Love Bombing: ‘నీ అంత అందగత్తె లేదు..’ అంటే పడిపోకండి!

ప్రేమలో పడిన తొలినాళ్లలో చాలా జంటలకు ఇలాంటి అనుభవాలు సహజమే! అయితే మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. భాగస్వామి చూపే ఈ అంతులేని అభిమానం నిజమైన ప్రేమ కాకపోవచ్చంటున్నారు రిలేషన్‌షిప్‌....

Updated : 02 May 2023 18:52 IST

మనసుకు నచ్చిన వారు ‘నువ్వే నా సర్వస్వం’ అనగానే ఉప్పొంగిపోతాం..

‘నీలాంటి మనసున్న వ్యక్తిని నేనిప్పటి వరకు చూడలేద’నగానే ప్రపంచాన్నే జయించినంతగా ఫీలవుతాం..

‘నీతో జీవితం పరిపూర్ణమవుతుందం’టే చాలు.. మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది..

సందర్భం ఉన్నా, లేకపోయినా విలువైన బహుమతులతో ముంచెత్తితే.. ఈ సృష్టిలోని అదృష్టమంతా నాదేనేమో అనిపిస్తుంది..

ప్రేమలో పడిన తొలినాళ్లలో చాలా జంటలకు ఇలాంటి అనుభవాలు సహజమే! అయితే మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. భాగస్వామి చూపే ఈ అంతులేని అభిమానం నిజమైన ప్రేమ కాకపోవచ్చంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. కొన్ని జంటల్లో భాగస్వామిని మానసికంగా, ఎమోషనల్‌గా లొంగదీసుకునేందుకు పన్నే ఈ పన్నాగాన్నే ‘లవ్‌ బాంబింగ్‌’గా పేర్కొంటున్నారు. దీన్ని ఆదిలోనే గుర్తించి జాగ్రత్తపడకపోతే.. భవిష్యత్తులో భాగస్వామి చేతిలో శారీరక/మానసిక వేధింపులు, హింసకు గురికాక తప్పదంటున్నారు. మరి, భాగస్వామిలో తేనె పూసిన కత్తి లాంటి ఈ తరహా ప్రవర్తనను గుర్తించడమెలా? తెలుసుకుందాం రండి..

ప్రేమలో పడిన తొలినాళ్లలో భాగస్వామిని ఆకర్షించడానికి వారిని ప్రశంసించడం, విలువైన బహుమతులివ్వడం.. సహజమే! అయితే ఈ క్రమంలో కొందరు నిజమైన ప్రేమను ప్రదర్శిస్తే.. మరికొందరు తమ భాగస్వామిని లొంగదీసుకోవడానికి ఇలా అతిగా ప్రవర్తిస్తూ నకిలీ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. దీన్నే ‘లవ్‌ బాంబింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ప్రేమలో పడిన కొత్తలోనే కాదు.. కొన్ని జంటల్లో గొడవైన తర్వాత, బ్రేకప్‌ అనంతరం కూడా ఈ తరహా ప్రవర్తనన కనిపిస్తుందంటున్నారు. ఏదేమైనా ప్రేమను, ప్రేమించిన వారిని గుడ్డిగా నమ్మేయకుండా.. ఆదిలోనే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు. భాగస్వామి ప్రవర్తనను బట్టే దీన్ని గుర్తించచ్చంటున్నారు. అదెలాగంటే..!

పొగడ్తలకు పడిపోకండి!

మనసుకు నచ్చిన వ్యక్తి ప్రశంసిస్తే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇంకా ఇంకా ప్రశంసలు కావాలనిపిస్తుంది. అయితే భాగస్వామిని మానసికంగా లొంగదీసుకోవాలనుకునే వారు (లవ్‌ బాంబర్స్‌) దీన్నే అలుసుగా తీసుకుంటారంటున్నారు నిపుణులు. ‘నువ్వు నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు..’, ‘నీలాంటి అత్యుత్తమ వ్యక్తి ఇప్పటిదాకా నాకు తారసపడలేదు..’, ‘నీలాంటి అందగత్తె ఈ సృష్టిలోనే లేదు..’.. ఇలా మాటకు ముందో ప్రశంస, వెనకో ప్రశంస జోడిస్తుంటారు. సందర్భం ఉన్నా, లేకపోయినా.. విలువైన బహుమతులివ్వడం, ఆహార్యం విషయంలోనూ తమను తాము గొప్పగా చూపించుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఇలా వీటి మైకంలో పడిపోయి భాగస్వామి తమను పూర్తిగా నమ్మేలా చేసుకోవడానికే వారిలా ప్రవర్తిస్తుంటారు. అదే నిజమైన ప్రేమలో ఇలాంటి ప్రవర్తన ఉండదంటున్నారు నిపుణులు. కాబట్టి నచ్చిన వ్యక్తి పదే పదే ప్రశంసించినా, విలువైన బహుమతులిచ్చినా, మాటలు-చేతల్లో గొప్పలకు పోయినా.. దాన్ని లవ్‌ బాంబింగ్‌గా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

అన్నీ పంచుకుంటున్నారా?

