నాగాలాండ్‌.. నాయకి!

నాగాలాండ్‌ది.. 60 ఏళ్ల చరిత్ర! 13 శాసనసభ ఎన్నికలు. ఇన్నేళ్లలో ఒక్క మహిళా ఎంఎల్‌ఏ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈసారి గతంలోలా కాదు. హెకానీ జఖాలు, సల్హౌతునొ క్రుసె.. చరిత్రను తిరగరాస్తూ జయకేతనం ఎగురవేశారు.

Updated : 03 Mar 2023 07:36 IST

నాగాలాండ్‌ది.. 60 ఏళ్ల చరిత్ర! 13 శాసనసభ ఎన్నికలు. ఇన్నేళ్లలో ఒక్క మహిళా ఎంఎల్‌ఏ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈసారి గతంలోలా కాదు. హెకానీ జఖాలు, సల్హౌతునొ క్రుసె.. చరిత్రను తిరగరాస్తూ జయకేతనం ఎగురవేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.

హెకానీది దిమాపుర్‌లోని తొలువి. ‘అమ్మాయిలు చదివి ఉద్యోగం, వ్యాపారమంటూ ఊళ్లేలాలా?’ అన్న మాటలు చిన్నప్పట్నుంచీ వింటూ పెరిగారీమె. నాన్న ఎస్‌ఐ జఖాలు.. మాజీ లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌. తల్లి కఖేలు మాత్రం ఆవిడకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. దీంతో బెంగళూరులో స్కూలు విద్య, దిల్లీ లేడీ శ్రీరామ్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తయ్యాక ఐరాసలో కొన్నాళ్లు పని చేశారు. తర్వాత దేశానికి తిరిగొచ్చి దిల్లీలో న్యాయవాదిగా కెరియర్‌ ప్రారంభించారు. సుప్రీం, హైకోర్టుల్లో పనిచేశారు. న్యాయవాదిగా చేస్తున్నా.. యువత సరైన మార్గనిర్దేశం లేక చిరు వ్యాపారాల్లో మునిగిపోవడం, బాల్యవివాహాలు, అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయడం వంటివి ఆవిడని కలచివేసేవి. దీంతో న్యాయవాద వృత్తిని వదిలి 2005లో ఊరికెళ్లిపోయారు. ‘యూత్‌ నెట్‌’ అనే ఎన్‌జీఓను స్థాపించి.. వేలమంది యువతకు విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సాయపడ్డారు. మహిళా సాధికారత కోసం చేసిన కృషికి 2018లో నారీశక్తి పురస్కారాన్నీ అందుకున్నారు. అప్పటివరకూ యువతకు సాయపడాలన్న ఆలోచనే! 2018 ఎన్నికలు ఆవిడ ఆలోచనని మార్చాయి. ‘నాగాలాండ్‌ లాంటి చిన్న రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చు చూసి షాకయ్యా. ఎంత ప్రజాధనం వృథా అవుతోందో అర్థమైంది. ఈ మొత్తాన్నే రాష్ట్రాభివృద్ధికి ఖర్చుపెడితే... అభివృద్ధి సాధ్యమనిపించింది’ అంటారు 48 ఏళ్ల హెకానీ. ఆ ఆశయంతోనే ఎన్‌డీపీపీ తరఫున దిమాపుర్‌ నుంచి పోటీ చేసి గెలుపొంది.. ఆ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళగా నిలిచారు.

భర్త అడుగుల్లో.. ఇంటర్‌ చదివిన సల్హౌతునొ క్రుసె హోటల్‌ నిర్వహిస్తున్నారు. 24 ఏళ్లుగా అనగామీ విమెన్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా సమాజసేవ చేస్తున్నారు. ఆ సంస్థకు ప్రెసిడెంట్‌, అడ్వయిజర్‌ కూడా!. రాజకీయ నేపథ్యం లేదు. కానీ 2018 ఎన్నికల్లో ఈవిడ భర్త కెవిసేకో క్రుసె ఎన్‌డీపీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అదే ప్రత్యర్థిపై ఈవిడ పోటీచేసి 7ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈవిడ సేవలు మెచ్చి, మద్దతుగా అసోం, నాగాలాండ్‌ ముఖ్యమంత్రులు స్వయంగా ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్