మెన్‌స్ట్రువల్‌ కప్‌.. ఎలా ఎంచుకోవాలి? ఎలా వాడాలి?

మెన్‌స్ట్రువల్‌ కప్‌.. మహిళలందరికీ ఈ పేరు తెలిసినా, అసలు దీన్నెలా వాడాలి? ఒకవేళ వాడినా అసౌకర్యంగా ఉంటుందేమో, రక్తం లీకవుతుందేమో అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే వీటిని కొనే ముందు, వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటే దీన్ని సులభంగా ధరించి....

Published : 10 Apr 2023 13:27 IST

మెన్‌స్ట్రువల్‌ కప్‌.. మహిళలందరికీ ఈ పేరు తెలిసినా, అసలు దీన్నెలా వాడాలి? ఒకవేళ వాడినా అసౌకర్యంగా ఉంటుందేమో, రక్తం లీకవుతుందేమో అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే వీటిని కొనే ముందు, వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటే దీన్ని సులభంగా ధరించి, నెలసరి సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండచ్చంటున్నారు నిపుణులు. పైగా ఇది తక్కువ ధరలో లభించడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని సలహా ఇస్తున్నారు. మరైతే ఆలస్యమెందుకు..? మెన్‌స్ట్రువల్‌ కప్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాల గురించి కొనే ముందే తెలుసుకోవడం మంచిది కదా!

నెలసరి సమయంలో సౌకర్యవంతంగా ఉండాలంటే మెన్‌స్ట్రువల్‌ కప్‌ చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు. రబ్బర్‌, సిలికాన్‌.. వంటి పదార్థాలతో ఈ కప్స్‌ని తయారుచేస్తారు. అలాగే వీటిని పదే పదే ఉపయోగించే వెసులుబాటు ఉండడం వల్ల ఇటు మీ ఆరోగ్యానికి, అటు పర్యావరణానికీ ఎలాంటి నష్టమూ వాటిల్లదు.

ఎలా ఎంచుకోవాలంటే..!

మెన్‌స్ట్రువల్‌ కప్స్‌లో చిన్నవి (Small), పెద్దవి (Large).. ఇలా రెండు సైజుల్లో లభిస్తాయి. ఇందులోనూ కొద్ది తేడాల్లో మీడియం, XL సైజులు కూడా ఉంటాయి. అయితే వీటిని ఎంచుకునే ముందు మీ వయసును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. 30 ఏళ్ల లోపున్న వారు అది కూడా సహజ ప్రసవం కాని వారు చిన్న సైజు కప్‌ (Small, Medium)ని ఎంచుకోవచ్చు.. అదే 30 ఏళ్లు పైబడి, సహజ కాన్పు అయిన వారు; నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువగా అయ్యే వారికి పెద్ద సైజు కప్‌ (Large, XL) సరిపోతుంది. అలాగే కప్‌ ఎంచుకునే ముందు మీ గర్భాశయ ముఖద్వారం పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పొడవు తక్కువగా ఉంటే (సర్విక్స్ చిన్నగా ఉంటే) చిన్న కప్‌, పొడవు ఎక్కువగా ఉంటే పెద్ద కప్‌ ఎంచుకోమంటున్నారు. అయితే ఇందులోనూ మీకేమైనా సందేహాలుంటే ఓసారి గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోవడం మంచిది.

ఇలా చేస్తే పెట్టుకోవడం సులువు!

నెలసరి సమయంలో కప్‌ ఉపయోగిస్తే అసౌకర్యంగా ఉంటుందేమో అనుకుంటారు చాలామంది. అయితే అది మనం అమర్చుకున్న విధానంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. తొలిసారి ఉపయోగించే వారికి మొదట్లో పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. దాని పైభాగంలో కాస్త లూబ్రికెంట్‌ రాయాలి. అప్పుడు కప్‌ను సులభంగా అమర్చుకోవచ్చు. అంతేకాదు పెట్టుకునే ముందు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

చేతులు శుభ్రం చేసుకోవాలి.

