గోళ్ల అందం, ఆరోగ్యం.. మన చేతుల్లోనే!
గోళ్లు అందాన్ని పెంచడం మాటెలా ఉన్నా.. అవి పరిశుభ్రంగా లేకపోతే మాత్రం వివిధ అనారోగ్యాల్ని మోసుకొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే అటు గోళ్ల అందమూ ఇనుమడిస్తుంది.. ఇటు ఆరోగ్యంగానూ ఉండచ్చు.. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..
గోళ్లు అందాన్ని పెంచడం మాటెలా ఉన్నా.. అవి పరిశుభ్రంగా లేకపోతే మాత్రం వివిధ అనారోగ్యాల్ని మోసుకొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే అటు గోళ్ల అందమూ ఇనుమడిస్తుంది.. ఇటు ఆరోగ్యంగానూ ఉండచ్చు.. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..
తేమనందించాలి!
మానిక్యూర్‌లో భాగంగా గోళ్లను ట్రిమ్ చేయడం, షేప్ చేయడం, మర్దన చేయడం, పాలిష్ వేసుకోవడం.. ఇవన్నీ ఎలాగైతే కచ్చితంగా పాటిస్తామో.. అలాగే గోళ్లకు తేమనందించడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఇందుకోసం మార్కెట్లో ప్రత్యేకమైన మాయిశ్చరైజర్లు/నూనెలు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించి నెయిల్ క్యుటికల్ దగ్గర్నుంచి బయటివైపు నెమ్మదిగా, మృదువుగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ కాలంలోనైనా గోళ్లు పొడిబారిపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ల బెడదా ఉండదు.
పాలిష్ మంచిదే!
నెయిల్ పాలిష్‌లో ఉండే వివిధ రకాల రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనుకుంటారు కొందరు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పదే పదే చేతులు నీళ్లలో తడవడం, ఇతర పనుల రీత్యా.. గోళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. నిర్ణీత వ్యవధుల్లో దీన్ని తొలగించుకోవడం, ఇందుకోసం ఎసిటోన్ రహిత నెయిల్ పాలిష్ రిమూవర్‌ని ఉపయోగించడం శ్రేయస్కరం అని చెబుతున్నారు. అలాగే పాలిష్ ఎక్కువ రోజులు మన్నాలంటే.. ఇంటి పనులు, గార్డెనింగ్ పనులు చేసే క్రమంలో గ్లోవ్స్ ధరించడమూ ముఖ్యమే!
అందుకోసం పది నిమిషాలు!
రోజూ మనం ఎన్నో రకాల పనులు చేస్తుంటాం.. ఈ క్రమంలో చేతుల్ని శుభ్రం చేసుకున్నంత శ్రద్ధగా గోళ్లు క్లీన్ చేసుకోం. ఈ నిర్లక్ష్యమే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే గోళ్లను తరచూ శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు. ఇందుకోసం బయట దొరికే నెయిల్ క్లీనింగ్ సొల్యూషన్స్ ఎంచుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే సహజసిద్ధమైన ద్రావణాలు తయారుచేసి ఉపయోగించచ్చు.
ఈ క్రమంలో ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని అందులో టీస్పూన్ బేకింగ్ సోడా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో గోళ్లను పది నిమిషాల పాటు ముంచి ఉంచాలి. ఆపై నెయిల్ క్లీనింగ్ బ్రష్‌తో మృదువుగా రుద్ది శుభ్రం చేస్తే వాటిలో ఇరుక్కున్న సూక్ష్మ క్రిములు, మురికి సమూలంగా తొలగిపోతాయి.
‘బయోటిన్’ తప్పనిసరి!
మనం చేసే పనులే కాదు.. తీసుకునే ఆహారం కూడా గోళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో బయోటిన్ (బి విటమిన్) అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, నట్స్, గింజలు, చిలగడ దుంప, పుట్టగొడుగులు, అరటిపండ్లు, బ్రకలీ.. వంటి వాటిలో బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. నిపుణుల సలహా మేరకు దీన్ని సప్లిమెంట్స్ రూపంలోనూ తీసుకోవచ్చు.
ఇవి కూడా!
⚛ తడిసిన ప్రతిసారీ చేతుల్ని ఎలాగైతే పొడిగా తుడుచుకుంటామో.. గోళ్లనూ అలాగే పొడిగా తుడుచుకోవాలి. ఆపై మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
⚛ పదే పదే గోళ్లు కొరకడం వల్ల గోళ్లు డ్యామేజ్ అవడంతో పాటు వాటిలోని మురికి కడుపులోకి చేరి లేనిపోని ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
⚛ సాధారణంగా మన ఇళ్లలో అందరం ఒకే నెయిల్ కట్టర్/నెయిల్ క్లిప్ ఉపయోగించడం అలవాటు. కానీ దీనివల్ల క్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఎవరి కట్టర్ వారికి వేరుగా ఉండడమే మేలంటున్నారు. ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే గోరువెచ్చటి నీటిలో ముందుగా కట్టర్‌ను శుభ్రం చేసి పొడిగా తుడిచిన తర్వాతే వాడడం ఉత్తమం.
ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్లు వేధిస్తున్నా, గోళ్ల రంగు మారినా, పొడిబారిపోయినట్లు అనిపించినా.. నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.