Sanitary Products: వీటికీ ఎక్స్‌పైరీ ఉంటుంది..!

చాలావరకు తినే ఆహార పదార్థాల విషయంలోనే తయారీ, గడువు తేదీల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తుంటాం. అదే.. రోజూ వాడే వస్తువులకూ ఎక్స్‌పైరీ ఉంటుందన్న విషయం విస్మరిస్తుంటాం. నెలసరి సమయంలో మనం ఉపయోగించే శ్యానిటరీ ఉత్పత్తులూ ఇందుకు మినహాయింపు కాదు.

Published : 21 Aug 2023 12:27 IST

చాలావరకు తినే ఆహార పదార్థాల విషయంలోనే తయారీ, గడువు తేదీల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తుంటాం. అదే.. రోజూ వాడే వస్తువులకూ ఎక్స్‌పైరీ ఉంటుందన్న విషయం విస్మరిస్తుంటాం. నెలసరి సమయంలో మనం ఉపయోగించే శ్యానిటరీ ఉత్పత్తులూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ నిర్లక్ష్యమే జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది క్రమంగా వివిధ రకాల ప్రత్యుత్పత్తి సమస్యలకు దారితీస్తుందని, కలయిక సమయంలో భాగస్వామికీ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్యానిటరీ ఉత్పత్తుల గడువు తేదీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

ఏది, ఎన్ని రోజులు వాడాలి?

నెలసరి సమయంలో పరిశుభ్రతను పాటించేందుకు ప్రస్తుతం వివిధ రకాల శ్యానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. న్యాప్‌కిన్లు, కప్స్‌/డిస్క్‌లు, ట్యాంపన్స్‌.. వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని కొనుగోలు చేసే క్రమంలో చాలామంది ప్యాకెట్లపై ఉండే తయారీ, గడువు తేదీల్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇవి శరీరానికి బయట వాడే ఉత్పత్తులు కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నది చాలామంది ఆలోచన. కానీ అన్ని వస్తువుల్లాగే వీటికీ ఎక్స్పైరీ ఉంటుందని, దాన్ని పరిగణనలోకి తీసుకొనే వాటిని ఎన్ని రోజులు వాడాలో పరిశీలించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

శ్యానిటరీ న్యాప్‌కిన్ల ప్యాకెట్లపై తయారీ తేదీ రాసి ఉంటుంది.. దాని కిందే ఎప్పటిలోగా వాడాలో కూడా రాసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్తగా తయారైన న్యాప్కిన్లనే కొనుగోలు చేయడం మంచిది.

సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారుచేసిన ట్యాంపన్లను.. ఎక్కువ కాలమే వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగని ఏళ్ల తరబడి మూలన పడి ఉన్న ట్యాంపన్లను అస్సలు ఉపయోగించకూడదట! ఎందుకంటే అవి చూడ్డానికి తాజాగానే కనిపించినా.. వాటిపై అతి సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగి హాని కలిగించే ప్రమాదం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఎక్స్పైరీ తేదీని పరిశీలించడం అవసరం.

చాలావరకు మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తిరిగి ఉపయోగించే విధంగానే ఉంటాయి. అయితే వీటి నాణ్యత, మనం పాటించే పరిశుభ్రతను బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో వీటి లేబుల్‌ని ఓసారి పరిశీలించడం ముఖ్యమంటున్నారు.

ఇన్ఫెక్షన్లకు కారణం.. అదేనా?

శ్యానిటరీ ఉత్పత్తుల్ని కొనే క్రమంలో.. ప్యాకెట్‌ కొత్తగా ఉందా, లేదా అనేది పరిశీలిస్తుంటాం.. కానీ దాని ఎక్స్‌పైరీ తేదీపై మన దృష్టి పడదు. అయితే కొన్నిసార్లు ప్యాకెట్‌ కొత్తగా ఉన్నా.. ఏళ్ల తరబడి అవి మూలన పడి ఉండడం వల్ల ఆ ప్రదేశంలోని తేమ, హ్యుమిడిటీ కారణంగా.. వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల జననేంద్రియాల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఫలితంగా ఆ భాగంలో దురద, ఎర్రటి దద్దుర్లు, మంట.. వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే కోరి సమస్యను కొని తెచ్చుకునే కంటే.. కొనుగోలు చేసేటప్పుడే తయారీ-గడువు తేదీల్ని పరిశీలించడం, సరిగ్గా ప్యాక్ చేసిన వాటినే కొనడం మంచిదని గుర్తుపెట్టుకోండి.


