సిలిండర్‌తో సాధన చేసింది...పొలం పనులకూ వెళ్లింది!

విశ్వక్రీడలు ఆరంభమై వారం రోజులు గడిచిపోయాయి...మీరాబాయి గెలిచిన రజతం తప్ప మరో పతకం జాడే లేదు...మరోవైపు మేరీకోమ్‌ లాంటి క్రీడాదిగ్గజాలు ఒక్కొక్కరూ టోక్యో నుంచి నిష్ర్కమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్‌కు మరో ఒలింపిక్‌ పతకాన్ని ఖాయం చేసింది యువ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహెన్‌. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ 23 ఏళ్ల అమ్మాయి..69 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.

Published : 30 Jul 2021 17:41 IST

విశ్వక్రీడలు ఆరంభమై వారం రోజులు గడిచిపోయాయి...మీరాబాయి గెలిచిన రజతం తప్ప మరో పతకం జాడే లేదు...మరోవైపు మేరీకోమ్‌ లాంటి క్రీడాదిగ్గజాలు ఒక్కొక్కరూ టోక్యో నుంచి నిష్ర్కమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్‌కు మరో ఒలింపిక్‌ పతకాన్ని ఖాయం చేసింది యువ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహెన్‌. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ 23 ఏళ్ల అమ్మాయి..69 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.

ప్రత్యర్థులపై పవర్‌ పంచ్‌లు!

అస్సాంకు చెందిన లవ్లీనా తొలిసారిగా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ ముందు వరకు కూడా ఆమెపై ఎలాంటి అంచనాలు లేవు. బహుశా ఇదే ఈ యంగ్‌ బాక్సర్‌ పాలిట అదృష్టంగా మారిందేమో. ప్రారంభ మ్యాచ్‌ నుంచే ఎంతో దూకుడుగా ఆడుతున్న ఆమె...ప్రత్యర్థి ఎవరైనా తన పవర్‌ పంచులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో క్వార్టర్స్‌లో ఏకంగా మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను చిత్తుచేసింది. రెండో పతకం కోసం ఆశగా ఎదురుచూస్తోన్న కోట్లాది మంది అభిమానుల నిరీక్షణ ఫలించేలా చేసింది. ఒలింపిక్స్ బాక్సింగ్‌ విభాగంలో భారత్‌ పతకం గెల్చుకోవడం ఇది మూడోసారి. లవ్లీనా కంటే ముందు 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీకోమ్‌ కాంస్య పతకాలు సాధించారు. అయితే 69 కేజీల విభాగంలో మాత్రం భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకాన్ని అందిస్తున్నది మాత్రం లవ్లీనానే.

అక్కలను చూస్తూ..!

అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లా బారో ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్‌ 2న జన్మించింది లవ్లీనా. తండ్రి టికెన్‌ బోర్గోహెన్‌ ఒక చిన్న వ్యాపారి. తల్లి మామొనీ గృహిణి. లవ్లీనాకు లిచా, లిమా అనే కవలలైన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తన ముగ్గురు కూతుళ్లను బాక్సర్లుగా తయారుచేయాలనుకున్నారు టికెన్‌. అందుకు తగ్గట్టే లవ్లీనా అక్కలిద్దరూ జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వారిని చూసి లవ్లీనా కూడా కిక్‌ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పాఠశాలతో పాటు జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటింది. 2011లో బర్తాపూర్‌ బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు ఓ కిక్‌ బాక్సింగ్‌ ఈవెంట్‌లో లవ్లీనా అద్భుతంగా ఆడి ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ దృష్టిలో పడింది. ప్రముఖ కోచ్‌ పదుమ్‌బోరో కూడా ఆమెలోని నైపుణ్యానికి ముగ్ధులై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇదే క్రమంలో కిక్‌ బాక్సింగ్‌ కంటే బాక్సింగ్‌లోనే మెరుగైన అవకాశాలు ఉన్నాయని గ్రహించి దానినే కెరీర్‌గా మల్చుకుంది. అలా 2012 నుంచే బాక్సింగ్‌లో ఈ యంగ్‌ బాక్సర్‌ శిక్షణ ప్రారంభమైంది.

అలా టోక్యో బెర్తు ఖరారు చేసుకుంది!

జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటినప్పటికీ లవ్లీనా గురించి ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది 2017లోనే. ఆ ఏడాది వియత్నాం వేదికగా జరిగిన ఏషియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆమె కాంస్య పతకం గెల్చుకుంది. 2018 దిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ మరుసటి ఏడాది రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో కాంస్యాన్ని మెడలో వేసుకుంది. 2020 మార్చిలో జరిగిన ఆసియా- ఓషనియా బాక్సింగ్‌ ఒలింపిక్‌ అర్హత టోర్నీలో గెలిచి టోక్యో బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఈ ఏడాది మేలో దుబాయి వేదికగా జరిగిన ఏషియన్‌ అమెచ్యూర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ కాంస్యం గెల్చుకుంది. తద్వారా ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది.

అమ్మను చూసుకుంటూ... కరోనాకు గురై!

గతేడాది మార్చిలో టోక్యో బెర్తును ఖాయం చేసుకున్న లవ్లీనా ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు కావాల్సిన సమయం దొరికింది. అయితే ఇంతలో ఆమె తల్లి మామొనీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆమెను చూసుకునేందుకు ఇంటికి వెళ్లిన లవ్లీనా దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్ల కోసం సాయ్‌ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణకు దూరమైంది.

‘కరోనా తర్వాత ప్రాక్టీస్‌ చేసేందుకు శరీరం ఏ మాత్రం సహకరించలేదు. అయినా నేను వెనకడుగు వేయలేదు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాను. ధ్యానం చేస్తూ మనసును మరింత ప్రశాంతంగా మార్చుకున్నాను. మహమ్మారిని జయించి మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ యువ బాక్సర్.

విశ్వక్రీడల్లో పాల్గొనడం మొదటిసారే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు లవ్లీనా. ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించకుండా పవర్‌ పంచ్‌లు కురిపిస్తూ ముందుకు సాగింది. సెమీస్‌కు దూసుకెళ్లి భారత్‌ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది. ఆగస్టు 4న సెమీస్‌ పోరు జరగనుంది.

అలీ ఆదర్శం... టైసన్‌కు ఫ్యాన్!

* చిన్నప్పుడు లవ్లీనా తండ్రి టికెన్‌ ఓ న్యూస్‌ పేపర్‌లో చుట్టుకుని స్వీట్లు తీసుకొచ్చాడు. ఇంట్లో అందరూ ఆ స్వీట్లు తింటుంటే లవ్లీనా మాత్రం న్యూస్‌ పేపర్‌లో వచ్చిన మహమ్మద్‌ అలీ ఫొటో చూస్తూ ఉండిపోయింది. అప్పటి నుంచే బాక్సింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుందట.

* తన బాక్సింగ్‌ కెరీర్‌కు ఇద్దరు అక్కలతో పాటు అలీ స్ఫూర్తినిచ్చారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఈ యంగ్‌ బాక్సర్ మైక్‌ టైసన్‌ ఆటకు పెద్ద అభిమాని.

* 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉండే లవ్లీనాకు బాక్సింగ్‌తో పాటు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఆసక్తి. అందుకే ఇంటికొచ్చినప్పుడల్లా తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. ఇక గతేడాది జులైలో తల్లి కిడ్నీ వ్యాధి బారిన పడినప్పుడు కూడా వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిందీ యువ సంచలనం.

* లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైనప్పుడు సాధన కోసం ఎలాంటి వసతులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిలిండర్‌ ఎత్తుతూ వ్యాయామాలు చేసిందీ అస్సామీ బాక్సర్.

* ఒలింపిక్స్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ నిత్యం తన తల్లి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉంది లవ్లీనా. రోజులో కనీసం రెండుసార్లయినా తండ్రికి ఫోన్‌ చేసి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటోంది.

* లాక్‌డౌన్‌ కాలంలో పెద్దమనసు చాటుకున్న లవ్లీనా ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలు, పేదలకు నిత్యవసరాలు సమకూర్చింది.

* బాక్సింగ్‌లో తన పవర్‌ పంచులకు గుర్తింపుగా గతేడాది రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అర్జున అవార్డు కూడా అందుకుందీ యువ బాక్సర్.

స్వర్ణంతో తిరిగిరావాలి!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసిన లవ్లీనాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హర్భజన్‌ సింగ్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు. బంగారు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్