గర్భంతో ఉన్నప్పుడు శృంగారం చేయచ్చా?!
గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో సందేహాలుంటాయి. ఆ ఆహారం తినచ్చో, లేదో.. ఈ వ్యాయామం ప్రయత్నిస్తే ఏమవుతుందో, ఏమో.. ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుంటారు. మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలూ నిజమని....
గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో సందేహాలుంటాయి. ఆ ఆహారం తినచ్చో, లేదో.. ఈ వ్యాయామం ప్రయత్నిస్తే ఏమవుతుందో, ఏమో.. ఇలా ప్రతి చిన్న విషయానికీ భయపడిపోతుంటారు. మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలూ నిజమని నమ్మే అవకాశమూ లేకపోలేదు. అందులో శృంగారం కూడా ఒకటి. ఆరోగ్యానికి, అనుబంధానికి కీలకమైన ఈ ప్రక్రియను గర్భం ధరించాక కొనసాగించవచ్చో, లేదో అన్న సందేహం చాలామంది గర్భిణుల్లో తలెత్తడం సహజం. ఇదొక్కటనే కాదు.. ప్రెగ్నెన్సీలో కలయికకు సంబంధించిన మరెన్నో సందేహాలు-అపోహలతో సతమతమవుతుంటారు మరికొందరు. మరి, ఇంతకీ ప్రెగ్నెన్సీలో శృంగారం చేయచ్చా?, లేదా? ఈ క్రమంలో చాలామందిలో ఉండే అపోహలేంటి? తెలుసుకుందాం రండి..
ఆ జోన్‌లో లేని వారే..!
గర్భం ధరించాక కొంతమంది అతి సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. అడుగు తీసి అడుగు వేయడానికి భయపడుతుంటారు. అలాంటిది శృంగారమంటే..? అసలు ఆ ఆలోచనే రానివ్వరు. ఎందుకంటే దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని! కానీ హైరిస్క్ జోన్‌లో లేని జంటలు.. డాక్టర్ సలహా మేరకు నిర్భయంగా కలయికలో పాల్గొనచ్చంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని చెబుతున్నారు. అయితే ఇక్కడ గర్భిణి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లడం మాత్రం తప్పనిసరి. అలాగే పొట్టపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే! ఇంకా ఈ విషయంలో లోతైన సందేహాలేమైనా ఉంటే డాక్టర్‌ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
ప్రి-మెచ్యూర్ డెలివరీ అవుతుందా?
గర్భం ధరించాక శృంగారంలో పాల్గొంటే తొలి దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రి-మెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ ఈ రెండూ నిజం కావంటున్నారు నిపుణులు. కలయిక తర్వాత వెజైనా దగ్గర నొప్పి, కాస్త అసౌకర్యం సహజంగా జరిగేదేనని, అది మినహా ఇతర దుష్ప్రభావాలేమీ దీనివల్ల తలెత్తవని చెబుతున్నారు. అయితే ఇక్కడ స్పష్టత తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. నెలలు నిండే కొద్దీ శృంగారాన్ని కొనసాగించచ్చా, లేదా అని! గర్భిణిగా ఉన్న సమయంలో అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి.. ముందు మీ ఆరోగ్య స్థితిని డాక్టర్ వద్ద చెకప్ చేయించుకొని ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవడం మంచిది. తద్వారా ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తపడచ్చు.
ఇన్ఫెక్షన్ల ముప్పు ఎంత?
గర్భిణులు ఈ సమయంలో శృంగారం విషయంలో భయపడేది ఎందుకంటే.. దీనివల్ల తమ భాగస్వామి నుంచి ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనని, తద్వారా అవి తమ కడుపులోని బిడ్డకు ఎక్కడ చేటు చేస్తాయేమోనని! అయితే భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేనంత వరకు ప్రెగ్నెన్సీలో కలయిక సురక్షితమే అంటున్నారు నిపుణులు. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం అంటున్నారు. అయితే ఇలాంటప్పుడు కొంతమంది కండోమ్స్ వంటి సురక్షిత పద్ధతులు పాటిస్తుంటారు. కానీ ఆ రిస్క్ కూడా చేయకపోవడమే మంచిదట! ఇక మహిళలు కూడా చక్కటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మర్చిపోవద్దు.
ప్రయోజనాలివే!
గర్భం ధరించిన మహిళలు శృంగారం చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!
❃ శృంగారం వల్ల జననేంద్రియాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢమవుతాయి.. ఆయా భాగాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా దూరమవుతాయి.
❃ కలయిక వల్ల దంపతుల మధ్య దూరం పెరగకుండా అనుబంధం రెట్టింపవుతుంది.
❃ గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్‌గా, చురుగ్గా ఉండడానికీ శృంగారం తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వులు, క్యాలరీలు కరగడమే ఇందుకు కారణం.
❃ శృంగార ప్రక్రియ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి గర్భిణిగా ఉన్న సమయంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీ సౌకర్యం, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కలయికలో పాల్గొనడం మంచిది.
❃ లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు. తద్వారా తల్లీబిడ్డలిద్దరూ రిలాక్సవ్వచ్చు.
వీళ్లు చేయద్దు!
హైరిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలే కాదు.. మరికొంతమంది సైతం గర్భధారణ సమయంలో శృంగారానికి దూరంగా ఉండడమే మేలంటున్నారు నిపుణులు.
❃ వెజైనా సమస్యలున్న వారు..
❃ కడుపులో కవలలు పెరుగుతున్నట్లయితే..
❃ గర్భ సంచి వదులుగా ఉండి కుట్లు వేయించుకున్న వారు..
❃ వెజైనా నుంచి బ్లీడింగ్, ఉమ్మనీరు, వైట్ డిశ్చార్జి.. వంటివి అవుతుంటే..
❃ గతంలో ప్రి-మెచ్యూర్ డెలివరీ అయిన వారు కూడా గర్భస్థ సమయంలో శృంగారానికి దూరంగా ఉండడమే మంచిదట!
ఎంత ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ అయినా సౌకర్యంగా అనిపించినంత వరకు మాత్రమే శృంగార ప్రక్రియను కొనసాగించడం మంచిది. అలాగే ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలున్నా.. కలయిక సమయంలో బ్లీడింగ్, నొప్పిగా అనిపించినా.. ఎలాంటి సంకోచం లేకుండా డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం, వారిచ్చే సలహాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.