Published : 22/01/2023 13:08 IST

చర్మానికీ ఉపవాసం.. ఇదేంటో తెలుసా?

సాధారణంగా ఉపవాసం అంటే.. కొన్ని గంటల పాటు లేదంటే రోజంతా ఏం తినకుండా పొట్టను పస్తులుంచడం. దీనివల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇలాంటి లంఖనం మన శరీరానికే కాదు.. చర్మానికీ అవసరమే అంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా చర్మం పునరుత్తేజితమై అందం ఇనుమడిస్తుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ చర్మానికి ఉపవాసమేంటి? దీన్నెలా పాటించాలి? దీనివల్ల సౌందర్య పరంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? రండి.. తెలుసుకుందాం!

అసలేంటీ ట్రెండ్?

చర్మానికి ఉపవాసం (Skin Fasting).. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. రోజురోజుకీ చాలామంది సౌందర్య ప్రియుల ఆదరణ చూరగొంటోందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు దీనివల్ల చేకూరే బహుళ ప్రయోజనాలే కారణమట! అయితే దీన్ని పాటించడం కూడా చాలా సులువంటున్నారు నిపుణులు. మనం శరీరాన్ని ఎలాగైతే గంటల కొద్దీ పస్తులుంచుతామో.. చర్మంతో కూడా కొన్ని గంటల పాటు ఉపవాస దీక్ష చేయించాలట! అంటే.. ఒక నిర్ణీత సమయం పాటు చర్మానికి ఎలాంటి సౌందర్య ఉత్పత్తుల్ని ఉపయోగించకుండా అలా ఊపిరి పీల్చుకోనివ్వడమే స్కిన్‌ ఫాస్టింగ్ ముఖ్యోద్దేశం. ఒక రకంగా ఇదీ స్కిన్‌ డీటాక్స్‌ లాంటిదే! ఈ బ్యూటీ ట్రెండ్‌ పుట్టింది జపాన్‌లోనే అయినా.. ప్రస్తుతం ప్రపంచమంతా నెమ్మదిగా విస్తరిస్తోంది. చర్మంలోని నూనెల్ని నిలిపి ఉంచి చర్మాన్ని నవ యవ్వనంగా, ప్రకాశవంతంగా మార్చుకోవడానికే జపనీయులు ఈ పద్ధతిని పాటిస్తుంటారని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండూ ముఖ్యం!

స్కిన్‌ ఫాస్టింగ్‌లో భాగంగా రోజుల తరబడి చర్మానికి ఎలాంటి సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించకుండానైనా ఉండచ్చు.. లేదంటే రోజూ రాత్రి పడుకునే ముందు నైట్‌ క్రీమ్‌/మాయిశ్చరైజర్‌.. వంటి ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించకుండా చర్మాన్ని అలా వదిలేయచ్చు. ఈ క్రమంలో పడుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవడం, మరునాడు ఉదయం నిద్ర లేచాక గోరువెచ్చటి నీళ్లతో మరోసారి ముఖాన్ని శుభ్రపరచుకోవడం ముఖ్యం. తద్వారా చర్మంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోయి చర్మం శుభ్రపడుతుంది. అలాగే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాల కారణంగా తొలగిపోయే సహజసిద్ధమైన నూనెలు కూడా నిలిచి ఉండి.. చర్మం తేమగా, నవయవ్వనంగా మారుతుంది.

చర్మతత్వాన్ని పసిగట్టేయచ్చు!

స్కిన్‌ ఫాస్టింగ్‌ ప్రక్రియను పాటించడం ద్వారా చర్మతత్వాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దాన్ని బట్టే మీకు సరిపడే సౌందర్య ఉత్పత్తుల్ని ఎంచుకోవడం సులభమవుతుందంటున్నారు. ఈ క్రమంలో టిష్యూ పేపర్‌ టెస్ట్‌ ఫలితాలనిస్తుందని చెబుతున్నారు. అదెలా చేయాలంటే..!

రాత్రంతా చర్మానికి ఏమీ రాయకుండా ఉండి ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక.. పొడిగా తుడుచుకోవాలి. ఆపై ముఖంపై ఓ శుభ్రమైన టిష్యూ పేపర్‌ని ఉంచాలి. అది చర్మానికి అతుక్కోకుండా సులభంగా కింద పడిపోతే పొడిచర్మ తత్వమని, కొద్దిగా అతుక్కుంటే సాధారణ చర్మమని, అదే మరింతగా ముఖానికి అతుక్కుపోతే ఆయిలీ స్కిన్‌గా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో పొడి చర్మతత్వం ఉన్న వారు మాయిశ్చరైజర్‌ను కొనసాగించడం, అదే ఆయిలీ స్కిన్‌ ఉన్న వారు నూనె సంబంధిత ఆహార/సౌందర్య ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది.

ప్రయోజనాలివీ!

వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు, సాధనాల వల్ల చర్మం పొడిబారడం, మొటిమలు రావడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే స్కిన్‌ ఫాస్టింగ్‌లో భాగంగా వీటన్నింటికీ స్వస్తి పలుకుతాం.. కాబట్టి చర్మానికి తనను తాను రిపేర్‌ చేసుకునే సమయం దొరుకుతుంది. ఫలితంగా చర్మం తిరిగి పునరుత్తేజితమవుతుంది.

చర్మానికి కొన్ని గంటల పాటు/రోజుల తరబడి ఏమీ రాయకుండా ఉండి.. ఉపవాసం ఉంచడం వల్ల మీ చర్మానికి ఏయే ఉత్పత్తులు సరిపడుతున్నాయో కూడా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా చర్మతత్వానికి నప్పే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఎంచుకోవడం సులువవుతుంది.

అయితే ఈ పద్ధతి శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ.. చర్మానికి ఎలాంటి ఉత్పత్తులు వాడకుండా, సహజసిద్ధంగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తున్నాం కాబట్టి.. దీనివల్ల దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే అధికమని చెబుతున్నారు నిపుణులు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

చర్మాన్ని ఉపవాసం ఉంచే క్రమంలో నీళ్లు ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు. తద్వారా చర్మంలో తేమ నిలిచి ఉండి మరిన్ని మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు.

ఈ ఉపవాసం చేసే క్రమంలో గదిలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా కాకుండా, మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి.

వివిధ రకాల చర్మ చికిత్సలు తీసుకునే వారు ఈ ఉపవాసం చేయకపోవడమే మేలంటున్నారు నిపుణులు.

అయితే రాత్రి పూట చర్మాన్ని ఉపవాసం ఉంచడం వల్ల సత్ఫలితాలు సొంతమైనా.. పగటి పూట ఈ పద్ధతిని పాటించడం వల్ల సూర్య కిరణాల వల్ల చర్మంపై ట్యాన్‌, కమిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు.. వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు కొందరు నిపుణులు. అందుకే ఈ ఉపవాసం మీ చర్మతత్వానికి నప్పుతుందా? లేదా? ఎన్ని రోజుల పాటు, ఏ సమయంలో కొనసాగించాలి? వంటి విషయాల గురించి నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు. తద్వారా చర్మ ఆరోగ్యం దెబ్బ తినకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని