల్లగా ఉన్న వారి చర్మంపై నల్లటి మచ్చలు, నల్లగా ఉన్న వారి చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడడం సహజమని, అయితే ఇదీ తాత్కాలికమే అంటున్నారు నిపుణులు.

* కొంతమందిలో లేజర్‌ చికిత్స తర్వాత ఆయా భాగంలో చర్మం రంగు మారడం గమనించచ్చు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఈ మారిన చర్మ రంగు శాశ్వతంగా ఉండిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

* లేజర్‌ చికిత్స తర్వాత డాక్టర్‌ సలహాలు పాటించడం, చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహించడం, మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం.. వంటి చిన్న పాటి చిట్కాలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు.

* ఈ చికిత్స కారణంగా క్యాన్సర్‌ వస్తుందన్న భయం చాలామందిలో ఉంది. అయితే ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే లేజర్‌ కిరణాల్లో రేడియేషన్‌ తక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఉపరితలానికే పరిమితమవుతుంది. తప్ప లోపలి దాకా వెళ్లదు. తద్వారా క్యాన్సర్‌ వచ్చే అవకాశమే లేదంటున్నారు.

* బికినీ ఏరియాలో లేజర్‌ చికిత్స తీసుకోవడం వల్ల సంతాన సమస్యలొస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇదీ ఓ అపోహే అని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ కిరణాల్లో రేడియేషన్‌ ప్రభావం తక్కువగా ఉండడం, ఇవి చర్మం ఉపరితలానికే పరిమితమవడమే ఇందుకు కారణం. ఒకవేళ అంతగా సందేహమున్నా, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తోన్న వారు ఓసారి నిపుణుల్ని సంప్రదించాకే ముందుకెళ్లడం ఉత్తమం.

* ఇక గర్భిణులు లేజర్‌ చికిత్స తీసుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే లేజర్‌ కిరణాలు బిడ్డపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయన్న విషయం ఇంకా అధ్యయన దశలోనే ఉందట!

ఏదేమైనా కచ్చితంగా చికిత్స తీసుకోవాలనుకున్న వారు మాత్రం అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో తీసుకోవడమే అన్ని రకాలుగా మేలు!

ఇందుకు సిద్ధమవ్వాల్సిందే!

లేజర్‌ పద్ధతి ద్వారా అవాంఛిత రోమాల్ని తొలగించుకునే ప్రక్రియ ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని, ఇందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని, అందుకోసం శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* లేజర్‌ చికిత్సలో భాగంగా కనిష్ఠంగా ఆరు సెషన్స్‌ నుంచి గరిష్ఠంగా ఇరవై సెషన్స్‌ దాకా పాల్గొనాల్సి ఉంటుందట!

* ఈ క్రమంలో ఒక్కసారికే రోమాల్ని తొలగించడం వీలు కాదట! ఒక్కోసారి వెంట్రుకలు మరింత దట్టంగా కనిపించే ఆస్కారమూ ఉందంటున్నారు నిపుణులు.

* చికిత్స తర్వాత చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కాబట్టి ఒకట్రెండు రోజుల పాటు ఎండలోకి వెళ్లడం, ఈత కొట్టడం.. వంటి పనులు మానుకోవాలి.

* చాలామంది విషయంలో ఈ లేజర్‌ చికిత్స సత్ఫలితాలనిచ్చినా.. కొంతమందిలో మాత్రం కొన్నేళ్ల తర్వాత రోమాలు తిరిగి పెరిగే అవకాశాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇది కూడా దృష్టిలో ఉంచుకుంటే ఆ సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

చాలామంది విషయంలో లేజర్‌ చికిత్స మంచి ఫలితాలనివ్వచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి మీరూ కచ్చితంగా ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటే సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేయచ్చు. ఇదంతా రిస్క్‌తో కూడుకున్న పని అని భావించే వారికి ఎలాగూ వ్యాక్సింగ్‌/షేవింగ్‌ వంటి పద్ధతులు ఉండనే ఉన్నాయి. ఏదేమైనా లేజర్‌ చికిత్స తీసుకోవాలనుకున్న వారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం, ఈ క్రమంలో ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే మాత్రం ఆలస్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించడం మంచిది.

‘అయినా అవాంఛిత రోమాలనేవి.. మనం కావాలని కోరి తెచ్చుకున్నవి కాదు.. సహజసిద్ధంగా వచ్చేవే! అలాంటప్పుడు వాటి విషయంలో సిగ్గుపడడం, ఎవరో ఏదో అనుకుంటారని రిస్క్‌ చేసి మరీ వాటిని శాశ్వతంగా తొలగించుకోవడం ఎందుకు?’ అనుకునే వారూ లేకపోలేదు. మరి, ఈ విషయంలో మీరేమంటారు? రోమాల్ని పూర్తిగా తొలగించుకోవడం వల్లనే అందంగా మెరిసిపోతామంటారా? మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్