మొదటిసారి పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కప్‌కు ముందు భాగంలో లూబ్రికెంట్‌ రాసి.. మధ్యలోకి మడవాలి. ఇప్పుడు మొనదేలి ఉన్న భాగాన్ని కిందికి, మడిచిన భాగం పైకి ఉండేలా చూసుకొని వెజైనాలో అమర్చుకోవాలి.

కప్‌కి కింద ఉన్న మొనదేలిన భాగాన్ని మరీ లోపలికి కాకుండా కొన్ని ఇంచులు బయటికి ఉండేలా పెట్టుకుంటే దాన్ని సులభంగా బయటికి తీయచ్చు.

ఇక అమర్చుకున్నాక ఒకసారి గుండ్రంగా తిప్పడం వల్ల అది కరక్ట్‌గా అడ్జస్ట్‌ అవుతుంది. ఫలితంగా లీకయ్యే ప్రమాదం ఉండదు.

అందుకే వాటి కంటే కప్స్‌ బెటర్!

ఇలా ఈ కప్‌ అమర్చుకున్న తర్వాత అసలు పిరియడ్స్ వచ్చినట్లు కూడా అనిపించకుండా సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఈత కొట్టడం, వ్యాయామం చేయడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌.. ఇలా మీకు నచ్చిన పనిని చేసుకోవచ్చు. అయితే సాధారణంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లు వాడేటప్పుడు బ్లీడింగ్‌ను బట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది రెండు గంటలకోసారి మార్చుకుంటే.. మరికొంతమందికి నాలుగ్గంటల దాకా అవి రక్షణనిస్తాయి. అయితే ఎంతైనా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ ఇచ్చినంత రక్షణ.. శ్యానిటరీ ప్యాడ్స్‌, ట్యాంపూన్స్‌ ఇవ్వలేవంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలో సాధారణ రక్తస్రావం అయ్యేవారు 12 గంటలకోసారి కప్‌ని తొలగించుకొని, శుభ్రం చేసుకోవాలి. అదే బ్లీడింగ్ మరీ ఎక్కువగా అయ్యే వారు ఆరు గంటలకోసారి కప్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తొలగించే ముందు కూడా చేతులు శుభ్రం చేసుకోవడం, తొలగించాక శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచాకే తిరిగి ఉపయోగించుకోవాలి. ఇలా మనం ఎంచుకునే కప్‌ నాణ్యత, వాటిని వాడే విధానాన్ని బట్టి అవి ఆరు నెలల నుంచి పదేళ్ల దాకా మన్నే అవకాశం ఉంటుంది.

కప్స్‌తో ప్రయోజనాలెన్నో!

మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వెజైనాను పొడిబారేలా చేయవు. తద్వారా అక్కడుండే మంచి బ్యాక్టీరియా తొలగిపోకుండా ఉంటుంది. ఫలితంగా వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అరుదుగా ఉంటుంది.

కొన్ని రకాల శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపూన్లలో బ్లీచ్‌, డయాక్సిన్‌.. వంటి రసాయనాలు వాడుతుంటారు. అవి పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కానీ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తయారీలో ఇవేవీ వాడరు.. కాబట్టి నిర్భయంగా వీటిని ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు.

రక్తస్రావం లీకవడం వల్ల దానికి గాలి తగిలి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అదే కప్స్‌ వాడితే ఆ సమస్య ఉండదు.. ఎందుకంటే బ్లీడింగ్‌ని బట్టి వీటిని నిర్ణీత వ్యవధుల్లో తొలగించుకొని శుభ్రం చేసుకుంటే కప్‌ నుంచి రక్తం లీకయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

నెలసరి సమయంలో శ్యానిటరీ న్యాప్‌కిన్లు ధరించడం వల్ల.. కూర్చోవడం, లేవడం, ఏదైనా కఠినమైన పని చేయడమూ అసౌకర్యంగా అనిపించచ్చు. కానీ మెన్‌స్ట్రువల్‌ కప్‌ వల్ల అలాంటి అసౌకర్యం ఉండనే ఉండదంటున్నారు నిపుణులు.

అయితే వీటిని ధరించినప్పుడు దురద, మంటగా అనిపించినా; మరీ బలవంతంగా అమర్చుకోవాల్సి వచ్చినా.. నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. తగిన సలహా తీసుకోండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్