ఒక వ్యక్తిపై నమ్మకం కుదిరితే ఓ అడుగు ముందుకేసి మన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటాం. ఇక మనసుకు నచ్చిన భాగస్వామి తారసపడితే.. వ్యక్తిగత విషయాలతో పాటు ఇష్టాయిష్టాలూ, ఇతర రహస్యాలూ బయటపెడుతుంటాం. ప్రేమలో ఇది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. లవ్‌ బాంబర్స్‌ మీలోని ఈ బలహీనతనే లక్ష్యంగా చేసుకొని మిమ్మల్ని లొంగదీసుకునే అవకాశం ఉందంటున్నారు. క్రమంగా మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ సభ్యులు-ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంతో పాటు.. ఇదే సమయంలో వాళ్లూ వాళ్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని మీతో పరిచయమైన కొద్ది రోజుల్లోనే బయటపెట్టేందుకు ఆసక్తి చూపుతారంటున్నారు. ఇలా మీరు బయటపెట్టిన ఈ రహస్యాలతోనే భవిష్యత్తులో మిమ్మల్ని వేధింపులకు గురిచేసే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. కాబట్టి మనసుకు ఎంత నచ్చిన వ్యక్తైనా సరే.. వారిపై పూర్తి నమ్మకం కలిగేదాకా లేదంటే ఆ బంధం శాశ్వతమయ్యే దాకా మీ రహస్యాల్ని మీ మనసులోనే ఉంచుకోవడం మంచిదంటున్నారు.

క్షణమైనా వదలకపోతే..!

ప్రేమలో పడిన తొలినాళ్లలో అనుక్షణం భాగస్వామితోనే గడపాలనిపిస్తుంటుంది. అలాగని వాళ్లనే అంటిపెట్టుకొని ఉండలేం.. భావోద్వేగాల్ని అదుపు చేసుకుంటూ వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మన బాధ్యతల పైనా దృష్టి పెడతాం. కానీ లవ్‌ బాంబర్స్‌ మాత్రం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా భాగస్వామినే టార్గెట్‌ చేస్తుంటారంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పదే పదే కాల్స్‌ చేసి మాట్లాడడం, సందేశాలు పంపడం, కలవడం.. ఇలా క్షణమైనా వదలకుండా భాగస్వామితో ప్రత్యక్షంగా, పరోక్షంగా గడపాలనుకుంటారు. ఈ తరహా ప్రవర్తన చూసి చాలామంది ‘ఇలాంటి లవర్‌ దొరకడం నిజంగా నా అదృష్టం’ అనుకుంటారు. కానీ ఇది నిజమైన ప్రేమ కాదని, మిమ్మల్ని లొంగదీసుకోవడానికి వాళ్లు పన్నే పన్నాగం అంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా మీరు ఎమోషనల్‌గా వారిపై ఆధారపడేలా చేసుకోవడానికే వాళ్లిలా ప్రవర్తిస్తారంటున్నారు. కాబట్టి ఇలా ప్రవర్తించే వారితో ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు.

అసూయపడితే ఆలోచించాల్సిందే!

నిజమైన ప్రేమ భాగస్వామి సంతోషాన్ని కోరుకుంటుందంటారు. కానీ లవ్‌ బాంబర్స్‌ తమ భాగస్వామి పట్ల ఈర్ష్యాద్వేషాల్నే నింపుకొంటారని చెబుతున్నారు నిపుణులు. కెరీర్‌లో ఎదిగినా, ఇతరులతో మాట్లాడినా ఈర్ష్యపడడం.. వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకుంటే ఓర్వలేకపోవడం.. ఎప్పుడూ తమతోనే గడపాలని ఒత్తిడి తేవడం, తమ ఇష్టాయిష్టాలే భాగస్వామి ఆచరించాలన్నట్లుగా వ్యవహరించడం.. ఇలాంటి ఆదేశ పూర్వకమైన ప్రవర్తనను లవ్‌ బాంబింగ్‌ రిలేషన్‌షిప్‌లో గుర్తించచ్చు. అయితే కొంతమంది దీన్ని అతి ప్రేమగా భావించి పొరపడే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ తరహా ప్రవర్తనను భాగస్వామిలో గుర్తిస్తే ముందే జాగ్రత్తపడమని సూచిస్తున్నారు.

నలుగురిలో ముద్దూముచ్చట్లు!

లవ్‌ బాంబింగ్‌ రిలేషన్‌షిప్‌లో భాగస్వామిపై ఉన్న ప్రేమను నాలుగ్గోడలకే పరిమితం చేయకుండా.. నలుగురిలోనూ ప్రదర్శించాలనుకుంటారు కొందరు. దీన్నే PDA (పబ్లిక్‌ డిస్‌ప్లే ఆఫ్‌ ఎఫెక్షన్‌) అంటారు. అంటే.. నలుగురి మధ్యలోకి వెళ్లినప్పుడు భాగస్వామిని హత్తుకోవడం, రొమాంటిక్‌గా వారిపై చేతులు వేయడం, ముద్దాడడం.. ఇలా అతి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలా వాళ్లు చూపే అతి ప్రేమకు పడిపోకుండా.. వారి ప్రవర్తన నలుగురిలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్పడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అలాగే ఈ తరహా వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిదంటున్నారు.

ప్రేమలో అయినా, వైవాహిక బంధమైనా, బ్రేకప్‌/విడాకుల తర్వాతైనా.. ఇలాంటి అనుబంధం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారకూడదంటే.. భాగస్వామిని గుడ్డిగా నమ్మి మోసపోకుండా ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, అభద్రతా భావానికి లోనుకాకుండా ముందుకు సాగితే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఓర్పు, నేర్పు మీ సొంతమవుతుందంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్