ఈ జాగ్రత్తలు కూడా!

మామూలు రోజులతో పోల్చితే నెలసరి సమయంలో జననేంద్రియాల్లో పీహెచ్‌ స్థాయులు మారుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో వ్యక్తిగత శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ వహించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్యాడ్‌ మార్చుకున్న ప్రతిసారీ గాఢత తక్కువగా ఉండే సబ్బు, చల్లటి నీటితో ఆ భాగాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగని గాఢమైన, పరిమళాలు వెదజల్లే సబ్బులు/ద్రావణాలు ఉపయోగిస్తే వెజైనా వద్ద సహజంగా ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

జననేంద్రియాల్లో ఎక్కువ సమయం తేమగా, తడిగా ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్‌ని బట్టి ప్రతి మూడు నాలుగ్గంటలకోసారి ప్యాడ్‌ మార్చుకోవడం మరవద్దు. అలాగే మరీ ఎక్కువగా రక్తస్రావమైతే రెండు గంటలకోసారి మార్చుకోవడం మంచిది.

ఇక కప్స్‌ ఉపయోగించే వారు.. బ్లీడింగ్‌ని బట్టి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకొని.. శుభ్రపరిచి.. తిరిగి ఉపయోగించడం మంచిది. అదనంగా ఒకట్రెండు కప్స్‌ని దగ్గర ఉంచుకుంటే.. మరింత పరిశుభ్రతను మెయింటెయిన్ చేయచ్చు.

శ్యానిటరీ ఉత్పత్తుల్ని తేమ లేని చోట.. ఒరిజినల్‌ ప్యాకింగ్‌తోనే భద్రపరచడం మంచిది. ఒకవేళ ప్యాకెట్‌ తెరిచినా.. అందులోని న్యాప్‌కిన్లను వెంటనే వాడేయడం ఉత్తమం. కాబట్టి మీ నెలసరి రోజులు, బ్లీడింగ్‌ని బట్టి.. తక్కువ, ఎక్కువ సంఖ్యలో ప్యాడ్స్ ఉండే ప్యాకెట్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ప్లాస్టిక్‌తో తయారుచేసిన, బ్లీచ్‌ చేసిన నెలసరి ఉత్పత్తులు ఎక్కువ సమయం రక్షణనివ్వచ్చు. కానీ వాటి వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు అధికం. కాబట్టి సహజసిద్ధంగా తయారుచేసిన ఉత్పత్తుల్ని వాడడం, కప్స్‌ అయితే సిలికాన్తో తయారుచేసినది ఉపయోగించడం మేలు.

నెలసరి ఉత్పత్తులు వాడే ముందు, తర్వాత చేతులు శుభ్రపరచుకోవడమూ ముఖ్యమే. తద్వారా వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తపడ్డవారవుతారు.

కొంతమంది పడి ఉంటాయన్న ఉద్దేశంతోనో లేదంటే తక్కువ ధరకొస్తాయన్న భావనతోనో.. ఎక్కువ మొత్తంలో శ్యానిటరీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంటారు. అలాంటప్పుడు వాటి ఎక్స్‌పైరీ తేదీ దాటిపోయి.. ఈ తరహా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలిసి తెలిసి ఈ పొరపాటు చేయకుండా.. నెలసరి ఉత్పత్తుల్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం, తయారీ-గడువు తేదీల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించడం ముఖ్యం. అలాగే వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల విషయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా వెంటనే నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని